May 16,2022 12:48

అనంతపురం : నేటి నుంచి జరగవలసిన మున్సిపల్‌ కార్మికుల రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేశామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యధోరణికి వ్యతిరేకంగా, యు.వి వీరికి చెల్లించాల్సిన బకాయి హెల్త్‌ అలవెన్స్‌లను తక్షణమే చెల్లించాలని, రెగ్యులర్‌ చేయాలని, సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కార్మికుల సంఖ్యను పెంచాలని, తదితర డిమాండ్ల సాధన కోసం నేటి నుండి చేపట్టనున్న రిలే నిరాహార దీక్షను మున్సిపల్‌ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఇచ్చిన హామీ మేరకు తాత్కాలికంగా వాయిదా వేశామని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి బి.మల్లికార్జున తెలిపారు. సోమవారం తెల్లవారుజామున పాత మున్సిపల్‌ కార్యాలయం వద్ద కార్మికులతో సిఐటియు నేతలు సమావేశమయ్యారు. నిన్నటి రోజున మునిసిపల్‌ యూనియన్‌ నాయకులతో మున్సిపల్‌ శాఖ మంత్రి చర్చించిన విషయాలను, మంత్రి ఇచ్చిన హామీల గురించి కార్మికులకు తెలిపారు. నిన్నటి రోజున మునిసిపల్‌ యూనియన్‌ రాష్ట్ర నాయకులతో మున్సిపల్‌ శాఖ మంత్రి చర్చలు జరిపారని ఈ చర్చల్లో కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని, అందుకనే మంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ దీక్షలను వాయిదా వేశామన్నారు. ఒకవేళ ప్రభుత్వం కానీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కానీ ఇచ్చిన హామీని నెరవేర్చకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించే ప్రసక్తే లేదని, అవసరమైతే తిరిగి పోరాటాలకు సిఐటియు సిద్ధమవుతుందని తెలిపారు. మంత్రి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.