Jun 20,2021 11:05

    ఓర్పుకు మారుపేరు.. మార్పుకి మార్గదర్శి.. నాన్న. పిల్లల్ని నవమాసాలు మోసేది అమ్మ అయితే.. పుట్టిన తర్వాత తన గుండెలపై మోసేవాడు నాన్న అంటారు. అయినా ఈ సమాజంలో తల్లికి ఉన్నంత గుర్తింపు తండ్రికి ఉండదని, కవిత్వాల నుంచి సినిమాల వరకు తల్లుల్ని కీర్తించినంతగా తండ్రుల పాత్రను గుర్తించరన్న వాదన ఉంది. కానీ అది తప్పు. అప్పుడు, ఇప్పుడు నాన్నలపైనా కవిత్వాలు.. పాటలు.. ఉన్నాయి. అయితే ఒకప్పటి నాన్నలకీ, నేటి నాన్నలకీ చాలా తేడా ఉంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నాన్నల్లోనూ చాలా మార్పు వచ్చింది..
ఫాదర్స్‌ డే సందర్భంగా నాన్నల గురించే ఈ కథనం.

  తండ్రితోనే చనువుగా..


   నాన్న అంటే చనువున్న గౌరవం. నాన్న అంటే కారణమున్న కోపం. నాన్న అంటే పరిమితులు లేని ప్రేమ. నాన్న అంటే అనంతమైన కష్టపడేతత్వం. నాన్న అంటే స్వార్థంలేని అభిమానం. నాన్న అంటే ఆవేశంలేని ఆలోచన. నాన్న అంటే నమ్మకంతో కూడిన బాధ్యత. నాన్న అంటే అనుభవాల సారం. నాన్న అంటే వెనకుండి నడిపించే శక్తి. నాన్న అంటే ముందుచూపు నేర్పిన మనీషి. నాన్న అంటే నిజజీవిత సారాన్ని నేర్పిన గురువు. క్లుప్తంగా చెప్పాలంటే నాన్నే మనకు గొప్ప స్నేహితుడు. మన జీవిత మార్గదర్శకుడు. పిల్లలకు మొట్టమొదటి మార్గదర్శకులు గురువు, తల్లిదండ్రులే. అందుకే మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు. తన ప్రతిరూపాన్ని తొలిసారి చూసి మురిసిపోయేది నాన్నే.
 

                                                             మార్పులకు అనుగుణంగా..

   మారుతున్న కాలానికి అనుగుణంగా తండ్రి తన బిడ్డల భవిష్యత్తు కోసం తనను తాను ఎప్పటికప్పుడు మలుచుకుంటున్నాడు. నేటి పరిస్థితులకు అనుగుణంగా పిల్లలతో మమేకమైపోతున్నాడు. ప్రపంచీకరణ నేపథ్యంలో తండ్రి పాత్ర మారిపోయింది. బాధ్యతల బరువు పెరిగిపోయింది. పోటీ ప్రపంచంలో సవాళ్ళను ఎదుర్కోవడంలో తర్ఫీదు ఇస్తూనే తానూ బాధ్యతల బరువు నిర్వహణలో రాటుదేలుతున్నాడు. ఆ మాటకొస్తే పిల్లలకు, కుటుంబానికీ నచ్చినట్టు మారిపోతున్నాడు. చిన్న పిల్లలకు గురువుగా.. వారికి వయసు పెరిగే కొద్దీ స్నేహితుడిగా.. వారికి పెళ్ళయ్యాక మార్గదర్శిగా మారుతున్నాడు. తన కలల రూపాలైన పిల్లల కోసం ఎనలేని త్యాగాలను చేస్తున్నాడు. ఉద్యోగం, కష్టాలు, అసౌకర్యాలు, అనర్థాలు ఎన్ని ఎదురైనా.. పిల్లల కోసం భరిస్తున్నాడు. పిల్లలు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు తానూ ఓ చిన్నపిల్లాడిలా మారిపోతున్నాడు. వారితోనే ఆటపాటా అవుతున్నాడు. పిల్లల మనసులో ఏముందో కనుక్కోవడానికి తన మనసు విప్పే విద్యను నేరుస్తున్నాడు. అందుకే అమ్మలా ప్రేమిస్తూ.. నాన్నా పిల్లలకు దగ్గరవుతున్నాడు. దీంతో ఇప్పటి తరం పిల్లల్లో చాలామంది నాన్నకు ప్రేమతో అంటూ.. అల్లుకుపోతున్నారు. నాన్నని ఓ మంచి నేస్తంగా భావిస్తున్నారు.
 

