
శ్రీలంక అనుభవం కళ్లెదుట కనిపిస్తున్నా దాని నుంచి ఎలాంటి గుణపాఠం తీసుకోడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదనడానికి సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విద్యుత్ చట్ట(సవరణ) బిల్లు ఒక నిదర్శనం. ప్రతిపక్షాలు, రైతు, కార్మిక సంఘాలు, విద్యుత్ రంగ ఉద్యోగులు, ఇంజినీర్లు అందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా బేఖాతరు చేస్తూ విద్యుత్ సంస్కరణల ఎజెండాతో ముందుకెళ్తున్నది. బడా కార్పొరేట్లకు, బహుళజాతి సంస్ధలకు విద్యుత్ రంగంపై గుత్తాధిపత్యం కల్పించడమే ఈ బిల్లు అసలు ఉద్దేశం. అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల కార్పొరేట్ల రుణ బకాయిలను మాఫీ చేసిన మోడీ ప్రభుత్వం ఇప్పుడు విద్యుత్ చట్ట సవరణ బిల్లు రూపంలో మరో కానుక ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ బిల్లులోని అంశాలను లోతుగా పరిశీలించి చూసినవారికెవరికైనా ఇది ఎంత ప్రమాదకరమైనదో అర్థమవుతుంది. గ్రామీణ పేదలు, రైతులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల యజమానులు ఇలా అనేక రంగాలపై ఈ విద్యుత్ సంస్కరణలు తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
1948లో విద్యుత్ చట్టాన్ని అంబేద్కర్ తీసుకొస్తూ విద్యుత్తును లాభార్జన సరుకుగా చూడరాదని, గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లోని పేదలకు అందుబాటులో ఉండేలా చూడడం ప్రభుత్వ కనీస బాధ్యత అని నొక్కి చెప్పారు. 2003లో వాజ్‌పేయి ప్రభుత్వం మార్కెట్ శక్తుల ప్రయోజనాలకు అనుగణంగా ఈ చట్టానికి కొన్ని మార్పులు చేర్పులు చేసింది. బడా కార్పొరేట్లకు, బహుళజాతి సంస్థలకు విద్యుత్ రంగం తలుపులు బార్లా తెరవడానికి అడ్డంకిగా ఉన్న కొద్దిపాటి నిబంధనలను కూడా మోడీ ప్రభుత్వం ఈ బిల్లు ద్వారా తొలగించేస్తున్నది.
మోడీ ప్రభుత్వ ఈ ప్రజా వ్యతిరేక బిల్లు చట్ట రూపం దాల్చితే ఇప్పటికే సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగం మరింతగా కునారిల్లుతుంది. విద్యుత్ సంస్కరణల వల్ల వ్యసాయ రంగంపై యేటా లక్ష కోట్ల అదనపు భారం పడబోతోంది. ఇరిగేషన్ ఖర్చు 500 శాతం దాకా పెరుగుతుంది. 2018-19 సంవత్సరపు పవర్ ఫైనాన్స్ కమిషన్ నివేదిక ప్రకారం మొత్తం విద్యుత్ విక్రయాల్లో 22.4 శాతం వ్యవసాయ రంగానికి వెచ్చించారు. ఆ సంవత్సరం విద్యుత్ సరఫరా వ్యయం సగటున యూనిట్ రూ.6.13 అని తేలింది. ఈ భారాన్నంతటిని రైతులు మోయాల్సి వస్తే యేటా లక్ష కోట్ల రూపాయల దాకా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇది చిన్న సన్నకారు రైతులకు మరణశాసనమే. భూగర్భ జలాలపై ఆధారపడి వ్యవసాయం చేసే రైతుల పరిస్థితి గురించి ఇక వేరే చెప్పనక్కర్లేదు. వ్యవసాయ రంగంలో విద్యుత్ సబ్సిడీలను పూర్తిగా ఎత్తివేయాలని ఈ కొత్త బిల్లు చెబుతోంది. దీనిని స్లో పాయిజన్‌గా ఎక్కించేందుకు నేరుగా నగదు బదిలీ (డిబిటి) పథకాన్ని ప్రభుత్వం తెరపైకి తెస్తున్నది. గ్యాస్‌పై సబ్సిడీని ఎత్తివేసేందుకు అనుసరించిన పద్ధతినే ఇప్పుడు ఉచిత విద్యుత్, సబ్సిడీ విద్యుత్ విషయంలోను అమలు చేస్తారన్నమాట. చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఇచ్చే విద్యుత్ సబ్సిడీని తొలగించాలని బిల్లు చెబుతోంది. దీనివల్ల ఈ పరిశ్రమలు మూతపడితే వీటిపై ఆధారపడిన అసంఖ్యాక అసంఘటిత రంగ కార్మికులు వీధిన పడే ప్రమాదముంది.
ఈ విధంగా ప్రజలపైనే కాదు, రాజ్యాంగ మౌలిక లక్షణాలపైనా మోడీ ప్రభుత్వం తన దాడిని ఎక్కుపెట్టింది. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యుత్ రంగంపై చట్టాలు చేసేటప్పుడు రాష్ట్రాలను తప్పక సంప్రదించాల్సి ఉంది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అధికార కేంద్రీకరణను బలపరచుకునేందుకే యత్నించింది. విద్యుత్ ఛార్జీల నిర్ణయం దగ్గరనుంచి లైసెన్సులు, సబ్ లైసెన్సులు, కాంట్రాక్టులు, అగ్రిమెంట్లు ఇలా ప్రతి అంశంలోనూ కేంద్రానిదే పెత్తనం. ఎలక్ట్రికల్ కంట్రోల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధారిటీ (ఇసిఇఎ) అనే కొత్త సంస్థను ఈ బిల్లులో ప్రతిపాదించడం ద్వారా విద్యుత్ పంపిణీ రంగంలో ఫ్రాంచైజీలకు, డిస్ట్రిబ్యూటర్లకు లైసెన్సులను కేంద్రం తనకు నచ్చినవారికి కట్టబెట్టేందుకు వీలుండేలా చూసుకుంది. రాష్ట్ర రెగ్యులేటరీ కమిషన్‌కు కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇందులో ఎలాంటి పాత్ర ఉండదు. విద్యుత్ రంగంలో ఏ అంశంపైనైనా ఈ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ మాటే అంతిమంగా చెల్లుబాటవుతుంది. అందుకే దీనిని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలన్నీ తీవ్రంగా వ్యతిరేకించాయి. రాష్ట్రంలోని వైసిపి ప్రభుత్వం దీనిని సూటిగా వ్యతిరేకించకుండా నంగి నంగిగా మాట్లాడుతోంది. కేంద్రం ఆదేశించగానే, అందరికన్నా ముందుగా స్మార్ట్ మీటర్లను బిగించేందుకు సిద్ధమైంది. పేదలపై భారాలు మోపి, కార్పొరేట్లకు దండిగా లాభాలు సమకూర్చి పెట్టే ఈ విద్యుత్ సంస్కరణలను ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించకూడదు. ఈ ప్రజావ్యతిరేక బిల్లును తిప్పికొట్టేందుకు కార్మిక సంఘాలు, ప్రజలంతా కలసి స్వాతంత్య్రోద్యమ 75వ వార్షికోత్సవ స్ఫూర్తితో ఉద్యమించాలి.