
న్యూఢిల్లీ : దేశంలోకి ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 4 నాటికి కేరళకు రుతు పవనాలు వస్తాయని తాజా అంచనాలో భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించింది. ఎల్‌నినో ప్రభావం ఉన్నప్పటికీ ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉండే అవకాశం ఉందని ఐఎండి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. జూన్ 1 కంటే ముందుగా రుతుపవనాలు వస్తాయనిభావించడం లేదని వివరించింది. వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. గతవారంలో జూన్ 3 నాటికి కేరళకు రుతు పవనాలు చేరుకుంటాయని ఐఎండి అంచనా వేసింది. సాధారణంగా జూన్ 1 నాటికి కేరళకు నైరుతి రుతుపవనాలు చేరుకుంటాయి. గత ఏడాది ఐఎండి అంచనా వేసిన దానికంటే రెండు రోజులు ఆలస్యంగా మే 29 నాటికి కేరళకు రుతుపవనాలు చేరుకున్నాయి.