                                                                    పిల్లల ఆలనా పాలనలో..

 పిల్లల ఆలనా పాలనలో..

   పిల్లలకు తన వంతుగా ఏమి చేయాలో అది చేస్తూ వారికి మరింత దగ్గరవుతున్నాడు. ఆర్థిక భారాలు పంచుకుంటున్న జీవిత భాగస్వామికి వంటపనిలో, ఇంటిపనిలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. పిల్లల సంరక్షణలో తన వంతు సాయం చేస్తున్నాడు. కుటుంబ బాధ్యతలతో పాటు పిల్లల పెంపకం, వారి ఆలనా పాలనా చూస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే తల్లి లేని సమయాల్లో వారికి పెంపకం బాధ్యతలు తీసుకుంటున్నాడు. అన్ని పనుల్నీ అంటే.. పిల్లలకు డైపర్లు మార్చడం, పాలు పట్టడం, ఆడించడం, వారిని స్నానం చేయించడం. వారిని రెడీ చేసి స్కూలుకి తీసుకెళ్ళడం. హోం వర్క్‌ చేయించడం.. అన్నం తినిపించడం.. ఇలాంటి పనులన్నీ ఇప్పుడు నాన్నలూ చేస్తున్నారు. ఇలా అమ్మలా నాన్నలూ పిల్లలకు మరింత చేరువవుతున్నారు.
 

                                                                        తండ్రితోనే చనువుగా..

  తండ్రితోనే చనువుగా..

   ఒకప్పటి పిల్లలు తల్లిచాటున మసలేవారు. తండ్రికి ఎదురుగా వెళ్ళి ఏదైనా అడగాలంటే భయపడేవారు. తండ్రీ పిల్లల మధ్య తల్లే రాయబారం నడిపేది. కానీ నేటి కాలంలో పిల్లలు తమకు ఏం కావాలన్నా నిర్మొహమాటంగా తండ్రినే అడుగుతున్నారు. అవసరమైతే తండ్రితో గొడవపడుతున్నారు. తమ అవసరాలను వివరిస్తూ నాన్నను ఒప్పించి, గెలుచుకుంటున్నారు. పిల్లలకు నచ్చింది చేసినప్పుడు.. వారి అభిరుచులు, అభిప్రాయాలను గౌరవించినప్పుడు.. ఎలాంటి కోపతాపాలూ, ఒత్తిళ్లూ లేకుండా పిల్లలు కూడా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఎదుగుతారని నాన్నలూ గ్రహిస్తున్నారు. ప్రస్తుతం అమ్మాయిలైనా, అబ్బాయిలైనా తండ్రితోనే చనువుగా, స్నేహంగా మసలుతున్నారని సర్వేల్లో వెల్లడవుతోంది. నగరాల్లో ఉండే తల్లిదండ్రుల్లో ఫాదర్సే పిల్లలతో ఎక్కువగా గడుపుతున్నారని పలు సర్వేలు తేల్చాయి.
 

                                                                       పరిష్కారకర్తగా..

