Oct 14,2020 16:27

ఇంకా నడక సరిగ్గా రాని వయసు.. పరుగుకీ, నడకకీ అసలు తేడా కూడా తెలియని ప్రాయం. రేడియోలో పాటలు వస్తుంటే ఆ సవ్వడికి అనుగుణంగా పాదాలు కదిపేది ఆ మూడేళ్ల చిన్నారి. ఏదైనా అడిగితే కళ్లు గుండ్రాలు గుండ్రాలుగా తిప్పుతూనో, చేతులు వన్నెలు చిన్నెలుగా ఆడిస్తూనో సమాధానం చెప్పేది. ఆ కళను చిన్నప్పుడే కళ్లనిండా దర్శించింది వాళ్లమ్మ. ఆ అభిరుచిని ప్రవర్థమానం చేయటానికి చిన్నారిని తీసుకొని మద్రాసుకి ప్రయాణమైంది. ఆ తల్లి కలకు, కళాసక్తికి నిలువెత్తు నిదర్శనం ప్రముఖ కూచిపూడి  నృత్యకారిణి డాక్టర్‌ శోభానాయుడు. ఆమె తల్లి పేరు సరోజినీ దేవి.

శోభకు చిన్నప్పుడు నృత్యం నేర్పుతుంటే వింతగా చూసేవాళ్లు చుట్టాలు. ''చక్కా చదూకోవాల్సిన పిల్లకు ఇవే డేన్సులమ్మా ...'' బుగ్గలు నొక్కుకునేవాళ్లు. అయినా సరే, వాళ్లమ్మ సరోజినిదేవి అవేం లెక్క పెట్టలేదు. ''అమ్మాయికి ఆసక్తి ఉన్న కళను నేర్పాల్సిందే.. '' అని గట్టిగా అనుకొంది. శోభ వాళ్ల నాన్న నీటిపారుదల శాఖలో ఇంజినీరు. ఆయన పేరు వెంకన్న నాయుడు. రాజమహేంద్రవరంలో ఉండేవారు. మొదట్లో శోభకు అక్కడే కెఎన్‌ రెడ్డి గారి దగ్గర నృత్యం నేర్పించారు. నాలుగేళ్లకే ప్రదర్శనలిచ్చేది శోభ. ''ఈ అమ్మాయి ఇంకా బాగా నేర్చుకోవాలంటే మద్రాసు తీసుకెళ్లండి. అక్కడ వెంపటి చిన సత్యం గారి శిక్షణలో అయితే మరిన్ని మెళకువలు నేర్చుకోవొచ్చు.'' అని ఓ సలహా ఇచ్చారు కెఎన్‌ రెడ్డి. ఇల్లును విడిచి, వేరే ఊరు వెళ్లటం సాధ్యమేనా అన్నట్టు సందేహంగా తల్లి వైపు చూసింది శోభ. నేనున్నానుగా అన్నట్టు భరోసాగా కళ్లతో సైగ చేసింది తల్లి. ఆ భరోసాను జీవితాంతం ఇస్తూనే ఉంది ఆమె.

మద్రాసు ప్రయాణం
శోభకు మొత్తం నలుగురు తోబుట్టువులు. ఇద్దరు అన్నలు. ఒక అక్క, ఒక చెల్లి. వాళ్లందరినీ ఇంటి దగ్గరే తన తల్లి, భర్త పర్యవేక్షణలో వదిలి, శోభను ఒక్కదానినే తీసుకొని మద్రాసుకు బయల్దేరింది సరోజినీ దేవి. అక్కడ ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు వెంపటి చిన సత్యం దగ్గర శిక్షణ. అందుకోసం అక్కడికి దగ్గర్లోనే రూ.40ల అద్దెకు ఒక గదిలో ఉండేవారు. అలా పన్నెండేళ్లు. నిద్రలో తప్ప మిగతా సమయమంతా శిక్షణ ... అభ్యాసం. ఇలాగే సాగాయి రోజులన్నీ. మద్రాసులోనే శోభ కూచిపూడి అరంగ్రేటం. ఆ కార్యక్రమంతో కూతురి స్వప్నం నెరవేరినట్టేనని, ఇంటికి తిరిగొచ్చి చదువుకుంటుందని తండ్రి అనుకున్నాడు. కానీ, ''నాట్యమే నా జీవితం.. అందులోనే నాకు తృప్తి. దానిని కొనసాగిస్తాను'' అంది శోభ. తండ్రి అయిష్టంగా తలూపితే, అన్నీ తానై ముందుకు నడిపించింది తల్లి.

shobha naidu and vempati chinasaryam


తండ్రి పేరుతో కలిపి ...
మద్రాసులో చిన సత్యం గారి ఆధ్వర్యంలో శోభ కూచిపూడి ప్రదర్శనలూ, సరికొత్త ప్రయోగాలూ పరంపరగా సాగాయి. సత్యభామ, చండాలిక, పద్మావతి, కృష్ణుడు వంటి పాత్రల్లో ఆమె ప్రత్యేక అభినయం కళాభిమానుల మనసులను పరవళ్లు తొక్కించింది. ఆమె పేరుప్రతిష్టలు మార్మోగటం మొదలైంది. అప్పుడే ఫెమినా మ్యాగజైన్‌ కోసం సునీల్‌ కొఠారి అనే ఆయన శోభను ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలోనే తొట్టతొలి తండ్రి పేరును జోడించి, ''శోభానాయుడు'' అని రాశారు. అది శోభకు మొదట్లో ఇష్టం లేకపోయినా- అదే విశేషంగా ప్రచారం జరిగి, స్థిరపడిపోయింది.

