Jan 09,2022 12:47

'ఇబ్బుడికే లచ్చ రూపాయలు దెచ్చిస్తిమి, ఇంకా యాబయ్యేలంటే యాడినుంచి తెచ్చిచ్చేది సామీ... రొవ్వంత సూసుకోండి సారూ!' అంటున్న హనుమక్క గొంతుతో పాటూ ముఖంలోనూ దీనత్వం కనబడుతోంది. 'నాకిచ్చినట్లు మాట్లాడతాండవేందమ్మా? ఇద్దరు డాక్టర్లు, మందులు, రూమ్‌ ఖర్చులు అన్నిటికీ కావొద్దూ. మీ ఆయన్ను బతికిచ్చుకోవాలనుందా? లేదా?' క్యాష్‌ కౌంటర్లో కరెన్సీ మెషిన్లో నోట్లు లెక్కపెడుతూ అంతే ఆటోమేటిగ్గా అన్నాడతను. 'అదేంది సామీ అట్టంటావు? బతికిచ్చుకోవల్లనుకోకపోతే ఈడికేంటికి ఏసకొస్తాము? మందు తాగిన తావనే గెనం మీద ఇడిసి పెడతాంటిమి గదా?'. 'మరందుకే, మందంతా కక్కించాలా? ముందుముందు మందు ప్రభావం లేకుండా చెయ్యాల గదా! దానికంతా దుడ్లు ఖర్చు పెట్టుకోవాలి. ఏమిటి మల్ల కడతావా? మీ ఆయన్ను ఇంటికి తీసకపోతావా?' అన్నాడు. 'సర్లే సామీ, ఎట్లోకట్ల తెచ్చి కడతాన్లే. మీరు సేసేది సెయ్యండి' అంది హనుమక్క.
'అదేందిమా, మల్లా యాబై ఏలంటే యాడ్నుంచి త్యావల్ల. ముందయినప్పే ఎట్టా తీర్చాలా.. అని సస్తావుంటే ఇంగా ఇంగా అంటే...' టౌన్లో డిగ్రీ చదువుతున్న హనుమక్క కొడుకు వెంకటేశు ముఖంలో చిరాకు, ఆందోళన. 'ఎట్లోగట్ల తెస్తాలేరా. నిండా మునిగినంక సలికి భయపడితే ఎట్లా! దుడ్లు లేవని మీ నాయన్ని ఇడిసిపెట్లేం గదా! నేను ఊరికాడికి బోయి యాడన్న తిప్పలు బడతా. నువ్వు రోంత జాగర్తగా సూసుకుంటాండు మీ నాయన్ను' అంటూ జాగ్రత్తలు చెప్పి వెళ్తున్న తల్లినే చూస్తుండిపోయాడు వెంకటేశ.