    తండ్రి ఇప్పుడు ఒక పరిష్కారకర్త. పిల్లలకు చిన్న సమస్య వచ్చినా వాటిని నాన్నే పరిష్కరిస్తున్నాడు. పెద్ద సమస్యలు ఎదురైనప్పుడు తోడు, నీడగా ఉంటున్నాడు. వారికి చదువులో అయినా.. బయట ఎదురైన సమస్యల్లో అయినా.. జీవితంలో అనుకోని ఉపద్రవాలు వచ్చినా.. ఎలాంటి సంక్షోభ సమయంలో అయినా.. వారికి గుండెధైర్యాన్ని ఇచ్చేది నాన్నే. 'నేనున్నాను నీకేం కాదు..!' అనే భరోసాను వారి మనసుల్లో నింపుతున్నాడు. సవాళ్ళను ఎలా అధిగమించాలో నేర్పుతున్నాడు. సమస్యల చిక్కుముళ్ళను ఎలా విప్పాలో బోధిస్తున్నాడు. ఇప్పుడు పిల్లలకు తండ్రి నిరంతర బోధకుడు.. పరిష్కారకుడు..
 

                                                                వ్యక్తిత్వానికి పునాది..

   కనిపించిన మమతానురాగాల రక్ష అమ్మదయితే.. భవిష్యత్తుకు బాటలు పరిచి గమ్యాన్ని చేర్చే స్పూర్తిప్రదాత నాన్న. అమ్మ జోల పాటతో నిద్రపుచ్చితే.. నాన్న జీవిత పాఠంతో వ్యక్తిత్వ నిర్మాణానికి పునాది వేస్తాడు. అమ్మ పరిసరాలు చూపిస్తే .. నాన్న భుజాలపైకి ఎక్కించుకుని, లోకాన్ని చూపిస్తాడు. అమ్మ ఆకలి తీరిస్తే.. నాన్న ఆ బిడ్డ భవిష్యత్తును చూస్తాడు. అందుకే అమ్మ వాస్తవం.. నాన్న నమ్మకం. ప్రస్తుతం సమాజంలో తండ్రి పాత్ర అనేక కోణాల్లో దర్శనమిస్తుంది. ఇంటిని, పిల్లలను, తల్లికి వదిలేసి తనదైన ధోరణిలో జీవించే ఒకనాటి తండ్రులతో పోల్చితే ఇవాల్టి నాన్నలు బాధ్యత తెలిసిన అనురాగ జీవులు.
    మరి ఇలా మనల్ని తీర్చిదిద్దిన అమ్మానాన్నలను వృద్ధాప్యంలో వదిలేయకుండా.. మనకు రెక్కలొచ్చే వరకూ తన రెక్కలనే ఆసరాగా ఇచ్చిన వారిని ప్రేమగా చూసుకుందాం. నాన్నకు ఇప్పుడు మనమో భరసా అవుదాం.. నాన్న మనకోసం వదిలేసిన తన ఇష్టాలను ఏదో మేరకు మనం తీర్చడానికి ప్రయత్నిద్దాం. నాన్నకు ప్రేమను అంకితం చేద్దాం.

                                                                           అలా మొదలైంది...!

అలా మొదలైంది...!

  ఫాదర్స్‌ డేను మొదటిసారిగా అమెరికాలో సెలబ్రేట్‌ చేశారు. 1910 జూన్‌ మూడో ఆదివారం నాడు వాషింగ్టన్‌ వైఎంసీఏలోని స్పోకేన్‌లో సోనోరా ఫాదర్స్‌ డే సెలబ్రేట్‌ చేశారు. అప్పుడు జూన్‌ 19న ఫాదర్స్‌ డే వచ్చింది. అయితే అప్పటికే ఏటేటా మదర్స్‌ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న సోనోరా తండ్రులకూ ఓ రోజు ఉండాలని భావించారామె. సోనోరా తండ్రి పేరు విలియం జాక్సన్‌ స్మార్ట్‌. ఆయన అమెరికాలో సైన్యంలో పని చేసేవాడు. ఆరుగురు పిల్లలకు తండ్రి. కష్టపడి ఆరుగురు పిల్లల్ని పెంచి, పెద్ద చేశారు. తన తండ్రి కష్టాలను, బాధ్యతల్ని దగ్గర్నుంచి చూసిన సోనోరా ఫాదర్స్‌ డే ఉండాల్సిందే అనుకున్నారు. ఈ విషయాన్ని చర్చ్‌ పాస్టర్‌తో చర్చించారు. తన తండ్రి పుట్టినరోజు అయిన జూన్‌ 5న ఫాదర్స్‌ డే సెలబ్రేట్‌ చేయాలనుకున్నారు. కానీ చర్చి వేళలు కలిసిరాక పోవడంతో ఫాదర్స్‌ డే జూన్‌ మూడో ఆదివారానికి వాయిదా పడింది. అలా ప్రతీ ఏడాది జూన్‌ మూడో ఆదివారం పితృ దినోత్సవం జరుపుకొనే ఆనవాయితీ అమెరికాలో ప్రారంభమైంది. ఆ తర్వాత ఇతర దేశాల్లోనూ ఇదే రోజున పితృ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. కొన్నేళ్లుగా మనదేశంలోనూ ఫాదర్స్‌ డే సెలబ్రేట్‌ చేస్తున్నారు.

                                                                             వివిధ దేశాల్లో...

వివిధ దేశాల్లో...

   అంతర్జాతీయ పితృదినోత్సవాన్ని అమెరికా, కెనడా, బ్రిటన్‌, యూరప్‌, అర్జెంటీనా, ఫ్రాన్స్‌, గ్రీస్‌, ఐర్లాండ్‌, మెక్సికో, సింగపూర్‌, సౌతాఫ్రికా, వెనెజులా, ఇండియా, పాకిస్తాన్‌ వంటి అనేక ఇతర 111 దేశాల్లో ఒకేరోజున జరుపుకుంటారు. అయితే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో మాత్రం సెప్టెంబర్‌ మొదటి ఆదివారంనాడు జరుపుకుంటారు. మెక్సికోలో ప్రతి ఏడాది ఇదే రోజున 21 కిలోమీటర్ల మేర మారథాన్‌ నిర్వహిస్తారు. జపాన్‌లో పిల్లలు ఇంట్లో తయారుచేసిన వస్తువులతో తండ్రులకు గిఫ్ట్‌లు ఇస్తారు. థారులాండ్‌లో డిసెంబర్‌ 5న, రష్యాలో ఫిబ్రవరి 23న, ఇటలీలో మార్చి 19న జరుపుకుంటారు.
 

                                                                         నాన్న పాట మధురం..

నాన్న పాట మధురం..

    నాన్నపై పాడిన పాటల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న పాట.. 'నాన్నకు ప్రేమతో' సినిమాలో సంగీత దర్శకుడు దేవిశ్రీ పాడిన 'ఏ కష్టమెదురొచ్చినా.. కన్నీళ్లు ఎదిరించినా.. ఆనందం అనే ఉయ్యాలలో నను పెంచిన.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో.. నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతిక్షణం..' పాట బాగా ఆకట్టుకుంది. అలాగే 'ఆకాశమంత' సినిమాలోని.. 'ఆటలపాటల నవ్వుల పుత్తడి బొమ్మరా బొమ్మరా.. ఆశగా చూసిన నాన్నకు పుట్టిన అమ్మ రా అమ్మ రా..!', 'డాడీ' సినిమాలోని.. 'గుమ్మాడీ గుమ్మాడీ ఆడిందంటే అమ్మాడీ..', 'విశ్వాసం' సినిమాలోని 'చిన్నారి తల్లి.. చిన్నారి తల్లి.. నా నిండు జాబిలి..!', 'ఇంద్రుడు చంద్రుడు' సినిమాలో..'లాలిజో లాలిజో ఊరుకో పాపాయి.. పారిపోనీకుండా పట్టుకో నా చేయి...' లాంటి కొన్ని నాన్న గురించిన మధురమైన పాటలు.. అలాగే నాన్నపై చిరంజీవి నటించిన 'డాడీ', జూనియర్‌ ఎన్‌టిఆర్‌ - 'నాన్నకు ప్రేమతో', విక్రం - 'నాన్న', అజిత్‌ - 'విశ్వాసం', ప్రకాష్‌రాజ్‌ - 'ఆకాశమంత' వంటి చిత్రాలు.. పాటలు.. ఈ తరం పిల్లలకు ఎంతో ఫేవరెట్‌ ఫాదర్స్‌ను చూపించేవి.

                                                                   నాన్న కోసం ఇలా చేద్దాం..

నాన్న కోసం ఇలా చేద్దాం..

   నిజానికి మన పెద్దవాళ్లకు గిఫ్ట్‌లు, వస్తువులు, వాచీల వంటి వాటిపై అంత ఆసక్తి ఉండదు. తమ భవిష్యత్తుపై ఒకింత చింతతో ఉంటారు. వయసు పెరుగుతూ ఉంటే రేపేంటి అన్న ఆలోచన వారిలో పెరుగుతూ ఉంటుంది. అందువల్ల వారికి భవిష్యత్తుపై భరోసా కల్పించాలి. వారికి మానసిక ఒత్తిళ్లను దూరం చెయ్యాలి. అందుకనుగుణంగా వారి ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదే వారికి మనమిచ్చే మంచి గిఫ్ట్‌.

  • పెద్దవాళ్లకి ఫిట్‌నెస్‌ క్లాస్‌ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. వయసు పెరిగేకొద్దీ ఫిట్‌నెస్‌ పెంచుకోవాలి కాబట్టి.. కరోనా కాలంలో ఆన్‌లైన్‌ ఫిట్‌నెస్‌ క్లాసుల్లో చేర్పించడం సరైన గిఫ్ట్‌ అవుతుంది. ఆన్‌లైన్‌ యోగా, జుంబా, ఏరోబిక్స్‌ ఇలా అమ్మానాన్నకి ఏది నచ్చితే అది ఇచ్చేయడమే.
  • మన దేశంలో వయసు పెరిగినా చాలామంది బాడీ చెకప్స్‌ చేయించుకోరు. ఎక్కడ డబ్బు అయిపోతుందో అని సందేహిస్తారు. రానున్న అనారోగ్య సమస్యల్ని ముందుగానే కనిపెట్టాలంటే బాడీ చెకప్స్‌ తప్పనిసరి. అందువల్ల పేరెంట్స్‌కి బాడీ చెకప్స్‌ చేయిస్తే మంచిది.
  • మనం ఎన్ని తినమన్నా... పేరెంట్స్‌ ఆకలి లేదనో, తింటానులే అనో వాయిదా వేస్తుంటారు. వాళ్లను మోటివేట్‌ చేసి, మంచి ఆహారం తినేలా, సరైన డైట్‌ పాటించేలా చెయ్యాలి. దానివల్ల వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. అదీ మనం ఇచ్చే గిఫ్ట్‌ లాంటిదే. బ్రేక్‌ ఫాస్ట్‌ నుంచి బెడ్‌ వరకూ సరైన డైట్‌ తీసుకునేలా చూడాలి.
  • చాలా మంది పేరెంట్స్‌ సెక్యూర్‌ రిటైర్మెంట్‌ కోరుకుంటారు. కానీ అందుకు ఏం చెయ్యాలో సరైన ప్లాన్‌ వారి దగ్గర ఉండదు. ఫాదర్స్‌ డే రోజున మనం వారి అభిప్రాయాలు తెలుసుకొని, సరైన రిటైర్మెంట్‌ ప్లాన్‌ సూచించాలి. దీనిపై ఏమనుకుంటున్నారో తెలుసుకొని, అందుకు తగిన ప్లాన్‌ మనం చెబితే, అదీ మంచి గిఫ్టే.
  • ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యానికి సంబంధించిన ఇన్సూరెన్స్‌ సర్వసాధారణం. ఒకవేళ తండ్రికో, తల్లికో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ లేకపోతే, అలాంటి హెల్త్‌ పాలసీలు తీసుకోవడం మంచిదే. ఏదైనా జరగరానిది జరిగితే, ఇన్సూరెన్స్‌ అమౌంట్‌ పెద్దవాళ్లను ఆదుకుంటుంది. మనం తీసుకునే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ వాళ్లకు ఓ లైఫ్‌ లాంగ్‌ గిఫ్ట్‌.


                                                                     నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు..

నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు..


పరీక్షంటే భయమొద్దన్నారు..
'నేను ఎగ్జామ్స్‌లో ఫెయిల్‌ అయిన రోజు.. ''ఫర్వాలేదులేమ్మా.. ఒకసారి పరీక్షలో తప్పినంత మాత్రాన అనుభవం వస్తుంది. పరీక్షలంటే భయం వద్దు.. భయపడితే ఏమీ సాధించలేం!'' అని నన్ను ఓదార్చిన రోజును నేను ఎప్పటికీ మరువను'

నాకు జాబ్‌ వస్తే..
'నాకు మంచి కంపెనీలో జాబ్‌ వచ్చినప్పుడు.. నాన్న కళ్లలో వెయ్యి కాంతుల వెలుగు. ఆ ఆనందాన్ని ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు నాన్నా!'
 

ధైర్యాన్ని నింపావు..
'నాన్నా.. నువ్వు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవాడివి. ఎందుకంటే జీవితంలో జయం ఎంత ముఖ్యమో అపజయం కూడా అంతే ముఖ్యం అని చెప్పి నాలో వాస్తవ జీవితం గురించి ధైర్యాన్ని నింపావు!'
 

యువరాణినే..
'ప్రతి అమ్మాయి తన భర్తకు రాణి అవుతుందో లేదో తెలియదు కానీ.. నాన్నా నీకు మాత్రం ఎప్పటికీ యువరాణినే! నువ్వు నన్ను అలాగే చూస్తావు.'
 

తొలి స్ఫూర్తివి..
'ప్రతి ఒక్క తండ్రి దండనలో ఒక హెచ్చరిక కచ్చితంగా ఉంటుంది. అది జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని దాటేందుకు ఉపయోగపడుతుంది. జీవితంలో ఎందరో స్ఫూర్తిదాతలు ఉండొచ్చు. కానీ ఆ జాబితాలో తొలి పేరు మాత్రం 'నాన్న' నీదే.'
 

అన్నీ నీవే..
'మనకు జన్మను ఇవ్వడమే కాదు.. మనకు భవిష్యత్తును చూపేది కూడా నాన్నే. అందుకే పిల్లలకు మొదటి గురువు, స్నేహితుడు, మార్గదర్శి అన్నీ నాన్నే.. ఆ తర్వాతే ఎవరైనా నాన్నా!'
 

తోడ్పాటు..
'మనకు జీవితంలో ఎదురయ్యే కష్టాల్లో.. తండ్రి ఇచ్చే తోడ్పాటుకు వెలకట్టలేం. భవిష్యత్తులో వెలకట్టేందుకు ఎలాంటి సాధనం ఉండదు. మనం ఏదైనా ప్రయత్నంలో విఫలమైనా.. దాన్ని ఆపొద్దు.. కంటిన్యూ చేయమని.. మరోసారి ప్రయత్నించమని చెప్పే తొలి గురువు నువ్వే నాన్నా.'
 

తొలి పరిచయం..
'మనం జీవితంలో ఎప్పటికీ ఉండే వ్యక్తుల్లో నాన్న తొలి వరసలో ఉంటారు. మనకు తొలిసారి పరిచయమయ్యేది నాన్నే. తొలి స్నేహం నాన్నే. అందుకే నాకు కాబోయే భర్త నీకులా ఉండాలనుకుంటాను నాన్నా!'
 

నీ ఇష్టాలు వదులుకొని..
'నా ఇష్టాలను తీర్చడానికి తన ఇష్టాలని కూడా వదులుకున్నాడు మా నాన్న. మా ఇంట్లో నాన్న అంటే అందరికీ భయం. కానీ నాకు మాత్రం ఆయనంటే చచ్చేంత ఇష్టం. ఎందుకంటే మనలో ఆనందాన్ని నింపి అల్లారుముద్దుగా పెంచి.. మనలోని లోపాలను సరిచేస్తూ మన భవితకు పునాదులు వేస్తూ మన గమ్యానికి దారి చూపేది నాన్నే.

నాన్నకు ప్రేమతో.. కూతుళ్లు..

- ఉదయ్ శంకర్‌ ఆకుల
7989726815