Jan 13,2021 06:53

బర్డ్‌ఫ్లూ గా బహుళ ప్రచారంలో ఉన్న ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా భారత్‌కు కోవిడ్‌-19 తర్వాత మరో ప్రమాదకరమైన వైరస్‌గా ముందుకొస్తున్నది. ఇప్పటికే కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ వంటి ఓ డజను రాష్ట్రాలను తాకింది. ఇది పెనుముప్పుగా మారకముందే ఈ విపత్తును నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గట్టి చర్యలు చేపట్టాలి. అసలే అంతంతమాత్రంగా వున్న ప్రజారోగ్య వ్యవస్థ కోవిడ్‌-19 మహమ్మారిని ఎదుర్కోలేక చతికిలపడింది. ఇప్పుడు ఈ హెచ్‌5 ఎన్‌1 అనే వైరస్‌ అత్యంత వేగంగా విస్తరించే ప్రమాదకర వ్యాధికారకంగా వున్నట్లు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా ఉపజాతులు అనేకంగా వున్నప్పటికీ వీటిలో హెచ్‌5 ఎన్‌1, హెచ్‌5 ఎన్‌8 వైరస్‌లు పక్షులకే కాకుండా వాటి నుంచి మనుషులకు కూడా వ్యాప్తి చెందే అవకాశం వుంది. రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ, హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ బారినపడి వేలాది కోళ్లు చనిపోయాయి. దీంతో మిగతా రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. పదిహేనేళ్ల క్రితం బర్డ్‌ఫ్లూ తాకిడికి దేశంలో కోళ్ల పరిశ్రమ అతలాకుతలమయ్యింది. కోళ్లు లేదా బాతుల నుంచి 120 మంది వ్యక్తులకు ఇది పాకింది. వీరిలో సగం మంది చనిపోయారు. ఒకవైపు కోవిడ్‌-19 వైరస్‌ బుసలుకొడుతున్న తరుణంలో బర్డ్‌ ఫ్లూ వచ్చిపడ్డంతో ఇది ఎటువంటి వైపరీత్యానికి దారితీస్త్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఇన్‌ఫ్లూయంజా వల్ల రిస్క్‌ తక్కువే అయినప్పటికీ సరైన నివారణా చర్యలు తీసుకోకపోతే ఇది అనతి కాలంలోనే మొత్తం దేశాన్ని వణికించే స్థితి రావచ్చు. ప్రజారోగ్య వ్యవస్థ బలహీనంగా వున్న భారత్‌ వంటి దేశాల్లో ఇది మరింత ఆందోళనకరంగా పరిణమించవచ్చు. గతంలో చాలా దేశాల్లో ఈ వ్యాధి ప్రబలినప్పుడు అరవై ఏళ్ల వయసుపైబడినవారు ఎక్కువగా చనిపోయినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. ఈ ఇన్‌ఫ్లూయంజాను అరికట్టేందుకు కోళ్లు, బాతులకు సంవత్సరానికి ఒకసారి టీకాలు వేసే కార్యక్రమం ఇతర దేశాల్లో సాగుతున్నట్లుగా మన దేశంలో లేదు. అసలు ఇందుకు సంబంధించిన సమాచారాన్ని నిర్వహించే స్థితి కూడా లేదు.


బర్డ్‌ఫ్లూ రాకుండా ముందస్తుగా చేపట్టాల్సిన నివారణా చర్యల్లోనూ, వ్యాధి ప్రబలిన తర్వాత వ్యాధి కారకాలను గుర్తించేందుకు లేబరేటరీ సంబంధిత సేవల విషయంలోనూ లోపం వుంది. మన ప్రజారోగ్య వ్యవస్థ చాలా బలహీనంగా వుంది. ప్లేగు వ్యాధిని గతంలో భారత్‌ పూర్తిగా అరికట్టగలిగామని చెప్పుకున్నప్పటికీ 1994 తర్వాత రెండుసార్లు ఈ అంటువ్యాధి తిరిగి విజృంభించింది. బర్డ్‌ ఫ్లూ విషయంలో కూడా భారత్‌కు ఇదే చేదు అనుభవం తరచూ ఎదురవుతూ ఉంది. జనవరి మొదటి వారంలో కొన్ని రాష్ట్రాల్లో అసహజమైన రీతిలో పక్షులు ముఖ్యంగా బాతులు, కోళ్లు, కాకులు ఇతర అడవి పక్షులు పెద్ద సంఖ్యలో చనిపోవడం రాగల ప్రమాదానికి ఒక సంకేతం ఇచ్చినట్లయింది. రాజస్థాన్‌, మధ్య ప్రదేశ్‌లలో కాకులు ఎక్కువగా చనిపోయాయి. కేరళ లోని కొట్టాయం, అలప్పుజాలలో బర్డ్‌ ఫ్లూ వ్యాధి కారకాలు బయట పడగానే 2015 జాతీయ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా ప్రణాళిక ప్రకారం వైరస్‌ సోకినట్లు భావించి ముందస్తు జాగ్రత్తగా కోళ్లు, బాతులతో సహా వేలాది పక్షులను ఖననం చేశారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కూడా దీనితో అప్రమత్తమయ్యాయి. ఈ వైరస్‌ ఎక్కువగా వలస పక్షులు, అడవి పక్షుల నుండే సంక్రమిస్తుంది. శీతాకాలంలో ఇది పెంపుడు పక్షులకు కూడా సోకే/వ్యాపించే అవకాశం ఎక్కువ. పౌల్ట్రీ పరిశ్రమలే కాకుండా ఇంటి దగ్గర పెంచుకునే పక్షులకు టీకాలు వేయడం జీవభద్రతకు సంబంధించి అన్ని చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది. అసలే పండగల సీజన్‌. కోడి మాంసం ప్రియులకు ఏవియన్‌ ఇన్‌ఫ్లూయంజా ఒక శాపంలా మారింది. అయితే కోడి మాంసాన్ని బాగా ఉడకబెట్టి తీసుకుంటే ఎలాంటి సమస్యా వుండకపోవచ్చు. అలాగని ఈ వైరస్‌ ముప్పును తక్కువగా అంచనా వేయరాదు. కోడిపందేల 'మజా'ను ఆస్వాదించే పనిలో మునిగివున్న పాలక, ప్రధాన ప్రతిపక్ష వర్గీయులకు అటు ప్రజలకు సోకే కరోనా గురించిగాని ఇటు కోళ్లకు సోకే ఏవియన్‌ ఫ్లూ గురించి గాని పట్టించుకునే తీరిక వుందా అన్నది ప్రశ్నార్ధకమే.