Feb 24,2021 00:28

సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్‌ వినరుచంద్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం
మార్చి 10వ తేదీన జరిగే మహా విశాఖ నగర పాలక సంస్థ, నర్సీపట్నం, యలమంచిలి పురపాలక సంస్థల ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ వి.వినరుచంద్‌ ఆదేశించారు. జీవీఎంసీ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల నియమ, నిబంధనలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుంటే నిర్వహణ సులభమవుతుందన్నారు. జిల్లాలో జరిగిన నాలుగు దశల పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించామని, ఆ ఎన్నికలలో పనిచేసిన అధికారుల సేవలను వినియోగించు కోవాలన్నారు. జీవీఎంసీలో ఎన్నికలు జరిగి చాలా కాలమైనందున జాయింట్‌ కలెక్టర్లకు, జోనల్‌ కమిషనర్లకు సహకరించేందుకు రెవెన్యూ శాఖకు చెందిన స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను నియమించామని చెప్పారు. శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు, ఎటువంటి లోపాలు రానీయకుండా చూసేందుకు నోడల్‌ అధికారులను నియమించినట్లు పేర్కొన్నారు. అధికారులకు అప్పగించిన విధులను వేగంగా, స్పష్టంగా, నేర్పుతో చేయాలన్నారు.
నగరంలో 98 వార్డులకు 31 మంది రిటర్నింగ్‌ అధికార్లు ఉంటారని తెలిపారు. జోనల్‌ కమిషనర్లే కీలకంగా వ్యవహరించాలని చెప్పారు. నామినేషన్ల విరమణ, గుర్తుల కేటాయింపు, తుది జాబితా తయారుచేయడం పక్కాగా చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి సామగ్రిని అందజేసేందుకు ప్రణాళిక ప్రకారం ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బ్యాలట్‌ బాక్సులను, ఓటర్ల జాబితా ఐదు కాపీలు ముందుగా సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సెక్రటేరియట్‌ సిబ్బందిని ఎన్నికలలో ఉపయోగించుకోవచ్చని, వార్డు వాలంటీర్లను మాత్రం వినియోగించరాదని పేర్కొన్నారు.
పోలింగ్‌ కేంద్రాలను మూడు పర్యాయాలు పరిశీలించాలని, తాగునీరు మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను కల్పించాలని చెప్పారు. అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి తగిన శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటుచేయాలని పేర్కొన్నారు. బ్యాలెట్‌ పేపర్‌ ప్రింట్‌ చేయడంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రచార సమయాలను, నియమాలను ఉల్లంఘించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సూక్ష్మ పరిశీలకులు, వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ పక్కాగా ఉండాలన్నారు. పోలింగ్‌ సిబ్బందికి వాహనాలు, శుభ్రమైన ఆహారం నామినేషన్ల ప్రక్రియ, ఓటింగ్‌ సరళి, ఫలితాల వెల్లడిలో ఎటువంటి ఆలస్యం పనికి రావని పేర్కొన్నారు. కంట్రోల్‌ రూమ్‌ నుండి ఎప్పటికప్పుడు రిపోర్టులను పై అధికారులకు అందజేయాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పని చేస్తూ ఎన్నికలను విజయవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ కమిషనర్‌ నాగలక్ష్మి, జాయింట్‌ కలెక్టర్లు పి.అరుణ్‌బాబు, ఆర్‌.గోవిందరావు, అడిషనల్‌ కమిషనర్లు ఎవి.రమణి, పి.ఆశాజ్యోతి, వి.సన్యాసిరావు, డిఆర్‌డిఎ పీడీ వి.విశ్వేరరావు, డిఆర్వో ఎ.ప్రసాద్‌, జిల్లా పంచాయతీ అధికారి వి.కృష్ణ కుమారి, సాంఘిక సంక్షేమ జెడి డివి.రమణమూర్తి, జెడ్‌.పి. సిఇఒ వి.నాగార్జునసాగర్‌, ఎస్‌డిసి సిహెచ్‌.రంగయ్య, డిఇఒ బి.లింగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.