Sep 14,2021 13:20

ముంబయి :  తమ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను తీర్చాలంటూ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను సమర్పిస్తుంటారు. లేకుంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలంటూ వేడుకుంటుంటారు. అయితే ఒక యువకుడు తనకు గర్‌ఫ్రెండ్‌ను చూసిపెట్టాలంటూ ఎమ్మెల్యేను కోరాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్‌ ఎమ్మెల్యే సుభాష్‌ థోతెకు ఒక యువకుడు ఈ విధంగా ఉత్తరం రాశాడు. ఈ ఉత్తరం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. భూషణ్‌ జామువంత్‌ అనే యువకుడు తనకు గర్ల్‌ఫ్రెండ్‌ కావాలని కోరుతూ మరాఠీ భాషలో లేఖ రాశాడు. తమ ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నా.. తనను ఎవరూ ఇష్టపడటం లేదని, దీంతో తనకు ఆందోళన పెరిగిపోయి, ఆత్మవిశ్వాసం దెబ్బతింటుందని ఆ లేఖలో పేర్కొన్నాడు. డ్రింకర్స్‌, అల్లరిచిల్లరగా తిరిగేవారికి కూడా గర్ల్‌ ఫ్రెండ్స్‌ ఉంటున్నారని, వారిని చూసినపుడు తన గుండె తరుక్కుపోతుంటుందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ లేఖపై ఎమ్మెల్యే స్పందించారు. తనకు గతంలో ఇటువంటి లేఖలు ఎప్పుడూ రాలేదని అన్నారు. భూషణ్‌ జామువంత్‌ ఎక్కడ ఉంటాడనేది తెలియలేదని, అతని సమాచారాన్ని తెలుసుకోవలిసిందిగా కార్యకర్తలను కోరానని, అతని ఆచూకీ తెలిస్తే, కౌన్సెలింగ్‌ ఇప్పిస్తామన్నారు. అయితే ఇటువంటి లేఖలు ఎమ్మెల్యేలకు రాయడం సరికాదన్నారు.