May 09,2021 23:26

కరోనా వైరస్‌

ప్రజాశక్తి - నాదెండ్ల : కుటుంబం మొత్తానికి సోకిన కరోనా తొలుత భర్తను బలిగొనగా తాజాగా భార్యసైతం మృత్యువాత పడింది. మండలంలోని సాతులూరులో కరోనా కొద్దిరోజులు తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 4వ తేదీన గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్‌ అయిన 50 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించాడు. అతని భార్య, కుమార్తె, కుమారునికీ వైరస్‌ సోకడంతో వారంతా గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో చికిత్స పొందుతున్నారు. అయితే ఆదివారం భార్య మృతి చెందింది. దీంతో గ్రామంలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. గ్రామంలో ఇప్పటికే 15 మంది వైరస్‌ కారణంగా మృతి చెందగా మరో 100 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, మరింత మంది మృత్యువాత పడకుండా కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.