
ప్రజాశక్తి - సాలూరు : దీర్ఘ కాలంగా పెండిం గ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యాన కార్మికులు సోమవారం సంతకాల సేకరణ చేపట్టారు. ఫెడరేషన్ నాయకులు టి.శంకరరావు ఆధ్వర్యాన కార్మికుల సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని రాష్ట్ర గవర్నర్‌కు పంపనున్నారు. సమస్యలను పరిష్కరించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పని చేస్తున్న 40వేల మంది మున్సిపల్ కార్మికుల సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పారు. గత ఎన్నికల ముందు సిఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను విస్మరించారని చెప్పారు. శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ కార్మికులతో ప్రభుత్వం పని చేయిస్తుందని అన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. జనాభా పెరిగిన కారణంగా కార్మికుల సంఖ్యను పెంచాలని కోరారు. సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని శంకరరావు డిమాండ్ చేశారు.