Aug 10,2022 08:12

విశాల భారతదేశంలో మత సామరస్యం పరిఢవిల్లే సంఘటనలు ఎక్కడో ఒకచోట నిత్యం జరుగుతూనే ఉంటాయి. హిందూ ముస్లిం ఐక్యతకు చిహ్నంగా చెప్పుకునే మొహరం పండుగ పర్వదినాల వేళ కర్నాటకలో కనిపిస్తున్న మత సామరస్య గ్రామాల గురించి తప్పక తెలుసుకోవాలి. ఉత్తర కర్నాటక బెల్గావి జిల్లా హిర్బిదనూర్‌ గ్రామంలో ఒక్క ముస్లిం కుటుంబం లేదు. అయినా దశాబ్దానికి పైగా అక్కడ మొహరం పండుగను జరుపుకుంటున్నారు. ఆ గ్రామమంతా ఏకమై అంగరంగ వైభవంగా ఐదురోజుల ఉత్సవాన్ని నిర్వహిస్తుంది. ఇస్లాం మత సంకేతంగా అక్కడ ఒకే ఒక్క మసీదు ఉంది. చాలా కాలం క్రితం ఓ ముస్లిం వ్యక్తి దాన్ని స్థాపించారని స్థానికులు చెబుతారు. ఆయన మరణించిన తరువాత హిందూ పూజారి సాంప్రదాయబద్దంగా ప్రార్థనలు చేస్తున్నారు. ఈ మందిరాన్ని 'ఫకీరేశ్వర స్వామి మసీదు' అని పిలుస్తారు. 3000 మంది జనాభా కలిగిన ఈ ప్రాంతంలో కురుబ, వాల్మికీ కమ్యూనిటీలకు చెందిన ప్రజలు అత్యధికులు.
         ఇక దక్షిణ కర్నాటకలోని వజ్రహళ్లి గ్రామంలో సుమారు 2000 మంది జనాభా ఉంటారు. ఆ గ్రామంలో అధిక సంఖ్యాకులైన హిందువులు తరతరాలుగా మొహరం పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటారు. గ్రామ కనకాపుర వీధి కూడలిలో మిన్నంటుతున్న డప్పు శబ్దాల మధ్య సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత మొహరం వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ జాతరలో ఒక కిలోమీటరు దూరంలోని దొడ్డకలసంద్ర గ్రామం కూడా తోడవుతుంది. 'ఈ రెండు గ్రామాల మధ్య ఉన్న ఐక్యతకు చిహ్నంగా మా గ్రామం నుంచి 'పంజా' తీసుకెళ్తాం' అంటారు దొడ్డకలసంద్ర గ్రామవాసి 97 ఏళ్ల మల్లె బైరప్ప. 80 ఏళ్ల వయసు వాడైనప్పటి నుంచి బైరప్ప 'పంజా' మోసుకెళ్తున్నారు. ఈ ఏడాది కూడా భాగస్వామ్యం అయ్యానని ఎంతో సంతోషంతో చెబుతున్నారు. 'నగరాలకు వలసవెళ్లిన గ్రామ యువకులు ఏ పండుగకు రాకపోయినా మొహరానికి మాత్రం తప్పక హాజరవుతాం' అంటున్నాడు బెంగుళూరులో స్థిరపడిన గ్రామ యువకుడు సురేష్‌బాబు.
        మొహరం జాతర నిర్వహించే 'బాబయ్య' మసీదుకు 300 ఏళ్ల చరిత్ర ఉన్నట్లు గ్రామస్తులు నమ్ముతారు. ఇలా హిందువులు నిర్వహించే మొహరం వేడుక ఒక్క వజ్రహళ్లికే పరిమితం కాదు. దక్షిణ కర్నాటకలోని కగ్గిలిపురా, అంజనాపురా గ్రామాల్లో కూడా ఈ తరహా వేడుకలు చూడవచ్చు. బెంగుళూరు, కోలార్‌, తూమకుర్రు, అనంతపూర్‌లో కూడా 'బాబయ్య' మసీదులు విస్తరించాయి. భారతదేశం హిందూ దేశమని, హిందువులే రాజ్యమేలాలని, ప్రజలంతా హిందువులే ఉండాలని కలలు కంటున్న కుహనా దేశభక్తులకు ఈ మతసామరస్య ఉత్సవాలు కంటిమీద కునుకు రానీయవు.