May 25,2023 21:55
  • పోలవరంపై వారంలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం
  • కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మొత్తం ఎత్తు 45.72 మీటర్లు కాకుండా, తొలిదశ అయిన 41.15 మీటర్ల ఎత్తుకే కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మేరకు 41.15 మీటర్ల ఎత్తుతో తొలిదశ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలు తయారు చేసేందుకు గురువారం ఢిల్లీలో కీలక సమావేశం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పిపిఎ) సిఇఒ శివనందన్‌కుమార్‌, సభ్యకార్యదర్శి రఘురామ్‌, కేంద్ర జలసంఘం (సిడబ్ల్యుసి) ఛైర్మన్‌ కుశ్వీందర్‌ సింగ్‌ ఓరా, సభ్యులు నవీన్‌కుమార్‌ హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు తొలిదశను పూర్తిచేయడానికి రూ.16,952.07 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినట్లు పిపిఎ వివరించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రూ.10 వేలకోట్లను అడ్‌హాక్‌ నిధుల కింద ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపింది. గోదావరి వరదల ఉధృతికి దెబ్బతిన్న డయాఫ్రమ్‌ వాల్‌, ప్రధాన డ్యామ్‌ నిర్మాణ ప్రాంతంలో ఏర్పడిన అగాధాలను పూడ్చటంతోపాటు 41.15 మీటర్ల కాంటూర్‌ పరిధిలో కొత్తగా 36 గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి అవసరమైన వ్యయంపై పిపిఎ అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టులో కేవలం పునరావాసం కోసమే రూ.33,168.23 కోట్లు అవసరమవుతాయని అన్నారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టులో కీలకమైన ఎగువ కాఫర్‌ డ్యామ్‌, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనులతోపాటు స్పిల్‌వై, అప్రోచ్‌ కెనాల్స్‌ పనులు పూర్తయ్యాయని వివరించారు. ప్రస్తుతం ఎర్త్‌కం రాక్‌ ఫీల్డ్‌ డ్యామ్‌ పనులు జరుగుతున్నాయన్నారు. వర్షాలు కురిసి వరదలు వచ్చే జూన్‌ నాటికి ఈ పనులు పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ మేరకు తొలిదశ సవరించిన అంచనా వ్యయం రూ.16,950 కోట్లతో రూపొందించే నివేదికను ఖరారు చేశాక ఆ ప్రతిపాదనలు వారంలోపు తమకు నివేదించాలని పంకజ్‌కుమార్‌ ఆదేశించారు. ఈ ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలికి పంపాల్సి వుంటుందని తెలిపారు. ఆ అంచనా వ్యయంపై కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేస్తే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.