Sep 25,2022 12:14

ప్యొంగ్యాంగ్   :  ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టింది. దక్షిణ కొరియా, అమెరికా దళాలు సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతుండగా ఈ ప్రయోగం జరిగినట్లు సమాచారం. స్థానిక కాలమానం ప్రకారం.. ఆదివారం ఉదయం 7గంటలకు ఉత్తర కొరియాలోని ప్యొంగ్యాంగ్  ప్రావిన్సులోని టైచోన్‌ ప్రాంతం నుంచి స్వల్ప శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మిలటరీ వెల్లడించింది. మాక్‌ 5 వేగంతో దాదాపుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 600 కిలోమీటర్లు ప్రయాణించినట్లు తెలిపింది. క్షిపణి 50 కిలోమీటర్ల వద్ద గరిష్ట ఎత్తుకు చేరుకుందని  జపాన్‌ రక్షణ మంత్రి యసుకాజు హమాదా తెలిపారు. జపాన్‌ వెలుపల ప్రత్యేక ఆర్థిక జోన్‌ వెలుపల పడిపోయిందని షిప్పింగ్‌, ఎయిర్‌ ట్రాఫిక్‌ సమస్యల గురించి నివేదికలు లేవని మహాదా తెలిపారు.

సెప్టెంబర్‌ 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు దక్షిణ కొరియా, అమెరికా సంయుక్త సైనిక విన్యాసాలు చేపడుతోంది. ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొ నేందుకు అమెరికాకు చెందిన ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ యూఎస్‌ఎస్‌ రొనాల్డ్‌ రీగన్‌ దక్షిణ కొరియాలోని బూసాన్‌ చేరుకుంది. మరోవైపు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ సియోల్‌లో పర్యటించనున్నట్లు సమాచారం.  ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం అంతర్జాతీయ శాంతి భద్రతలకు ముప్పు కలిగించేలా ఉందని.. దక్షిణ కొరియా విమర్శించింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలను ఉల్లంఘించినందుకు మరిన్ని ఆంక్షలను విధించేందుకు అమెరికా సిద్దమైంది. జూన్‌ ప్రారంభంలో ఒక రోజులో ఎనిమిది స్వల్పశ్రేణి బాలిస్టిక్‌ క్షిపణులను ప్రయోగించిన అనంతరం ఉత్తర కొరియా మొదటిసారిగా ఈ ప్రయోగాన్ని చేపట్టడం గమనార్హం .