May 17,2022 13:21

న్యూఢిల్లీ :  ముంబయి వీధుల్లో పువ్వులు అమ్మి జీవించే సరితా మాలి (28)కి అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్శిటీలో పిహెచ్‌డి చేసేందకు అడ్మిషన్‌ పొందింది. ఆమె ప్రస్తుతం జెఎన్‌యులోని భారతీయ భాషా కేంద్రంలో హిందీ సాహిత్యంలో పిహెచ్‌డి చేస్తోంది. జెఎన్‌యులో ఎంఎ, ఎంఫిల్‌ లను పూర్తి చేసిన ఆమె జులైలో పిహెచ్‌డిని సమర్పించనుంది. ప్రతి ఒక్కరి జీవితంలోనూ హెచ్చు తగ్గులు ఉంటాయని, ప్రతి ఒక్కరికి తమవైన కథలు, బాధలు ఉంటాయని సరితా పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు సమస్యల నెలవైన సమాజంలో తాను పుట్టానని అన్నారు. చిన్న నాటి నుండి పండుగల సమయాల్లో తన తండ్రితో కలిసి పూలు విక్రయించేవారమని, కరోనాతో తన తండ్రి జీవనోపాధి కోల్పోయారని పేర్కొంది. పుట్టినప్పటి నుండి పూలను మాత్రమే చూశానని ఇదే తన జీవితం అని ఆగిపోలేదని అన్నారు. పోరాటాలు, ఆశలు, సమస్యలు, కష్టపడి పనిచేయాలనే అభిరుచి అన్నీ ఉన్నాయని.. తన కుటుంబం మద్దతుతో ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు. జెఎన్‌యు తనజీవితాన్ని మార్చిందని అన్నారు. ఇక్కడ అడ్మిషన్‌ పొందకపోయి ఉంటే తన జీవితం ఎలా ఉండేతో తెలియదని అన్నారు. తన సమాజం నుండి వచ్చే ప్రజలకు జెఎన్‌యు మంచి అవకాశాలు కల్పిస్తుందని చెప్పారు.