
న్యూఢిల్లీ : తూర్పు లఢఖ్ సరిహద్దు ప్రాంతంలో తదుపరి దశ బలగాల ఉపసంహరణకు సంబంధించి 11వ రౌండ్ చర్చలు జరిపేందుకు భారత్, చైనా అధికారులు శుక్రవారం భేటీ కానున్నారు. చుషూల్ ప్రాంతంలో ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానున్న చర్చల్లో కోర్ కమాండర్ స్థాయి అధికారులు పాల్గంటారని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొదటి దశ బలగాల ఉపసంహరణ పూర్తయింది. ఆ తరువాత 48 గంటల్లోగా జరిగిన 10వ రౌండ్ చర్చల్లో.. సరిహద్దు ఏరియాల్లో శాంతి, ప్రశాంతతను నెలకొల్పేందుకు మిగిలిన సమస్యల పరస్పర ఆమోద్యయోగ్యమైన పరిష్కారంపై నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. ఇతర ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణపై పురోగతి కనిపించలేదు. మిగిలిన వివాదాస్పద ప్రాంతాలైన గోగ్రా, హాట్‌స్ప్రింగ్స్, దెప్సాంగ్, దెమ్చోక్లలో దశలవారీ ఉపసంహరణపై తదుపరి చర్చలు జరుగుతాయని అధికారులు తెలిపారు.