Jan 19,2022 02:30

న్యూఢిల్లీ : రైతులు, వ్యవసాయ కార్మికులు, ఇతర శ్రామిక వర్గాల జీవనాధారంపై బిజెపి ప్రభుత్వం నిరంతరం దాడి చేస్తున్న నేపథ్యంలో జనవరి 19, 2022ను ''బలోపేతమైన సమైక్యపోరాటాల కార్మిక, కర్షకుల ఐక్యదినంగా'' జరపాలని తెలంగాణ రైతు, వ్యవసాయ కార్మిక, సీఐటీయులు సంయుక్తంగా నిర్ణయించాయి. 40 సంవత్సరాల క్రితం అంటే, 1982 జనవరి 19న స్వతంత్య్ర భారత చరిత్రలో చైతన్యవంతమైన ఐక్య పోరాట రూపంలో సాధారణ సమ్మె జరిగింది. ఆ సమయంలో పట్టణ, గ్రామీణ కార్మికులు కలిసి ఒకే వేదికపై జరిపిన 'ఒక రోజు సాధారణ సమ్మె'ను కార్మిక కర్షకులు సాధించిన గొప్ప విజయంగా భావించవచ్చు. అయితే 4 దశాబ్దాల కాలం తరువాత కూడా గ్రామీణ కార్మికులు, రైతులకు ఈ సమస్యలకు పరిష్కారం లభించలేదు. కార్మికులు, ట్రేడ్‌ యూనియన్‌లు కనీస వేతనాల చెల్లింపు, కార్మిక చట్టాల అమలు తదితర అంశాలపై పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇదే సమయంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా ఆహారం, నిత్యావసర వస్తువులు ప్రజాపంపిణీ వ్యవస్థ కోసం, సమస్యల పరిష్కారం కొరకు ప్రభుత్వాలపై పోరాటాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం కేవలం వ్యవసాయ కార్మికులు పేద రైతులే కాక గ్రామాల్లో ఉన్న వృత్తిదార్లు కూడా తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ఇవి రోజురోజుకు పెరుగుతున్నాయి. కాబట్టి ఐక్యపోరాటాల కొత్త దశలో సీఐటీయు, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు సంయుక్తంగా జనవరి 19, 2022ను కార్మిక కర్షక ఐక్యతా దినంగా జరపాలన్న సంయుక్త పిలుపు ఇచ్చింది.