Jul 27,2021 07:33
  • అన్నిట్లోనూ భారత్‌కు ఓటములే..

టోక్యో : ఒలింపిక్స్‌లో సోమవారం భారత అథ్లెట్లందరూ నిరాశపరిచారు. పతకం రేసులో ఉన్న బాక్సర్‌ ఆశీష్‌ కుమార్‌తోపాటు మూడోరౌండ్‌కు చేరి సంచలనం సృష్టించిన మహిళల టిటి క్రీడాకారిణి మనికా బత్రా, మహిళల హాకీజట్టు, స్విమ్మర్లు, బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌ జోడీలకు ఓటమి తప్పలేదు. ఇక రెండోరౌండ్‌కు చేరి ఆశలు రేపిన టెన్నిస్‌ క్రీడాకారుడు సుమిత్‌ నాగల్‌తోపాటు నాల్గోరోజు జరిగిన అన్ని క్రీడాంశాల్లోనూ భారత అథ్లెట్లు సత్తా చాటలేకపోయారు. ఇక ఆస్ట్రేలియా మహిళా స్విమ్మర్‌ ఆరియార్న్‌ టిట్మస్‌ 400మీ. ఫ్రిస్టైల్‌లో స్వర్ణం సాధించగా.. జపాన్‌కు చెందిన 13ఏళ్ల మొమిజి నిషియా మహిళల స్ట్రీట్‌ స్కేట్‌బోర్డింగ్‌లో స్వర్ణం కైవసం చేసుకొని ఒలింపిక్స్‌లో బంగారు పతకం గెల్చిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు నెలకొల్పింది. అలాగే రష్యన్‌ ఒలింపిక్‌ కమిటీ(ఆర్‌ఒసి) పురుషుల టీమ్‌ ఆర్టిస్టిక్స్‌ జిమ్నాస్టిక్స్‌ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకొని రికార్డు నెలకొల్పగా.. సిమ్మింగ్‌లో అమెరికా జట్టుకు సోమవారం కేవలం ఒక్క స్వర్ణ పతకం మాత్రమే దక్కడం గమనార్హం.

 నాల్గోరోజు నిరాశే..


     స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ హీట్స్‌లోనే ఇంటిదారి పట్టాడు. 200మీటర్ల బటర్‌ఫ్లై హీట్‌-2లో పోటీపడిన సజన్‌.. 1 నిమిషం 57.22 సెకన్లలో పూర్తి చేసి నాలుగోస్థానంలో నిలిచాడు. మొత్తంగా-5 హీట్స్‌ నుంచి 16 మంది సెమీఫైనల్‌కు అర్హత సాధించగా.. సాజన్‌ మాత్రం 24వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. బాక్సింగ్‌ 69-75కిలోల మిడిల్‌ వెయిట్‌ విభాగంలో ఆశీష్‌ కుమార్‌ రౌండ్‌ ఆఫ్‌-32 కూడా దాటలేకపోయాడు. సోమవారం చైనా బాక్సర్‌ ఎర్బీకె తౌహెటా చేతిలో 5-0తో ఓడిపోయాడు. తొలి రెండు రౌండ్లలో ఐదుగురు జడ్జ్‌లు చైనా బాక్సర్‌ వైపే మొగ్గు చూపారు. మూడో రౌండ్‌లో ఆశిష్‌ కాస్త కోలుకొని పైచేయి సాధించినా విజయం మాత్రం తౌహెటానే వరించింది. ఆశిష్‌ తన ప్రత్యర్థికి బాగానే పంచ్‌లు ఇచ్చినా.. చైనా బాక్సర్‌ టెక్నికల్‌ గేమ్‌తో బోల్తా కొట్టించాడు. టేబుల్‌ టెన్నిస్‌ మహిళల విభాగంలో తొలి రెండు రౌండ్లు దాటి సంచలనం సృష్టించిన మనికా బత్రా పోరాటం మూడోరౌండ్‌లో ముగిసింది. ఆస్ట్రియా ప్లేయర్‌ సోఫియా పోల్కనోవా చేతిలో ఆమె 0-4 గేమ్‌ల తేడాతో ఓడిపోయింది. ప్రత్యర్థి దూకుడైన ఆట ముందు మనికా నిలవలేకపోయింది. పోల్కనోవా 11-8, 11-2, 11-5, 11-7 తేడాతో సునాయాసంగా గెలిచింది. అరగంటలోపే ఈ మ్యాచ్‌ ముగియడం విశేషం.
 

