Jan 17,2022 18:52

జోర్డాన్‌కు చెందిన ఒమర్‌ సర్తావి పర్యావరణ ప్రేమికులు. వాతావరణాన్ని కాలుష్యం కాకుండా కాపాడేందుకు తనవంతు కృషిగా నిరంతరం ప్రయత్నించే ఎకో ఫ్యాషన్‌ డిజైనర్‌. మంచి ఆర్టిస్ట్‌. మాలిక్యులర్‌ గ్యాస్ట్రోనమిస్ట్‌. ప్రకృతి నుంచి పుట్టిన పదార్థాలతో, పర్యావరణ అనుకూలమైన ఉత్పత్తులను తయారు చేయడమే అతని ధ్యేయం. ఒక పక్క ప్లాస్టిక్‌తో ఫ్యాషన్‌ ప్రపంచం పురోగతి సాధిస్తున్నా..ఎకో ఫ్రెండ్లీ ప్రొడక్ట్స్‌కీ అదేస్థాయిలో ప్రపంచదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. ఈ క్రమంలో ఒమర్‌ నారింజ తొక్కల నుంచి ఓ అందమైన హ్యాండ్‌ బ్యాగు రూపొందించి ఫ్యాషన్‌ ప్రపంచానికి పరిచయం చేశారు. దీని కోసం డిజిటల్‌ ఫ్యాబ్రికేషన్‌ అనే సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారు.
పండ్ల నుంచి తీసిన తొక్కల్ని సుమారు రెండు వారాల పాటు వివిధ దశల్లో శుభ్రం చేసి, ఎండబెట్టారు. ఆ తర్వాత డిజిటల్‌ ఫ్యాబ్రికేషన్‌ పద్ధతిలో లేజర్‌ ఉపయోగించి హ్యాండ్‌ బ్యాగుకు కావాలిసిన రీతిలో కత్తిరించి బ్యాగు తయారు చేశారు. ఒమర్‌ గత ప్రాజెక్ట్స్‌లో భాగంగా వంకాయ తొక్కలతో మాస్క్‌లు చేశారు. అంతేకాదు.. 400 పెద్ద వంకాయలతో అతడు రూపొందించిన కళాకృతి అనేక ప్రశంసలు అందుకుంది. హానికరమైన రసాయనాలు వాడకం వల్ల అనారోగ్యం, దీర్ఘకాలిక వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. వాటికి ప్రత్యామ్నాయంగా పండ్లు, కూరగాయల నుంచి తీసిన రసాలతో మంచి సువాసన గల సెంట్‌ని కూడా తయారుచేశారు. వీటిని మార్కెట్లో వైద్యులు, యువకులు ఎంతో ఇష్టంగా కొనుగోలు చేశారు. అంతేకాదు.. సేంద్రియ పదార్థాలతో భిన్నమైన ఉత్పత్తులను ఫర్నిచర్‌, ఫ్యాషన్‌ ఉపకరణాల తయారీ కోసం కొత్త సాంకేతిక పరిజ్ఞాన పద్ధతిని కూడా కనుగొంటున్నారు ఒమర్‌.