Oct 15,2021 00:01
  • బిజెపి పాలిత రాష్ట్రాల్లో అక్కడి సిఎంల దిష్టిబొమ్మల దహనం
  • రైతులకు అందని పరిహారం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : చెడుపై మంచి విజయానికి గుర్తుగా రైతు వ్యతిరేక బిజెపి నేతల దిష్టిబొమ్మల దహనం కార్యక్రమాన్ని ఆయా రాష్ట్రాల్లో స్థానిక పరిస్థితులను బట్టి ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించాలని సంయుక్త కిసాన్‌ మోర్చా (ఎస్‌కెఎం) పిలుపునిచ్చింది. ఈ నెల 15న (దసరా పండుగ రోజు) ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌, కేంద్ర హోం సహాయ మంత్రి అజయ్ మిశ్రాతో పాటు బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల దిష్టి బొమ్మలను ఆయా రాష్ట్రాల్లో దహనం చేయాలని ఎస్‌కెఎం తొలుత పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు సున్నితమైన ప్రాంతాల్లో మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టే యత్నం చేస్తున్నాయని తెలుసుకున్న ఎస్‌కెఎం ఈ ఆందోళనల షెడ్యూల్‌ను స్థానిక పరిస్థితులను బట్టి ఈ నెల 15న కానీ, 16 నకానీ నిర్వహించుకోవచ్చని తెలిపింది. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించి, వెంటనే అరెస్టు చేయాలని ఎస్‌కెఎం తమ డిమాండ్‌ను పునరుద్ఘాటించిందిఈ నెల 18న దేశవ్యాప్తంగా రైల్‌రోకోలు నిర్వహిస్తామని తెలిపింది. లఖింపూర్‌ ఖేరీ ఘటనలో మరణించిన, గాయాల పాలైన రైతులకు పరిహారం వెంటనే అందజేయాలని డిమాండ్‌ చేసింది.

ఉత్తరాఖండ్‌ సిఎంకు నల్లజెండాలతో నిరసన
ఉత్తరాఖండ్‌లో బిజెపి ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామి సొంత జిల్లా ఉద్ధమ్‌ సింగ్‌ నగర్‌లో స్థానిక రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసనను ఎదుర్కొన్నారు. రైతులు తొలుత మండి వద్ద గుమిగూడారు. ఆ తరువాత సిఎం ఉపయోగిస్తున్న హెలిప్యాడ్‌ వద్దకు చేరుకుని, నల్ల జెండాలతో ఆందోళన చేపట్టారు. రాబోయే రోజుల్లో ఇటువంటి నిరసనలను తీవ్రతరం చేస్తామని రైతు నాయకులు ప్రకటించారు. రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్‌లో బిజెపి జాతీయ ఉపాధ్యక్షుడు కైలాష్‌ మేఘ్వాల్‌కు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. అక్కడ వృద్ధ రైతుపై లాఠీల వర్షం కురిపించిన పోలీసు అధికారి నరేష్‌ గెహారాను సస్పెండ్‌ చేయాలని కోరుతూ రైతులు కలెక్టరేట్‌ వెలుపల నిరవధిక నిరసన చేపట్టారు. హర్యానాలోని హిసార్‌లో ఆ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ ధంకర్‌కు వ్యతిరేకంగా రైతులు జిజె యూనివర్శిటీ వెలుపల నల్ల జెండాలతో నిరసన తెలిపారు.
షహీద్‌ అస్థిక యాత్రలు
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి నుండి ప్రారంభమైన షహీద్‌ అస్తిక యాత్ర దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లనుంది. పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ జిల్లా జిరాలో శుక్రవారం భారీ కిసాన్‌ మహాపంచాయత్‌ జరుగుతుంది.
రాయపూర్‌ చేరుకున్న ఆదివాసీల హస్డియో బచావో యాత్ర
ఛత్తీస్‌గఢ్‌లో వందలాది మంది ఆదివాసీలు గత 10 రోజులుగా ''హస్డియో బచావో యాత్ర''లో భాగంగా 300 కిలోమీటర్లకు పైగా నడిచి, రాష్ట్ర రాజధాని రాయపూర్‌కు చేరుకున్నారు. ఆదివాసీల సంస్కృతి, జీవనోపాధిలో అంతర్భాగమైన అడవులను కాపాడాలని, బడా మైనింగ్‌ కార్పొరేషన్ల దోపిడీని నిలువరించాలని, వివిధ రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలను ఉల్లంఘించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యాత్ర నిర్వహించారు.