                                                                      ***

అప్పుడప్పుడు పొలానికి పోయి తండ్రి నారాయణకు కాస్త సాయం చేయడం తప్పిస్తే, పూర్తిగా సేద్యం గురించి ఎప్పుడూ తాను పట్టించుకోలేదు. అప్పులెక్కువయినాయని తల్లీతండ్రి ఘర్షణ పడుతున్నా, తనకు సంబంధం లేని విషయమన్నట్టు ఎప్పుడూ చెవినేసుకోలేదు. ఈ వారం మొత్తం అర్థమవుతున్నట్లే ఉంది. తాత నుంచి తండ్రికి వాటాగా పదెకరాల పొలమొచ్చింది. తన చిన్నప్పుడు ఏం చూశాడో గానీ, ఊహ తెలిసినప్పట్నుంచీ అప్పులే ఆదాయమవుతున్నాయి. ఉన్న బోరెండిపోతే అప్పు మీద అప్పు తెచ్చి ఒకచోట కాదు, ఆరు చోట్ల బోరేయించాలని ప్రయత్నించాడు. అప్పుల ఊట ఉబికిందిగానీ, భూమిలో నీళ్లు మాత్రం పడలేదు. వాన చినుకుల్ని నమ్ముకొని విత్తనాలకు, ఎరువులకు ఖర్చు చేశాడు. విత్తనాలేసినప్పుడు రాని వాన కాస్తో కూస్తో పంట పండి, కోతకొచ్చినప్పుడు కురిసి, ఆ కాస్త పంటను మట్టిపాలు చేసింది. అప్పుల మొలకలు మాత్రం దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిపోయాయి. ప్రతి ఏడాదీ ఇదే తంతు. పదెకరాల పొలం అప్పుడింత ఇప్పుడింత కరిగిపోయి, మూడెకరాలకు కుంచించుకుపోయింది. చేయడానికి మరోపని చేతకాదు, చేయాలన్నా మనసు రాదు. మళ్లీ మళ్లీ అప్పులు, కురవని వాన, నీళ్లూరని నేల.. ఎన్నున్నా ఆశల విత్తనాలు మాత్రం విత్తుతూనే ఉన్నాడు నారాయణ. విత్తనాలకు, పురుగు మందులకు, ఎరువులకు అంగట్లో చేసిన అప్పులు, బయట చేసిన అప్పులన్నీ కలిపి మూడున్నర పైమాటే. ఒక్కసారి గావాల.. వానలు బాగా కురిసి, చనిక్కాయకు చిక్కకపోయినా భూగర్భజలం పెరిగిందని మరోసారి బోరేయించాడు. మున్నూరడుగులు లోపలికి పోతే రోన్ని నీళ్లు తగిలినందుకే సంబరపడిపోయాడు. ఉల్లిగడ్డ నారు తెచ్చి పెడితే, నారాయణ కష్టం వృథా పోకుండా బాగా కాపొచ్చింది. 'ఈ దఫా అప్పులన్నీ తీరిపోతాయి లేరా!' వెలిగిపోతున్న తండ్రి ముఖాన్ని చూసి వెంకటేశ ఆనందపడ్డాడు.

                                                                        ***

కానీ మార్కెట్‌ మాయాజాలం మరో విధంగా నిర్ణయించింది. కూలీలను మాట్లాడి, పీకించే లోపలే ఉల్లిగడ్డ రేటు భారీగా పడిపోయి, కూలీల ఖర్చులు కూడా రావని అర్థమైంది. ఉల్లిగడ్డలు పొలంలోనే కుళ్లిపోయాయి. అదేం విచిత్రమో పంటంతా అయిపోయి, చేను నున్నగైపోయినంక ఉల్లిగడ్డ కేజీ నూర్రూపాయలకు పరిగెత్తింది. బోర్లో నీళ్లున్నా యని మళ్లా ఏడాది ఆశ. రైతు కదా! కానీ ఆ రోన్ని నీళ్లు ఇంకిపోయి, బోరెండిపోయింది. పోయినేడాది వాన పడింది గదా! అని ఈ ఏడాది చనిక్కాయతో మళ్లీ ఓసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. కాస్త అదునులో వానపడి, పంట బాగానే ఎదిగింది. పచ్చగా పెరుగుతున్న పంటను చూసి మురిసిపోయేంతలో లద్దెపురుగు చేరి పంటను తినేయడం మొదలైంది. 'మోనోక్రోటోఫాస్‌ ఎయ్యప్పా' అంటూ వాళ్లూ వీళ్లూ చెప్పిన సలహాలు విని, ఇంకో అప్పు జత చేసి తెచ్చాడు. అయినా అవేం పురుగులో చావనే లేదు. ఏ మందుకైనా తట్టుకునే శక్తిని వరంగా పొందాయో, లేకపోతే మందులే కల్తీ అయిపోయాయో నారాయణకు మాత్రం మూడు పంటలు, ఆరు అప్పులు అన్నట్టు సాగుతున్న సేద్యంతో తట్టుకునే శక్తి లేకపోయింది. ఒకవైపు బ్యాంకోళ్లు ఇంటికొచ్చి నోటీసిచ్చిపోయారు. మరోపక్క అప్పులిచ్చిన పెద్ద మనుషుల మాటలు దిగజారిపోయాయి. పంటకేసిన మందు తన మీద పనిచేస్తుందో లేదోనని చూడాలనుకున్నాడేమో గటగటా తాగేశాడు. గెనం మీద నురగలుకక్కుతూ పడిపోయిన మనిషిని ఎవరో చూసి చెప్తే హనుమక్క బోరుమంటూ ఏడుస్తూ అనంతపురం తీసుకొచ్చింది. పెద్దాసుపత్రి మీద అనుమానంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చింది. నాలుగు దినాలయింది... ఖర్చు పెరుగుతోంది గానీ, ఆయువుందో లేదో తెలీడం లేదు.

