Aug 10,2022 11:07

న్యూఢిల్లీ : మంకీపాక్స్‌ దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. అయితే ఈ మహమ్మారితో సంబంధం ఉన్న సమస్యలు ఆరోగ్యకరమైన పెద్దలతో పోలిస్తే... చిన్నారులు, రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల్లో తరచూ కనిపిస్తాయని 'మంకీపాక్స్‌ : వ్యాప్తి' అనే టైటిట్‌తో ది లాన్సెట్‌.. చైల్డ్‌ అండ్‌ అడోలసెంట్‌ హెల్త్‌ అనే మెడికల్‌ జర్నల్స్‌లో పేర్కొంది. బాక్టీరియా సూపర్‌ ఇన్‌ఫెక్షన్‌, సెప్సిస్‌, కెరాటిటిస్‌, ఫారింజయల్‌ చాము, న్యుమోనియా, శ్వాసకోశ సమస్యలతో బాధపడే వారికి ఈ వైరస్‌ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. గతంలో మంకీపాక్స్‌ వ్యాప్తి కారణంగా అమెరికా వంటి అగ్రరాజ్యంలో కూడా పిల్లల మరణాలు రేటు పెరిగింది. అయితే భారత్‌లో ఇంకా చిన్నారులకు వ్యాప్తి చెందిన కేసు నమోదు కావడం ఉపశమనం కలిగించే అంశం. పిల్లలకు ముప్పు అధికమయ్యే అవకాశాలున్న వార్తలను ఇక్కడి వైద్యులు తోసిపుచ్చుతున్నారు. పిల్లల్లో ఈ వైరస్‌ సమస్యలు సాధారణం కానప్పటికీ.. వారు వారికి సన్నిహితంగా ఉన్న పెద్దల నుండి ఈ వైరస్‌ను పొందే అవకాశాలున్నాయని, వారిలో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల, దీని బారిన పడి, నిర్ధారణ కాని ఓ చిన్నారి పాఠశాలకు వెళ్లినప్పుడు సహా విద్యార్థులకు సోకే అవకాశాలున్నాయని పోర్టిస్‌ మెమొరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌. పిడియాట్రిక్స్‌ డాక్టర్‌ క్రిషన్‌ చూగ్‌ అన్నారు.
అందుబాటులో ఉన్న అన్ని మశూచి వ్యాక్సిన్లు.. మంకీపాక్స్‌ను అడ్డుకుని రక్షణ కల్పిస్తాయని, సోకడానికి ముందు.. తర్వాత కూడా వీటిని ఉపయోగించ్చునని లాన్సెట్‌ కథనం తెలుపుతోంది. మంకీపాక్స్‌ కేసు మరణాల నిష్ఫత్తి సాధారణ జనాభాలో 0 నుండి 11 శాతం వరకు ఉందని, చిన్నపిల్లల్లో ఎక్కువ ఉందని పేర్కొంది. కేసులు, మరణాల నిష్పత్తి దాదాపు 3-6 శాతంగా ఉందని తెలిపింది. రోగులను ఒంటరిగా ఉంచి, సమస్యను పర్యవేక్షించి, చికిత్స అందించాలని తెలిపింది. అయితే ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం... మంకీపాక్స్‌ అనేది రెండు నుండి నాలుగు వారాల పాటు లక్షణాలు ఉండే స్వీయ-పరిమిత వ్యాధి అని చెబుతోంది.