Nov 22,2020 00:25

జెసిబి సహాయంతో కూల్చుతున్న గో కార్టింగ్‌

ప్రజాశక్తి - భీమునిపట్నం
జివిఎంసి 4వ వార్డు బీచ్‌ రోడ్డు పరిధిలోని కాపులుప్పాడ సర్వే నెంబర్‌ 299/1లోని 4.48 ఎకరాల ప్రైవేటు భూమిలో ఏర్పాటు చేసిన హబ్‌ ఫర్‌ యూత్‌ గో కార్టింగ్‌కు 2014లో నాటి పంచాయతీ అనుమతి ఇవ్వగా, సిఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘించి నిర్మించారంటూ నేడు జివిఎంసి దానిని కూల్చివేసింది. కూల్చివేతకు గురైన గో కార్టింగ్‌ ప్రాంతం కె.నగరపాలెం పంచాయతీ పరిధిలో ఉండేది. ఆ సమయంలో నిర్మాణాలకు అప్పట్లో ఉన్న పంచాయతీ అధికారులు అనుమతులు ఇచ్చినట్లు జివిఎంసి భీమిలి జోన్‌ టిపిఒ శ్రీలక్ష్మి స్థానిక విలేకరులకు తెలిపారు. బీచ్‌ రోడ్డుకు ఆనుకొని ఉన్న కె.నగరపాలెం, కాపులుప్పాడ, చేపలుప్పాడ, నిడిగట్టు, జెవి.అగ్రహారం పంచాయతీలు 2019 డిసెంబర్‌ 31న జివిఎంసిలో విలీనమయ్యాయి. విలీనానికి ముందు కె.నగరపాలెం పంచాయతీ అధికారులు గో కార్టింగ్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. నాడు ఏ ప్రాతిపదికన అనుమతులు ఇచ్చారన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
గంటా మంత్రిగా ఉన్న సమయంలోనే...
గంటా శ్రీనివాసరావు భీమిలి నియోజవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రిగా ఉన్న సమయంలో గో కార్టింగ్‌ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చారు. పంచాయతీ అధికారులు సిఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఎవరి ఒత్తిడి మేరకు అనుమతులు ఇచ్చారో ఇప్పుడు తేలాల్సి ఉంది. బీచ్‌ రోడ్‌లో సిఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘించి ఇప్పటికే చేపట్టిన శాశ్వత, తాత్కాలిక నిర్మాణాలను జివిఎంసి అధికారులు కూల్చి వేస్తారో? లేదా వేచి చూసే ధోరణి అవలంబిస్తారో? ఆచరణలో తేలనుంది. ఎటువంటి వివక్ష చూపకుండా నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని పలువురు ప్రభుత్వాన్ని, జివిఎంసి అధికారులను కోరుతున్నారు.
టిడిపి సానుభూతిపరుడు అయినందునే?
కాపులుప్పాడ సర్వే నెంబర్‌ 299/1లోని 4.48 ఎకరాల ప్రైవేటు భూమిని 2014లో వైజాగ్‌ ప్రొఫైల్స్‌ ప్రైవేట్‌ సంస్థ నుంచి కాశీ అసోసియేట్స్‌ లీజుకు తీసుకొని హబ్‌ ఫర్‌ యూత్‌ గో కార్టింగ్‌ను ఏర్పాటు చేసింది. గో కార్టింగ్‌ నిర్వహిస్తున్న కాశీ అసోసియేట్‌ ప్రతినిధి, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు అత్యంత సన్నిహితుడని అప్పట్లోనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత ప్రభుత్వం, సంబంధిత నిర్మాణాల కూల్చివేతకు ఉపక్రమించిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ముమ్మాటికీ కక్ష సాధింపే : టిడిపి నేత పల్లా
సిఆర్‌జెడ్‌ నిబంధనలు ఉల్లంఘించారన్న కారణాన్ని సాకుగా చూపి, ఎంతోమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి చూపుతున్న గో కార్టింగ్‌ నిర్మాణాలను కూల్చివేయడం ముమ్మాటికి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని టిడిపి విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు విమర్శించారు. కూల్చి వేసిన స్థలాన్ని పరిశీలించిన ఆయన స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ, అధికారులపై ఒత్తిడి తెచ్చి, ప్రతిపక్ష పార్టీలు, వారి సానుభూతిపరులు, అభిమానులకు చెందిన ఆస్తులను, నిర్మాణాలను ధ్వంసం చేయడం ప్రభుత్వానికి ఏమాత్రం తగదన్నారు. కూల్చివేతలు, కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలికి, ఇప్పటికైనా అభివృద్ధి దిశగా ప్రభుత్వ ఆలోచనలు ఉండాలని సూచించారు. పల్లా శ్రీనివాస్‌ వెంట స్థానిక టిడిపి నాయకులు నాగోతి శివాజీ, అక్కరమాని రాంబాబు ఉన్నారు.
సిఆర్‌జెడ్‌ పరిధిలో పలు కట్టడాలు కూల్చివేత
ప్రజాశక్తి గ్రేటర్‌ విశాఖ బ్యూరో
విశాఖ నగరం సాగర తీరంలో కోస్టల్‌ రేగులటరీ జోన్‌ (సిఆర్‌జెడ్‌) పరిధిలో పలు అక్రమ కట్టడాలను జివిఎంసి కూల్చివేసింది. సాగరతీరంతో పాటు నగర పరిధిలోని కంచరపాలెం , మర్రి పాలెం, ఎంవిపి ప్రాంతాల్లోనూ అక్రమ నిర్మాణాలను తొలగించారు. ప్రముఖ వ్యాపారవేత్త, నర్సాపురం మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు ఐటి హిల్స్‌ దగ్గర సిఆర్‌జెడ్‌ పరిధిలో అనుమతులు లేకుండా కట్టిన కాంపౌండ్‌ గోడను జెసిబితో కూల్చివేశారు. విశాలాక్షినగర్‌లోని సృజన పెన్ముత్స లే అవుట్‌ కాంపౌండ్‌ వాల్‌ను, కాపులుప్పాడ సర్వే నెంబర్‌ 31లో గల జి.సుబ్బరాజుకు చెందిన కాంపౌండ్‌ వాల్‌ తొలగించారు. జివిఎంసి దాడులతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.