'చండాలిక'తో సామాజిక స్పహ
శోభానాయుడు తాను నాట్యం ద్వారా ప్రసిద్ధి పొందటమే కాదు కూచిపూడి నృత్యానికి కూడా దేశవిదేశాల్లో గొప్ప ప్రాచుర్యం తెచ్చిపెట్టారు. అనేక కథలను, అందులోని పాత్రలనూ కూచిపూడిలో అభినయించి, వాటికొక ప్రత్యేక ముద్ర వేశారు. మన విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రాసిన నృత్యరూపకం 'చండాలిక'. భారత సమాజంలోని కులవ్యవస్థను, అంటరానితనాన్ని తీవ్రంగా ప్రశ్నించిన ప్రదర్శన. దానిని కూచిపూడి నృత్యరీతిలోకి మార్చి, శోభానాయుడు చేత చండాలిక పాత్ర చేయించారు చిన సత్యం. ప్రార్థనలకు, పారవశ్యాలకు మాత్రమే పరిమితమయ్యే సాంప్రదాయ నృత్యకళలోకి... సమకాలీన సమస్యను చొప్పించి ప్రేక్షకులను ఒప్పించటం ఒక గొప్ప ప్రయత్నం. దానిని అవలీలంగా, అత్యద్భుతంగా అభినయించి, మెప్పించారు శోభ.

''ఎందుకు నాకీ శాపమయా
ఏమి నేరము ఒనరించితినయా'' అంటూ సాగిన చండాలిక పాత్రలోని ఆమె అభినయం కరుణ రసార్ద్రంగానే కాదు ఆలోచింపచేసేదిగానూ ఉంటుంది.
అలాగే ''ఓయీ దీనజనాననా ..
కనుల ఎదుట నిలవకు పో పో
మనసులోన మసలకు పో పో
అస్పృశ్యత మా ఆయువుగా
నిస్పృహ మా తోబుట్టువుగా
అవమానము మా భాగ్యముగా
కనికరించి ఇచ్చావా?''
అంటూ ధిక్కార స్వరంతో దేవుడిని ప్రశ్నిస్తుంది. తీవ్ర భావోద్వేగాల పరంపరగా సాగే ఈ ప్రదర్శన శోభ సమకాలీన స్పహకు, ప్రయోగశీలతకు అద్దం పట్టింది. ఎందరివో ప్రశంసలు పొందింది. సాంప్రదాయవాదుల నుంచి విమర్శలు వచ్చినా సరే, ''నవరస నాట్య భామ'', ''సాయిదర్శనం'' వంటి నృత్యరూపకాలనూ ప్రయోగాత్మకంగా రూపొందించి, ప్రదర్శనలూ ఇచ్చారు. ఇలాంటి 20 వరకూ బాలేలు సృష్టించారు. దేశవిదేశాల్లో అభినయించారు. అమెరికా, రష్యా, క్యూబా, సిరియా, టర్కీ వంటి దేశాల్లో పర్యటించారు. మన దేశ సాంస్కృతిక రాయబారిగా ఆంధ్రుల కూచిపూడి నృత్యాభినయాన్ని అనేక అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శించారు.

ఎన్నో పురస్కారాలూ గౌరవాలూ ...
శోభానాయుడు నాట్య ప్రావీణ్యానికి, కృషికి అనేక సత్కారాలూ పురస్కారాలూ లభించాయి. తండ్రి ఆమెను ఒక డాక్టరుగా చూడాలనుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయం ఆమెను గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. అయితే, ఆ సమయానికి తండ్రి చనిపోయారు. 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. శోభానాయుడు హైదరాబాదులోని కూడిపూడి ఆర్ట్స్‌ అకాడెమీ ప్రిన్సిపాల్‌గా, నాట్యాచారిణిగా కొన్ని వేల మందికి కూచిపూడి నృత్యరీతుల్లో శిక్షణ ఇచ్చారు. అలా శిక్షణ పొందినవారి ప్రదర్శనల ప్రతిభా వెలుగుల్లోనే తనకు అత్యంత సంతోషం ఉంటుందని ఆమె తరచూ అనేవారు. ఆ శిష్య ప్రశిష్య కళా పరంపరే ఇప్పుడు ఆమె శాశ్వత చిరునామా.

shobha naidu awards


''ఈ కళ నేర్చుకుంటే ఏముస్తుందీ అని ప్రశ్నించుకునే, లాభం ఏమిటో బేరీజు వేసుకునే రోజుల్లో మనం ఉన్నాం. నిజమైన ఆనందం పోగు పడిన డబ్బులో, అత్యున్నత పదవుల్లో ఉండదు. ఇష్టపడి అభ్యసించే కళలో ఒక మానసికానందం ఉంటుంది. దానిని మనం నిత్యం అనుభవించటమే కాదు మన చుట్టూ ఉన్న వారికీ పంచొచ్చు. కూచిపూడి ద్వారా నేను అదే ఆస్వాదిస్తున్నాను, అందరికీ పంచుతున్నాను.'' అన్నారు శోభానాయుడు ఒక ఇంటర్వ్యూలో. కూచిపూడికి ఇంకా సేవలు అందించే సామర్ధ్యమూ, శక్తీ ఉండగానే - 64 ఏళ్ల వయసులో ఆమె చనిపోవటం కళారంగానికి చాలా వెలితే! ఆమె చూపిన బాటలోనే సమకాలీన దృక్పథాన్ని జోడిస్తూ ... కూచిపూడిని విస్తరిస్తే కళ కలకాలం వర్థిల్లుతుంది. ఆ కళలో శోభానాయుడు చిరకాలం శోభిల్లుతారు!