Jul 25,2021 11:10

భూమిపై నుంచి అంతరిక్షంలోకి.. తద్వార వేరే గ్రహం మీదకు మకాం మార్చాలని మానవులు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం అనేక దేశాలు చేస్తున్న కృషీ తెలిసిందే. అయితే ఇప్పటివరకూ వ్యవహారం చంద్రుడు, మార్స్‌ వరకే సాగింది. అయితే ప్రస్తుతం నాసా తన ప్రయాణాన్ని శని గ్రహ ఉపగ్రహాలైన ఎన్‌సెలాడస్‌ వైపుకు మళ్లించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మార్స్‌ కంటే ఎన్‌సెలాడస్‌ నాసాను ఎక్కువగా ఆకర్షిస్తోంది. అందుకు బలమైన కారణాలు అనేకం ఉన్నాయి. అసలు నాసా ప్లానేంటి? ఎన్‌సెలాడస్‌పై మనుషులు జీవించగలరా? వంటి విషయాలు తెలుసుకుందాం.

వంద మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో సాధ్యమంటారు. అలాగే ఏదైనా సాధించాలంటే అందుకు మొదటి ప్రయత్నం అవసరం. అంతేకానీ ఉన్నపళంగా మొదటి మెట్టు నుంచి ఆఖరి మెట్టుకు వెళ్లలేం! అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్లాన్‌ కూడా ఇదే. ఒకేసారి సౌరకుటుంబం అవతల ఉన్న భూమి లాంటి గ్రహాలను చేరుకోవడం ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కాబట్టి, మెల్లమెల్లగా చేరుకునే ప్లాన్‌లో ఉంది. అలా జరగాలంటే, ముందుగా పక్కనే ఉన్న గ్రహాలపై అడుగుపెట్టాలి. భూమికి దగ్గర్లో ఉన్న గ్రహం మార్స్‌. కానీ అక్కడ నీరు ఉందా అన్న డౌట్‌ ఉంది. మార్స్‌ కాకపోతే, సెకండ్‌ ఆప్షన్‌ ఏది అనే ప్రశ్నకు నాసా శనిగ్రహం వైపు చూస్తోంది. ప్రస్తుతం శనిగ్రహ ఉపగ్రహాలు నాసాను ఊరిస్తున్నాయి. వాటిలో ఎన్‌సెలాడస్‌ ఒకటి.

నాసాను ఆకర్షిస్తోన్న ఎన్‌సెలాడస్‌..!


     మార్స్‌కీ శని గ్రహానికీ మధ్య గురుగ్రహం ఉంది. మరి నాసా శని గ్రహాన్నే ఎంచుకోవడానికి కారణం.. గురుగ్రహం మొత్తం బురదతో నిండి ఉంది. దానిపై కాలు పెట్టలేం. పెడితే ఊబిలాగా లోపలికి వెళ్లిపోతాం. అందుకే నాసా దృష్టి శని గ్రహ ఉపగ్రహాలైన టైటన్‌, ఎన్‌సెలాడస్‌పై పడింది. అక్కడ ఇప్పటికే జీవులు ఉండి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అందుకే వాటిలో ఎన్‌సెలాడస్‌ బెస్ట్‌ ఆప్షన్‌గా భావిస్తోంది.
     అయితే ఎన్‌సెలాడస్‌ మొత్తం మంచుతో గడ్డకట్టి ఉన్న ఉపగ్రహం. ఆ మంచు లోపల సముద్రం ఉందనే సందేహమూ ఉంది. ఎందుకంటే మంచు ఉపరితలం మధ్య మధ్యలో నీలి రంగులో గీతల వంటివి కనిపిస్తున్నాయి. అవి పగుళ్లు కావచ్చనీ, ఆ పగుళ్లలో నీలి రంగులో ఉన్నది నీరు కావచ్చని భావిస్తున్నారు నాసా శాస్త్రవేత్తలు.
     శని గ్రహానికి ఉన్న అనేక ఉపగ్రహాల్లో ఇది ఆరో పెద్ద ఉపగ్రహం. అయితే మరీ పెద్దగా ఉండదు. సుమారు 500 కిలోమీటర్ల సైజులో ఉంటుంది. టైటన్‌తో పోల్చితే, దాన్లో పదో వంతు ఉంటుంది. దీని ఉపరితలంపై మంచు కారణంగా ఇక్కడి ఉష్ణోగ్రతలు మైనస్‌ 198 డిగ్రీల సెల్సియస్‌ ఉంటుంది.
ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఎన్‌సెలాడస్‌ ఉపరితలం పైకి మీథేన్‌ వాయువు వస్తోంది. జీవులు ఉన్నప్పుడు మాత్రమే ఈ వాయువు వస్తుంది. ఈ వాయువు ఉంటేనే అవి జీవించేందుకు వీలవుతుంది. భూమిపై సముద్రంలో మైక్రోబ్స్‌ ఎలాగైతే మీథేన్‌ విడుదల చేస్తాయో, అలాగే ఎన్‌సెలాడస్‌ సముద్రంలోనూ సూక్ష్మజీవులు ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు.
     అయితే నాసా పంపిన క్యాసినీ స్పేస్‌ క్రాఫ్ట్‌ ఎన్‌సెలాడస్‌పై చాలాసార్లు ఎగిరింది. ఈ గ్రహం దక్షిణ భాగంలో ద్రవరూపంలో ఫౌంటేన్లు ఉన్నాయి. ముంచు పగుళ్ల (గీజర్స్‌) నుంచి ఆ నీరులాంటి ద్రవం బయటకు చిమ్ముకుంటూ వస్తోంది. ఇందులో ఉప్పు, హైడ్రోజన్‌, ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌ ఉన్నట్లు క్యాసినీ గుర్తించింది. అందువల్ల లోపలి సముద్రం.. భూమిపై సముద్రంలాగే ఉండొచ్చనే అంచనా ఉంది. అందుకే నాసాకు ఈ గ్రహం ఆసక్తికరంగా మారింది.
     వినడానికి ఇదో చందమామ కథలా ఆసక్తిగా ఉన్నా, ఎన్‌సెలాడస్‌ని చేరాలంటే మాత్రం.. ఇప్పుడున్న రాకెట్‌ టెక్నాలజీతో ఆరేళ్లు పడుతుంది. ముందుగా అక్కడ జీవులు ఉన్నదీ లేనిదీ తేలాల్సి ఉంది. ఒకవేళ జీవులు ఉంటే? అక్కడికి మనుషుల్ని ఎలా పంపాలి అన్నది మరో ప్రశ్న. ఇక కాలనీల నిర్మాణం సాధ్యమేనా అన్నది మరో ప్రశ్న. ఇలా ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అయితే ఇది ఒక సుదీర్ఘమైన ప్లాన్‌. ప్రస్తుతం తొలి అడుగులు పడుతున్నాయని అనుకోవచ్చు.