Sep 14,2021 08:07

ముంబయి : '' బ్రేకప్‌ అయ్యింది.. అతను నన్ను చంపేస్తానంటూ బెదిరించాడు.. మనుషుల్ని పెట్టించి నాపై యాసిడ్‌ దాడి చేయాలనుకున్నాడు...'' అని నటి అక్షర సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందీలో తెరకెక్కిన 'సత్యమేవ్‌ జయతే', 'సథియా', 'ధడ్కన్‌', 'మాతుజే సలామ్‌' వంటి చిత్రాల్లో అక్షర తన నటనతో మెప్పించారు. ఇటీవల ఆమె 'బిగ్‌బాస్‌ ఓటీటీ' వేదికగా ప్రేక్షకుల్ని అలరించారు.
    తాజాగా నటి అక్షర సింగ్‌ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... తాను జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి పలు విషయాలను వెల్లడించారు. నటిగా తన కెరీర్‌ను ఆరంభించాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులను ఒప్పించి ముంబయికి వచ్చారని తెలిపారు. ఇండిస్టీలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, తాను జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు ఏ అమ్మాయికీ రాకూడదని ఆమె ఆశించారు.
     ఆమె మాటల్లో... ' నటిగా రాణించడం కోసం ఇండిస్టీలోకి అడుగుపెడతానంటే మా కుటుంబంలో ఒప్పుకోరు. అలాంటి సాంప్రదాయ కుటుంబం నుంచి నేను పరిశ్రమలోకి వచ్చాను. కెరీర్‌ ప్రారంభించిన కొత్తలో నాకు ఆఫర్స్‌ వచ్చేవి కాదు. ఒకవేళ ఆఫర్స్‌ వచ్చినా సరే కారణం లేకుండానే అవి చేజారిపోయేవి. నా వ్యక్తిగత జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాను. అనుకోని కారణాల వల్ల ఓ వ్యక్తితో నాకు బ్రేకప్‌ జరిగింది. ఆ తర్వాత అతను నన్ను చంపేస్తానంటూ బెదిరించాడు. మనుషుల్ని పెట్టించి నాపై యాసిడ్‌ దాడి చేయాలనుకున్నాడు. ఆరోజు నేను అనుభవించిన బాధను మాటల్లో వివరించలేను. మానసిక క్షోభకు గురయ్యాను. ఆ సమయంలో నాన్న నాకెంతో ధైర్యాన్ని ఇచ్చారు. ఆ ధైర్యంతోనే ఇప్పుడు కెరీర్‌లో రాణిస్తున్నా' అని అక్షర వివరించారు.