Feb 22,2021 20:29

నెపిడా : మయన్మార్‌లో సైనిక కుట్రను నిరసిస్తూ సోమవారం సార్వత్రిక సమ్మె జరిగింది. దుకాణాలు, వ్యాపార సంస్థలన్నీ మూతపడ్డాయి. సైన్యంతో ఘర్షణ పడడం వల్ల మరిన్ని ప్రాణాలు కోల్పోయే ప్రమాదముందని సైన్యం(జుంటా) హెచ్చరికలు జారీ చేసినప్పటికీ దాన్ని లెక్కపెట్టకుండా వేలాది మంది ఆందోళనకారులు పట్టణాలు, నగరాల్లో ఆందోళనలు చేపట్టారు. కాల్పుల్లో మరణించిన వారి అంత్యక్రియలకు ఆదివారం వందలాది మంది హాజరయ్యారు. ఇప్పటివరకు తిరుగుబాటు కుట్రను నిరసిస్తూ జరిగిన ఆందోళనలపై సైన్యం జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. కాగా తిరుగుబాటు జరిగి మూడు వారాలు గడిచినా నిరసనలు, ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతూనే ఉన్నాయి. కుట్రను తిప్పికొట్టి సూకీని తిరిగి అధికారంలో కూర్చోబెట్టేందుకు ఈ ఉద్యమం ప్రారంభమైంది. ప్రతిఒక్కరూ ఇందులో చేరుతున్నారని, ఇంకా మరింతమంది ముందుకు వస్తారని యాంగాన్‌ నగరానికి చెందిన శాన్‌మా వ్యాఖ్యానించారు. ఆందోళనకారులపై చర్యలు తీసుకునే అవకాశం వుందని ప్రభుత్వ మీడియా ద్వారా సైన్యం సోమవారం హెచ్చరించింది. యువతను రెచ్చగొట్టి ఇలా సైనిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎదురు తిరగడం వల్ల ప్రాణాలు కోల్పోవడం తప్ప మరేమి వుండదని పేర్కొంది. కొన్ని దేశాలు చేస్తున్న వ్యాఖ్యలు తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేనని విమర్శించింది. కాగా ఆందోళనకారులకు జుంటా హెచ్చరికలు జారీ చేయడం పట్ల ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల ప్రత్యేక దూత టామ్‌ ఆండ్రూస్‌ ఆందోళన వ్యక్తం చేశారు.