Jan 16,2021 10:38

నార్వే : కోవిడ్ వ్యాక్సిన్లు ఆరోగ్యానికి ప్రమాదకరమని నార్వే తెలిపింది. బ‌ల‌హీనంగా ఉన్న వృద్ధుల‌కు.. కోవిడ్ టీకాతో ప్ర‌మాదం ఉన్న‌దని, కోవిడ్-19 ఫైజర్ వ్యాక్సిన్ వేయించుకున్న కొద్దిసేపటికే 23 మంది వృద్ధులు మరణించారని నార్వే ఆరోగ్యశాఖ వెల్లడించింది. మ‌రీ బ‌ల‌హీనంగా ఉన్న వృద్ధులు, ఇతరత్రా అనారోగ్య సమస్యల వ‌ల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటార‌ని భావిస్తున్నారు.  ఏమాత్రం ఆరోగ్యంగా లేని వృద్ధుల‌కు  టీకా ఇస్తే, వారిలో  తీవ్ర ప‌రిణామాలు చోటుచేసుకుంటున్న‌ట్లు గుర్తించారు. అయితే,  ఆరోగ్య‌వంతులు, యువ‌కులు టీకాను తీసుకోవ‌చ్చని నార్వే ప్ర‌భుత్వం చెబుతోంది.   వైర‌స్ బారిన పడిన సుమారు 33 వేల మందికి ఇప్ప‌టి వ‌ర‌కు నార్వేలో టీకా ఇచ్చారు. 29 కేసుల్లో సైడ్ ఎఫెక్ట్స్ ప్ర‌భావం ఉండ‌గా... దీనిలో మూడో వంతు 80 ఏళ్లు దాటిన‌వారే.  80 ఏళ్ల వయసు పైబడిన వారిలోనే ప్రతికూల ప్రభావాలు కనిపించాయని వైద్యులు చెప్పారు. వృద్ధుల మృతిపై తాము దర్యాప్తు చేస్తున్నామని నార్వే వైద్యులు చెప్పారు. ఫైజర్ వ్యాక్సిన్ వల్లనే మరణాలు సంభవించాయని ఇంకా నిర్థారించలేదని, మరణించిన 23 మందిలో 13 మంది విరేచనాలు, వికారం, జ్వరం వంటి లక్షణాలు కనిపించాయని వైద్యులు చెప్పారు. నార్వేలో టీకా మరణాలతో  ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఐరోపాలో టీకా సరఫరాను తాత్కాలికంగా తగ్గించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులకు టీకాలు వేయకుండా ఉండాలని నార్వేజియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్  హెచ్చరికలు జారీ చేసింది.