Jul 30,2021 00:50

కోతకు గురైన తీరాన్ని పరిశీలిస్తున్న లోకనాథం

రాంబిల్లి : నాబ్‌ నిర్వాసితుల పెండింగ్‌ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన మండలంలోని కొత్తపట్నం, వాడ నర్సాపురం గ్రామాల్లో పర్యటించారు. నేవీ డ్రెడ్జింగ్‌ పనుల వల్ల సముద్ర తీరం 8 మీటర్ల ఎత్తు వరకు కోతకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు. అనంతరం నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గంపల మహిళలకు, మేజర్‌ కుమారులు, కుమార్తెలకు ప్యాకేజీలు నేటికీ అందించలేదని, నేవీ ప్రహరీ నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం చెల్లించలేదని, జెట్టీ నిర్మాణం చేపట్టలేదని, నిర్మాణం పనుల్లో ఉపాధి కల్పించడం లేదని స్థానికులు లోకనాథం దృష్టికి తీసుకొచ్చారు. సముద్ర తీరం కోతకు గురికావడం వల్ల వరహా, శారదా నది ద్వారా సముద్రంలోకి వేటకు వెళ్తున్నామని, ఇప్పుడు అక్కడ పడవలు తీసివేయాలని నేవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లోకి వచ్చి హెచ్చరిస్తున్నారని, దీంతో తమకు బతుకు తెరువు లేక, రక్షణ కరువైంది వాపోయారు. ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ పై సమస్యలపై జిల్లా కలెక్టర్‌ను కలుస్తామని, వాటిని పరిష్కారం చేయకపోతే మరోసారి నిర్వాసితులు ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మత్స్యకారులకు ఇచ్చిన హామీ మేరకు జెట్టి నిర్మాణం చేయాలని, గ్రామాలను తరలించాలని, అంతవరకు వేటకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్‌.గంగరాజు, జి.దేవుడునాయుడు, ఎం.నారాయణరావు, డి.కాశియా, సిహెచ్‌.పవన్‌ కుమార్‌, డి.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు