Jun 23,2022 13:03

న్యూయార్క్‌ : మీడియా సంస్థల అధినేత, బిలినీయర్‌ రూపర్ట్‌ మర్టాక్‌, నటి జెర్రీ హాల్‌ విడాకులు తీసుకోబోతున్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌ టైమ్స్‌ తెలిపింది. 2016లో నటి జెర్రీని అత్యంత సన్నిహితుల మధ్య రూపర్ట్‌ నాల్గవ వివాహం చేసుకున్నారు. ప్రముఖ మీడియా సంస్థ ఫాక్స్‌ కార్పొరేషన్‌ సహ వ్యవస్థాపకుడు అయిన రూపర్ట్‌కు ప్రస్తుతం 91 ఏళ్లు. దీంతో పాటు ఆయనకు వాల్‌స్ట్రీట్‌ జర్నల్స్‌ మాతృసంస్థ న్యూస్‌ కార్పొరేషన్‌కు ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. హర్పర్‌ కొల్లిన్స్‌, టైమ్స్‌ ఆఫ్‌ లండన్‌ వంటి పలు సంస్థలు ఉన్నాయి. ప్రతి కంపెనీ ఓటింగ్‌ షేర్లలో ఆయనకు దాదాపు 40 శాతం వాటా కల్గి ఉన్నారు. కాగా, ఈ విడాకుల వార్తలపై రూపర్ట్‌ ప్రతినిధి బ్రైస్‌ టామ్‌ వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. రూపర్ట్‌కు సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఈ విడాకుల వార్తను ధ్రువీకరించినట్లు టైమ్స్‌ పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆస్తుల నికర విలువ 17.7 బిలియన్ల డాలర్లు ఉంటుందని ఫోర్బ్స్‌ అంచనా వేసింది.