Sep 27,2021 01:47

నేడు బంద్‌

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
నూతన వ్యవసాయ చట్టాలు, విద్యుత్‌ సవరణ చట్టం, కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలని, స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా, ప్రభుత్వరంగ సంస్థలు పరిరక్షించాలని కిసాన్‌ సంయుక్త మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చిన భారత్‌ బంద్‌కు సర్వత్రా మద్దతు లభిస్తోంది. సోమవారం జరగనున్న బంద్‌కు అన్ని వర్గాలు సహకరించనున్నాయి. ఇప్పటికే సిపిఎం, సిపిఐ, వామపక్షాలు, వైసిపి, తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీ మద్దతు తెలిపాయి. విద్యార్థి, యువజన, మహిళా, కార్మిక, ప్రజా సంఘాలు, ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్టుల ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌) సంఘీభావం ప్రకటించాయి. మోడీ ప్రభుత్వం అమలుచేయబోయే వ్యవసాయ, విద్యుత్‌ చట్టాల వల్ల కలగబోయే నష్టాలను ప్రజలకు రైతు సంఘాలు వివరించాయి. బంద్‌ ప్రాధాన్యతపై విస్తృత ప్రచారం నిర్వహించాయి. నగరంలోనూ, గ్రామీణ ప్రాంతంలోనూ బైక్‌ ర్యాలీలు, సదస్సులు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు జరిగాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యా సంస్థలు, షాపులు, హోటల్స్‌, బస్సు, ఆటో, మోటారు, ఇతర రవాణా కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి. బంద్‌కు మద్దతివ్వాలని బ్రాండిక్స్‌, అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని యూనిట్లు, పరవాడ ఫార్మా కంపెనీల ప్రతినిధులకు రైతు సంఘాల నాయకులు లేఖలు ఇచ్చాయి. కంపెనీ ప్రతినిధులు బంద్‌కు సానుకూలంగా స్పందించారు. మండలాల్లో నిరసన ప్రదర్శనలు, రాస్తారోకో, ధర్నాలు జరగనున్నాయి.

పోరాటాలతో వ్యవసాయ వ్యతిరేక చట్టాలు అడ్డుకుంటాం
జిల్లాలో బంద్‌ విజయవంతానికి గ్రామస్థాయి సమావేశాలు నిర్వహించాం. మండల కేంద్రాల్లో సదస్సులు, రౌండ్‌టేబుల్‌ సమావేశాలు నిర్వహించాం. పరవాడ ఫార్మా, ఎస్‌ఇజెడ్‌లో బంద్‌కు సహకరించాలని యాజమాన్య ప్రతినిధులకు లేఖలు ఇచ్చాం. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలుచేయాలని రైతు సంఘాలు పట్టుబడుతుంటే, మోడీ ప్రభుత్వం ప్రయివేటు వ్యక్తులకు వ్యవసాయాన్ని అప్పగించే చర్యలను వేగవంతం చేస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలతో వ్యవసాయరంగాన్ని పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించాలని మోడీ ప్రభుత్వం చూస్తోంది. వ్యవసాయ చట్టాలు, నూతన విద్యుత్‌ చట్టం రద్దు చేయాలి. ఇవి అమలు జరిగితే రాబోయే కాలంలో వ్యవసాయరంగం దెబ్బతింటుంది. వినియోగదారులకు విద్యుత్‌ రాయితీలుండవు. అందుకనే ఈ రెండు చట్టాలు రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరగడంతో నిత్యావసర సరుకుల ధరలు, వ్యవసాయోత్పత్తులు ఖర్చులు పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతాంగానికే కాకుండా ప్రజానీకానికి హానికరంగా వున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణ, రైల్వే, ఇన్సూరెన్స్‌, బ్యాంకులు, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులు అమ్మకానికి పెడుతోంది. మోడీ ప్రమాదకర చట్టాలు, విధానాలను నిరసిస్తూ బంద్‌ నిర్వహిస్తున్నాం. బంద్‌కు ప్రజల నుంచి విస్తృత మద్దతు లభిస్తోంది. ప్రజా పోరాటాల ద్వారా వ్యవసాయ వ్యతిరేక చట్టాలను అడ్డుకుంటాం.
కర్రి అప్పారావు,
ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి

హానిచేసే విధానాలను అడ్డుకోవాలి
మూడు వ్యవసాయ చట్టాలు, నూతన విద్యుత్‌ సవరణచట్టం అమల్లోకి వస్తే వ్యవసాయరంగం దెబ్బతింటుంది. రైతులు, ప్రజలపై భారాలు పెరుగుతాయి. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కార్పొరేట్ల ప్రయోజనాల కోసం నాలుగు కోడ్‌లుగా మార్చింది. మోనిటైజేషన్‌ పేరుతో ప్రభుత్వరంగ సంస్థల ఆస్తులను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించచూస్తోంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ విధానాలను అడ్డుకోకపోతే దేశ ప్రజలకు తీవ్రమైన నష్టం వాటిల్లబోతోంది. వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలు రద్దు, స్టీల్‌ప్లాంట్‌, ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు రైతు సంఘాలు చేపడుతున్న బంద్‌కు సిపిఎం సంపూర్ణమద్దతిచ్చి, బంద్‌లో భాగస్వామి అవుతుంది.
కె.లోకనాథం,
సిపిఎం జిల్లా కార్యదర్శి
ప్రయివేటు వ్యక్తుల కోసమే వ్యవసాయ చట్టం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్యత తగ్గుతోంది. వ్యవసాయ ఉత్పత్తులు వ్యవసాయ మార్కెట్‌ ద్వారా విక్రయించాలన్న విధానాన్ని వదిలి, ప్రయివేటు వ్యక్తులను ప్రోత్సహిస్తున్నాయి. అదానీ, అంబానీ వంటి వ్యక్తులకు వ్యవసాయరంగాన్ని అప్పజెప్పి రైతును వారు దగాచేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు వలసలుపోతున్న పరిస్థితి ఏర్పడింది. వ్యవసాయ, విద్యుత్‌ చట్టాలు రద్దుచేయాలని రైతులు చేపడుతున్న భారత్‌ బంద్‌లో టిడిపి పూర్తి భాగస్వామి అవుతుంది.
బండారు సత్యనారాయణమూర్తి,
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ
ప్రజలూ భాగస్వాములు కావాలి
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, స్టీల్‌ప్లాంట్‌, రైల్వే, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ నిర్ణయాలను వెనక్కుతీసుకోవాలని చేపడుతున్న బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. దేశ ప్రజల ప్రయోజనాల పరిరిక్షణ కోసం జరుగుతున్న బంద్‌లో ప్రజలందరూ భాగస్వాములు కావాలి.
బి.వెంకటరమణ,
సిపిఐ జిల్లా కార్యదర్శి