                                                                        ***

ఏంతిప్పలు పడిందో గానీ యాభై వేలు తెచ్చి, ఆస్పత్రిలో కట్టింది హనుమక్క. డబ్బులు తీసుకొని రెండు గంటలు గడిచాక చావు కబురు చల్లగా చెప్పారు డాక్టర్లు. 'మేం ఎంత ప్రయత్నించినా బతికించలేకపోయాము. ఇంకొంచెం ముందు తెచ్చుంటే ప్రయోజనం ఉండేది'. డబ్బులు తీసుకొని శవాన్నంటగట్టిన డాక్టర్ల మీద దుమ్మెత్తిపోసింది హనుమక్క. 'మీ దూము తగిలిపోనూ... లచ్చలు మింగి శవాన్ని సేతిలో పెడితిరి గదరా! దొంగనాయాండ్లారా?' ఎంత వగచినా ఏ ప్రయోజనమూ లేకుండా పోయింది.
'ఇదో అనుమక్కా నీ కోసం ఎవురో వచ్చినారు. మీ ఇంటి కాడుండారు'. పక్కింటి లచ్చుమమ్మ మాటలతో చేన్లో కలుపులేరుతున్న హనుమక్క తలెత్తి చూసింది. 'ఎవురంట లచ్చుమమ్మా?' 'ఎవురో నాకెట్టా తెలుత్తాది? టవును కాడినుంచి వచ్చినారు బిరీన్రా'. ఇంటికొచ్చిన హనుమక్కకు బయటే కారు దగ్గర నలుగురు వ్యక్తులు కనిపించారు. ఎవరో తెలియకపోయినా, ఎందుకొచ్చారనేది హనుమక్కకు అర్థమైపోయింది. నారాయణ చనిపోయినప్పట్నుంచీ పరామర్శకు ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. 'కూచ్చోండయ్యా' తలుపు తెరచి చాప పరిచింది. అతి మామూలుగా పనులు చేసుకుంటున్న హనుమక్కను చూసి లోపల్లోపలే ఆశ్చర్యపోయారు వచ్చినవాళ్లు. 'ఆత్మహత్య చేసుకున్నది ఈమె భర్తేనా?' ఎంత గుసగుసగా అన్నా.. హనుమక్క చెవులబడ్డాయి మాటలు. 'మాయాయిప్పేనయ్యా పురుగుల మందు తాగి సచ్చిపోయిండేది. ఆయప్ప సచ్చిపోయినాడని నేనూ యేడుస్తూ కూచ్చుంటే పిల్లోల్లకు బువ్వెట్టా వత్తాదయ్యా? ఆయప్పంటే బతికేకి శాతగాక సచ్చిపోయినాడు. నేను సచ్చేదాక బతకల్ల, పిల్లల్ని బతికిచ్చుకోవల్ల'. మంచినీళ్లు అందిస్తూ చెబుతున్న హనుమక్క మాటల్లో గుండె నిబ్బరం.

