
మహారాష్ట్ర రైతుల లాంగ్‌మార్చ్ అన్నదాతల సంఘటిత శక్తికి ప్రతీకగా నిలిచింది. నాసిక్ నుంచి ముంబయి వరకూ పాదాలు బొబ్బలెక్కి రక్తమోడుతున్నా... లెక్కచేయక కదంతొక్కుతూ.. ఐదు రోజులపాటు 250 కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్ర విజయం సాధించడం అభినందనీయం. ఉల్లి, పత్తి, టమాటా తదితర పంటలకు కనీస మద్దతు ధర, అటవీ హక్కుల పరిరక్షణ తదితర 15 డిమాండ్లపై రైతులు పోరుబాట పట్టారు. వాటన్నింటినీ శాసన సభ సాక్షిగా ఆమోదిస్తున్నట్టు ఆ రాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే ప్రకటించి, ఉత్తర్వులు జారీ చేసేవరకూ సడలని దీక్షతో రైతులు ఉద్యమించారు. రుణమాఫీ, యాజమాన్య హక్కుల కోసం 2018లో నాసిక్ నుంచి నిర్వహించిన లాంగ్ మార్చ్ మళ్లీ గుర్తుకొచ్చింది. అయితే, ఇప్పటికి అంగీకరించి, తరువాత మాటమరిచే ప్రభుత్వాలు ఎక్కువగా ఉన్నాయి కనుక తాజా ఉత్తర్వులు ఆచరణ రూపం దాల్చేంత వరకూ అప్రమత్తత ఎంతో అవసరం.
నేడు 'రైతులను రక్షించండి... దేశాన్ని కాపాడండి...కార్పొరేట్లను తరిమికొట్టండి' అన్న నినాదం మార్మోగుతోంది. కార్పొరేట్లు ముఖ్యంగా అంబానీ, అదానీలకు కొమ్ముకాస్తున్న మోడీ సర్కారు విధానాలు వ్యవసాయ రంగంలో సంక్షోభం తీసుకురావడంతోపాటు అన్నదాతల ఉసురు తీస్తున్నాయి. గత ఎనిమిదేళ్లలో దేశంలో సుమారు లక్ష మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. రెండున్నర లక్షల మంది రోజువారీ కూలీలు బలవన్మరణానికి పాల్పడ్డారు. 2022 లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 1023 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 887 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో రైతు మరణాల్లో 87 శాతం ఏడు రాష్ట్రాల్లో సంభవిస్తుండగా, వాటిలో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. అన్నదాతల ఆత్మహత్యలను అరికట్టడం ప్రతి ప్రభుత్వం యొక్క బాధ్యత.
2020-21లో 400 రోజులపాటు దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక రైతు పోరాటం ఆమోదింపజేసుకున్న డిమాండ్లను అమలు చేసేందుకు కేంద్రప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. 700 మంది బలిదానాల తరువాత ఇచ్చిన హామీలను సైతం విస్మరించింది. రైతు ఉద్యమ స్ఫూర్తితో ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కెఎం) తాజాగా నిర్వహించిన కిసాన్ మహా పంచాయత్‌కు దేశ నలుమూలల నుంచి వేలాదిమంది రైతులు హాజరయ్యారు. పది డిమాండ్లే ఎజెండాగా సభ నిర్వహించి, కేంద్ర మంత్రులకు వినతులను అందజేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా సి2 ప్లస్ 50 శాతం ఫార్ములాకు అనుగుణంగా అన్ని పంటలకు కనీస మద్దతు ధర కల్పన, రైతులపై తీవ్ర ప్రభావం చూపే విద్యుత్ సవరణ బిల్లు-2022ను ఉపసంహరణ వంటి కీలక డిమాండ్లను ఎస్‌కెఎం మరోసారి ఎజెండాలోకి తీసుకొచ్చింది. రైతులపై కార్పొరేట్ దోపిడీ అంతానికి దేశవ్యాప్త పోరాటాలకు ఎస్‌కెఎం ఇచ్చిన పిలుపు విజయవంతమైతేనే సామాన్య ప్రజల ప్రయోజనాలు నెరవేరుతాయి.
ఉద్యమిస్తే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని తాజా పరిణామాలు మరోసారి నిరూపించాయి. కిసాన్ లాంగ్ మార్చ్ విజయవంతమైన మహారాష్ట్ర లోనే ప్రభుత్వ ఉద్యోగులు ఒపిఎస్ కోసం ఉద్యమించారు. ఒపిఎస్‌తో సమానమైన ప్రయోజనాలు కల్పిస్తామని శివసేన (షిండే) - బిజెపి ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించింది. ఉత్తర ప్రదేశ్‌లో విద్యుత్ ఉద్యోగులు మొక్కవోని దీక్షతో ఉద్యమించి, బిజెపి సర్కారు మెడలు వంచారు. విద్యుత్ సంస్కరణల వేగానికి తాత్కాలిక బ్రేక్ వేయగలిగారు. ప్రభుత్వాలు ఎస్మాతో సహా నిరంకుశ చట్టాలను ప్రయోగించినా, ఐక్యంగా పోరాడి విజయం సాధించారు. కర్ణాటకలో అంగన్‌వాడీ ఉద్యోగులు నిరవధిక సమ్మె చేసి తమ కోర్కెలు సాధించుకున్నారు. స్థానిక పోరాటాలు అసంఖ్యాకంగా సాగుతున్నాయి. రైతులతోపాటు సమస్త ప్రజలు భాగస్వాములైన ఢిల్లీలో చారిత్రాత్మక రైతు పోరాటాన్ని గుర్తు చేస్తూ... మరోసారి ఉద్యమపథం కొనసాగాలి. అదే సరైన మార్గం.