Oct 17,2021 11:31

ప్రకాశ్‌ రాజ్‌ సౌత్‌, నార్త్‌ అనే తేడా లేకుండా అన్ని సినీ పరిశ్రమల్లో నటించి తమ సొంత భాషా నటుడిగా అందరి మనసుల్లో ముద్ర వేసుకున్నారు. తన నటనతో అన్ని రకాల ప్రేక్షకులనూ వారెవ్వా! అనిపించగల మహా దిట్ట. నటన మీద ఆసక్తితో చదువుకు స్వస్తిచెప్పి దాదాపు రెండు వందల సినిమాలకు పైగా నటించారాయన. ఐదు భారతీయ భాషల మీద పట్టున విలక్షణ నటుడు. అయితే మా ఎన్నికల ఫలితాల అనంతరం 'మా' ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన గురించి కొన్ని ఆసక్తి కర విషయాలు తెలుసుకుందాం..

అసలు పేరు : ప్రకాష్‌ రాయ్
పుట్టిన తేది : 1965 మార్చి 26
పుట్టిన ప్రాంతం : బెంగళూరు, కర్ణాటక
నటించిన భాషలు : తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ
హాబీస్‌ : ఫొటోగ్రఫీ
జీవిత భాగస్వామి : పోనీ వర్మ
పిల్లలు : పూజా, మేఘన, వేదాంత్‌
తల్లిదండ్రులు : మంజునాథ్‌ రాయ్,
స్వర్ణలతా రాయ్
సోదరుడు : ప్రసాద్‌ రాజ్‌

 

నేను నేనుగా బతికా.. నేను నేనుగా ఉంటా..
ప్రకాశ్‌ రాజ్‌ ఒక సుప్రసిద్ధ నటుడు, దర్శకుడు, నిర్మాత. రంగస్థల నటుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం దాదాపు ఆరు భాషల్లో 200 సినిమాల మీదుగా సాగుతోంది. నటుడిగా ఆయనకు తొలి గుర్తింపు తెచ్చిన చిత్రం కె.బాలచందర్‌ దర్శకత్వంలోని డ్యూయెట్‌. ఆయన పుట్టి పెరిగిందంతా బెంగళూరు. మొదట టెలివిజన్‌ రంగంలో అడుగుపెట్టి సినిమాల దిశగా సాగారు. అయితే ఏ విషయాన్నైనా సూటిగా మాట్లాడటం ప్రకాశ్‌ రాజ్‌కి అలవాటు. తాజాగా మా ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన మాట్లాడుతూ..'నేను తెలుగువాడిని కాదు, ప్రాంతీయత, జాతీయవాదం నేపథ్యంలో మా ఎన్నికలు జరిగాయి. 'తెలుగు వ్యక్తి కానివాడు ఓటు వేయవచ్చు. కానీ ఎన్నికల్లో పోటీ చేయకూడదు' అనే నినాదం ప్రారంభించారు. నా తల్లిదండ్రులు తెలుగువారు కాకపోవడం, వాళ్ల తప్పు కాదు. ఒక కళాకారుడిగా నాకంటూ ఆత్మగౌరవం ఉంటుంది. అందువల్ల 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. ఇది బాధతో తీసుకున్న నిర్ణయం కాదు. ప్రేక్షకులకు నాకూ ఉన్న బంధం సినిమాలతో కొనసాగుతుంది. 'మా'తో నాకు 21ఏళ్ల అనుబంధం ఉంది. సాధారణ ఎన్నికల్లోనూ నేను ఓటమి పాలయ్యా. అలాగని రాజకీయాలు వదిలేయలేదు కదా! ఇది కూడా అంతే. అసోసియేషన్‌ నుంచి మాత్రమే బయటకు వచ్చా. తెలుగు సినిమాల్లో నటిస్తా. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోవటానికి వంద కారణాలు ఉంటాయి. నేను నేనుగా బతికా. నేను నేనుగా ఉంటా..' అని అన్నారు.
 

                                                                సామాజిక సేవలోనూ..

కరోనా సమయంలోనూ ప్రకాశ్‌ రాజ్‌ విభిన్నంగా స్పందించారు. అప్పట్లో ఆయన చేసిన ఒక ట్వీట్‌ బాగా వైరల్‌ అయ్యింది. 'మా ఇంట్లో, ఫామ్‌హౌస్‌లో, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, ఫౌండేషన్‌లో ఉద్యోగం చేసే వ్యక్తిగత సిబ్బందికి మూడు నెలల జీతాన్ని ముందుగానే ఇచ్చేశాను. ఇంకా నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబంధించి దినసరి వేతనం తీసుకునే కార్మికులకు సగం జీతం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే. మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని, జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం' ఇది అని 'ప్రకాశ్‌ రాజ్‌ ఫౌండేషన్‌' ద్వారా అనేక సేవలు అందిస్తున్నారు. తెలంగాణలోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు ఓ వ్యక్తికి ఇంటిని కట్టించడం, లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులకు సాయం చేయడం లాంటివి చాలానే చేశారు. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా పెద్దేవం గ్రామానికి చెందిన సిరిచందన అనే విద్యార్థినికి ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్‌ విశ్వవిద్యాలయంలో మాస్టర్స్‌ డిగ్రీ చేసేందుకు సీటు దక్కింది. తండ్రి లేకపోవడంతో ఆమె ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న ప్రకాశ్‌రాజ్‌ ఆ అమ్మాయిని చదివించేందుకు ముందుకు వచ్చారు.
 

                                                         మహిళలను గౌరవించాలి..

'నేను నటుడిని, నాకు సినిమాలు తీయడం తెలియదు. అందుకే సంతృప్తి కోసం నచ్చిన కథలను ఏవో చిన్న బడ్జెట్‌లో తీస్తాను. సమాజం, ప్రజల పట్ల కొన్ని ఆలోచనలు ఉన్నాయి. మహిళల గురించి ఇంకా సినిమాలు రావాలి. పురుషుల్లో మార్పు రావాలి. తల్లిదండ్రులు అబ్బాయిల్ని పెంచేటప్పుడే సన్మార్గంలో పెట్టాలి. మహిళల్ని గౌరవించడం నేర్పాలి. నేను వకీల్‌సాబ్‌ సినిమాలో అమ్మాయిల్ని బాధ పెడుతూ ప్రశ్నించాను. 'ఆర్‌ యూ వర్జిన్‌' అని అడిగినప్పుడు బాధగా అనిపించింది' అని తెలిపారు. అంతేకాదు కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా ప్రకాశ్‌ రాజ్‌ అనేకమార్లు తన గళమెత్తారు. గౌరీ లంకేష్‌ హత్య తర్వాత బిజెపి నేతలపై, ప్రధానమంత్రి మోడీపై పెద్ద ఎత్తున విమర్శలు చేశారు.
 

                                                       మీటూ ఉద్యమానికి అండగా..

'పురుషులతో సమానమైన హక్కులు మహిళలకూ ఉన్నాయన్న విషయాన్ని మనం గుర్తించడం లేదు. వారు ఎదుర్కొంటోన్న నిస్సహాయతకు, అవమానానికి, వేధింపులకు మీటూ ఉద్యమం ముగింపు ఇస్తుందని నమ్ముతున్నా. ఇలాంటి ఉద్యమాలు స్త్రీలను మరింత ధైర్యవంతులను చేస్తాయి. సాధికారత వైపు నడిచేలా చేస్తాయి. లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలకు నా మద్దతు ప్రకటిస్తున్నా' అని ఆయన అప్పట్లో చెప్పారు. కాస్టింగ్‌ కౌచ్‌ సందర్భం లోనూ మహిళలకు అండగా నిలబడ్డారు.