                                                                          ***

'ఎంత పొలముందమ్మా మీకు? ఏం పంటలు వేశారు?' వచ్చిన వాళ్లల్లో అందరికంటే ఎత్తుగా ఉన్న రంగనాథ్‌ అడిగాడు. 'మూడెకరాల పొలముందయ్యా. నీల్లు పడతాయనే ఆశతో వడ్డీకి దుడ్లు తెచ్చి బోరింగేపిచ్చినాడు. పతేడూ చనిక్కాయ పెడతాంటిమి. పోయినేడు రోన్ని నీల్లూరినాయని మల్లా బోరింగేపిచ్చి ఉల్లిగడ్డ పెడితిమి. పంట శానా వచ్చిందని సంబరపడిపోతే రేటు పడిపోయి, కూలి దుడ్లు గుడక రావని పంట నిడిసిపెడితిమి. మల్లా నాలుగు సినుకులు రాలంగానే చనిక్కాయ ఇత్తినాము. ఇత్తనాలకు, ఎరువులకు, పురుగు మందులకు అంగట్లో అప్పు పెట్టె. బ్యాంకులో అప్పు, అంగట్లో అప్పు, ఆడా ఈడా తెచ్చిండేది అన్నీ కలిపి మూడున్నర లచ్చలు దాటిపాయె. ఇది సాలదని పురుగుమందు తాగి గెనం మీద పడిపోయింటే బతికిత్తారని టవున్లో ఆస్పత్రిలో జేరిస్తే, మారాజులు నాలుగు దినాలు పెట్టుకొని, లచ్చన్నర కర్సు పెట్టిచ్చి, శవాన్ని సేతిలో బెట్టిరి'. చెప్పిచెప్పి అలవాటయినట్లు అప్పజెప్పినట్లు చెప్పింది. 'ప్రభుత్వం నుంచి నష్టపరిహారం ఏమీ రాలేదామ్మా?' కాస్త లావుగా ఉండే గోపాలం ప్రశ్న.
'ఏందయ్యా పరారమా? సచ్చిపోయిన ఇరవై నాలుగ్గంటల్లోపల ఇసయం సెప్పలేదని, అంగట్లో కొనక్కొచ్చిన ఎరువులకు, మందులకు రసీదు కాయితం లేదని ఏ పరియారమూ రాదన్రి సామీ. మందు తాగి సచ్చిన సంగతి వాల్లకప్పుడు సెప్పల్లని మాకెట్ట తెలుత్తాది సారూ? ఏడుత్తా కూకుని శవాన్నెట్ల సాగనంపల్లా అని సింతజేసేకే సరిపాయె. ఇంగ అప్పు మింద దెచ్చిన ఎరువులకు రసీదులిచ్చే మారాజులెవరు?' హనుమక్క ఆవేదన. 'వితంతు పింఛనుకు రాయించుకుంటిరామ్మా?' చప్పగా సాగుతోంది విచారణ. 'ఏంటికి లేదు సామీ! అయినా నాకియ్యరంట. మేమేందో వాల్లనూ వీల్లనూ పిల్లం పిచ్చుకొని సెప్తాండమని ఉండేవి గుడక ఊడబీకుతాండరు. బియ్యం కాడరు గుడక పీకి పార్నూకినారు. వాల్లతోనే దుడ్లిప్పిచ్చుకోండి మేమియ్యమంటారు. అప్పులోల్లు గూడా మీయట్లాటోల్లు ఏమన్నా ఇచ్చేకి వచ్చినారేమోనని సుట్టుకుంటారు అట్లాపోతానే. ఏమనుకోవద్దు సామీ, ఇట్ల మీరూ వచ్చినంత మాత్రాన మాకు ఒరిగేదేందీ లేదు. పంచేటు, బరువు సేటు తప్ప'. ముఖం మీద కొట్టినట్టు తగిలాయి మాటలు. 'అట్లగాదమ్మా, మీ ఒక్క కుటుంబమే గాదు ఈ సమస్యల్లో ఉన్నది, ఇంకా చాలామంది రైతులు పంటలు పండక, పండిన వాటికి ధర రాక అగచాట్లు పడుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు పదుల సంఖ్యలో ఆత్మహత్యలు చేసుకున్నారు. పరిహారం రాక, అప్పులు తీర్చలేక వాళ్ల కుటుంబాల వాళ్లు అవస్థ పడుతున్నారు. ప్రభుత్వం మీద వత్తిడి తెచ్చేకి మీ నుంచి వివరాలు తెలుసుకోవాలని వచ్చినాము. మీకు అండగా ఉంటామని ధైర్యం చెప్పేకి వచ్చినాము. మీరు చెప్పిన విషయాలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకపోయి, మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాము. వస్తామమ్మా'. బయల్దేరడానికి లేచారు. 'మంచిదయ్యా, మీరెల్లబారితే నేనూ నా పనికిపోతా!' చేతులు జోడించింది హనుమక్క.

                                                                            ***

'ఏమనుకుంటాండవు, ఇంగా ఎన్ని దినాలు?' బయట గట్టిగా అరుపులు, భయంకరంగా తిట్లు వినబడి బయటికొచ్చింది. హనుమక్క, లచ్చుమమ్మ ఇంటికాడ జనాలు. 'ఎన్ని దినాలయిపాయె దుడ్లు తీసుకొచ్చి. వడ్డీ లేదూ అసలూ లేదు. ఎప్పుడడిగినా ఇదో ఇస్తా, అదో ఇస్తా అంటావు' అంటూ అప్పిచ్చిన ఆసామి ఎవరో లచ్చుమమ్మ ఇంటిమీదికొచ్చి అరుస్తున్నాడు. లచ్చుమమ్మ భర్త ఈరన్న నిమ్మకు నీరెత్తినట్లు గొంతుక్కూచుని నిర్వికారంగా చూస్తున్నాడు.
'ఇచ్చేత్తాం సామీ, ఈ ఒక్క పంట అమ్మంగానే ఇచ్చేత్తాము. ఈ ఒక్క పాలికి మా మర్యాద తియ్యకుండా ఎల్లిపోండ'ి లచ్చుమమ్మ బతిమాలుకుంటోంది. 'అవు నీకొక్కదానికే మర్యాద. మాకెవురికీ లేదు. అంత రోసముండేదానివి యాడికన్నా పోయి సంపాయిచ్చక రావచ్చు కదా! దుడ్లు తెచ్చిన మొగోడు చూడు బండరాయి తిన్న కూచ్చుని, ఆడదాన్ని ఎగదోస్తున్నాడు'. 'ఏంమాటలయ్యా అయి.. ఇస్తానంటాండ గదా! ఈ ఒక్కసారికీ నా మాటినుకోండి' అంటూ వచ్చినవాళ్ల కాళ్లు పట్టుకునేదొక్కటి తక్కువ లచ్చుమమ్మ. 'ఇదే ఆఖరు, నువ్వేంజేస్తావో, మీ ఆయనేం జేస్తాడో నాకు తెల్దు. రేపటిదినం బాకీ తీర్సకుంటే నీ కూతుర్ని తోలకపోతా!' ఈరన్న వైపు వేలు చూపిస్తూ వెళ్లిపోయాడు. లచ్చుమమ్మ ఏడుస్తూ కూలబడింది. హనుమక్క లచ్చుమమ్మ దగ్గరికొచ్చి భుజం మీద చెయ్యేసింది. 'ఊరుకో లచ్చుమమ్మా, రాన్రానూ రైతుల బతుకు అందరికీ అదవైపోయింది. ఇట్లా నాకొడుకులంతా నోటికొచ్చినట్ల వాగుతాంటే సిగ్గుతో సచ్చిపోతాండం'. 'అసలు నాబిడ్డేం జేసింది. వాల్ల నాయిన జేసిన అప్పుకు ఈ పిల్లనట్లంటాంటే నరాలు కోసినట్లయితాంది. రేపొచ్చి వాడేం వాగుతాడో, ఏం సూడాలో!' లచ్చుమమ్మ తలబాదుకుంటూ లోపలికి పోయింది.

                                                                           ***

'ఓమా.. ఎంత పన్జేస్తివిమా!' అరుపులతో ఉలిక్కిపడి లేచింది హనుమక్క. వాకిలి తీసి శబ్దం వినబడిన లచ్చుమమ్మ ఇంటివైపు పరుగెత్తింది. దూలానికి వేలాడుతున్న లచ్చుమమ్మ శరీరాన్ని పట్టుకొని, ఆమె కూతురు పదిహేడేళ్ల గౌరి రోదిస్తోంది. 'సూస్తివా సిన్నమ్మా, మాయమ్మ ఎంత పన్జేసినాదో!' హనుమక్కను గట్టిగా కౌగలించుకొని ఏడ్చేసింది.
చుట్టుపక్కల జనాలు పోగయి శవాన్ని కిందికి దించారు. ఈరన్న ఇప్పుడూ గొంతుక్కూచుని, అట్లే శూన్యంలోకి చూస్తున్నాడు. 'పాపం ఆడకూతురని చూడకుండా నానామాటలంటే ఎట్ట తట్టుకుంటాది?' 'అప్పులు మించిపాయె. తీరేదారి కనబడక, అభిమానమున్న మనిసి గనక ఉరి బిగిచ్చుకున్నాది'. తలా ఒకమాట అంటున్నారు. దగ్గరైనోళ్లు ