Sep 19,2023 23:47

వినుకొండ పట్టణంలోని బాలికల హైస్కూల్‌లో నిధుల్లేక నిలిచిన అదనపు తరగతి గదుల నిర్మాణం

ప్రజాశక్తి - వినుకొండ : ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో మౌలిక వసతుల మెరుగు కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనులు నత్తనడకన సాగుతున్నాయి. నిధుల కొరతే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. నాడు-నేడు పనులు చేయించాలని హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లపై అధికారులు ఒత్తిళ్లు చేస్తుండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో వారు అప్పులు తెచ్చి పనులు చేయాల్సి వచ్చిందని, ఏడాది దాటినా బిల్లులు సరిగా చెల్లించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. ఎ
నాడు-నేడు పథకం రెండో దశలో భాగంగా పల్నాడు జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు - 608, హై స్కూల్స్‌-172, ప్రాథమిక ఉన్నత పాఠశాల-103, కళాశాలలు-9, అంగన్వాడి సెంటర్లు-13 మొత్తం 905 ప్రభుత్వ విద్యాసంస్థలను ఎంపిక చేశారు. ఇందుకుగాను రూ.307.36 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో ఇప్పటి వరకు రూ.181 కోట్లు విడుదల చేయగా మిగతా నిధులు పెండింగ్‌లో ఉన్నాయి. నాడు-నేడు ద్వారా ఏడాది కిందట చేపట్టిన పనుల్లో దాదాపు 40 శాతం పనులు ఇంకా అసంపూర్తిగా మిగిలాయి.
అదనపు తరగతి గదులు, బెంచీలు, మరుగుదొడ్లు, సైకిల్‌ స్టాండ్లు, ప్రసహరీ, తాగునీటి వసతి, క్రీడా పరికరాలు తదితర సదుపాయాలు నాడు-నేడు కింద సమకూర్చాల్సి ఉంటుంది. పనులు పూర్తి చేయాలని హెచ్‌ఎంలు, ప్రిన్సిపాళ్లు, కిందిస్థాయి అధికారులపై ఉన్నతాధికారులు ఒత్తిడి చేశారు. తరచూ వీడియోకాన్ఫరెన్స్‌లు నిర్వహించి పనుల పురోగతిపై పలుమార్లు సమీక్షించారు.
జిల్లాలో అనేక విద్యాసంస్థల్లో అదనపు తరగతి గదులు, బండ పరుపు, కాంపౌండ్‌ వాల్సు, కనీసం మరుగుదొడ్లు లేవు. నాడు-నేడు పదకం ద్వారా మెరుగైన వసతులు కల్పిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో ఆశించిన పురోగతి లేదు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని 28 మండలాల్లోని పాఠశాలలో విద్యార్థులకు మౌలిక వస్తువులు లేక నేటికీ అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సెప్టెంబర్‌ 2వ తేదీన విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ జిల్లాలో అనేక చోట్ల పాఠశాలలు, కళాశాలలు, హైస్కూళ్లలను ఆకస్మిక తనిఖీలు చేశారు. అనేకచోట్ల హైస్కూల్లో సైతం విద్యార్థులు కింద కూర్చొని చదవటాన్ని గుర్తించి ఆయన అసంతృప్తికి గురయ్యారు. నాడు-నేడు పథకం ద్వారా వేల కోట్లు ఖర్చు చేస్తుంటే పిల్లలు కింద కూర్చొని చదవటం ఏమిటని జిల్లా అధికారులపై మండిపడ్డారు. బెంచీలు లేని స్కూళ్లు వివరాలు సేకరించి వెంటనే అంచనాలు తయారుచేసి ప్రభుత్వానికి పంపాలని సమగ్ర శిక్ష అభియాన్‌ అధికారిని ఆదేశించడం జరిగింది. ఏడాది దాటిన నాడు నేడు పథకం నిధులు సమగ్రంగా విడుదల కాకపోవడంతో బెంచీలు కొనుగోలు సాధ్యపడలేదని జిల్లా అధికారి బదులు ఇవ్వడంతో ఆయనపై ఆగ్రహించారు.
అనేక పాఠశాలల్లో విద్యార్థుల తరగతి గదులు శిథిలావస్థకు చేరి వర్షాకాలంలో కారుతూ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కొన్నిచోట్ల పెచ్చులు ఊడి ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. అనేక పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణ లేక బహిర్భూమికి ఆరు బయటకు వెళ్లే దుస్థితి లేకపోలేదు. నిధుల్లేక అనేక చోట్ల పనులు నిలిచిపోతే మొదటి విడత నాడు-నేడులో అరకొరగా మిగిలిన నిధులను బదలాయిస్తూ రోజులు గడుపుతున్నారు. రెండు వారాల్లో అనేకచోట్ల పనులు పూర్తిగా నిధులు లేక నిలిచిపోయే పరిస్థితి ఉన్నట్లు పలువురు ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. అంచనాల ప్రకారం మంజూరు చేసిన నాడు - నేడు పథకం నిధులను పూర్తిగా విడుదల చేస్తేనే పనులు జరుగుతాయని అంటున్నారు.

పనులకు ఇబ్బంది లేకుండా చర్యలు
శామ్యూల్‌, పల్నాడు జిల్లా విద్యాశాఖాధికారి
పల్నాడు జిల్లాకు నాడు - నేడు పథకం ద్వారా రూ.307.36 కోట్లు మంజూరవగా రూ.181 కోట్లు బిడుదలయ్యాయి. మిగిలిన నిధుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. జరుగుతున్న పనులకు ఉన్న నిధులతోనే సర్దుబాటు చేస్తున్నాం. ఎక్కడా ఇబ్బందు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.