                                                                రెండోరౌండ్‌లో సుమిత్‌ పరాజయం

 నాల్గోరోజు నిరాశే..

పురుషుల టెన్నిస్‌ సింగిల్స్‌ విభాగంలో సుమిత్‌ నాగల్‌ పోరాటం ముగిసింది. 25ఏళ్ల తర్వాత తొలి రౌండ్‌ దాటిన ఇండియన్‌ ప్లేయర్‌గా నిలిచిన సుమిత్‌.. రెండోరౌండ్‌లో ఇంటిదారి పట్టాడు. సోమవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో సుమిత్‌ రెండో సీడ్‌, రష్యాకు చెందిన మెద్వదేవ్‌ చేతిలో 6-2, 6-1 తేడాతో ఓడిపోయాడు. గంటా ఐదు నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. తొలి సెట్‌లో రెండు, రెండో సెట్‌లో మూడు సుమిత్‌ సర్వ్‌లను మెద్వదేవ్‌ బ్రేక్‌ చేయగలిగాడు. మ్యాచ్‌ మొత్తంలో 31 అనవసర తప్పిదాలు చేశాడు. ఇతర పోటీల్లో టాప్‌సీడ్‌ నొవాక్‌ జకోవిచ్‌ 6-4, 6-3తో స్టఫ్‌(జర్మనీ)ని చిత్తుచేయగా.. స్పెయిన్‌కు చెందిన కర్రెన్నో 5-7, 6-4, 6-4తో సిలిక్‌(క్రొయేషియా)ను ఓడించి మూడోరౌండ్‌లోకి ప్రవేశించారు. ఇక మహిళల సింగిల్స్‌లో జపాన్‌ భామ నవోమీ ఒసాకా మూడోరౌండ్‌లోకి ప్రవేశించింది. సోమవారం జరిగిన రెండోరౌండ్‌ పోటీలో ఒసాకా 6-3, 6-2తో గోలుబిక్‌(స్విట్జర్లాండ్‌)ను వరుససెట్లలో చిత్తుచేసింది. ఇతర పోటీల్లో ప్లిస్కోవా(చెక్‌ రిపబ్లిక్‌), స్విటోలినా(ఉక్రెయిన్‌) మూడోరౌండ్‌లోకి ప్రవేశించగా.. గత ఏడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌ విజేత ఇగా స్వైటెక్‌(పోలెండ్‌) 3-6, 6-7(4-7)తో బడోసా(స్పెయిన్‌) చేతిలో పరాజయాన్ని చవిచూసింది. హాకీలో

                                                          మహిళలకు మరో ఎదురుదెబ్బ

    మహిళల హాకీ జట్టు గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లో మరో పరాజయాన్ని చవిచూసింది. సోమవారం జర్మనీ చేతిలో 2-0 గోల్స్‌ తేడాతో ఓడింది. రియో ఒలింపిక్స్‌ కాంస్యపతక విజేత జర్మనీ గ్రూప్‌-ఏలో తొలినుంచి భారత్‌పై పైచేయి సాధించింది. తొలి మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ చేతిలో 5-1 గోల్స్‌ తేడాతో ఓడిన మహిళల నేడు జర్మనీపై మెరుగైన ప్రదర్శనను కనబర్చడం విశేషం.

table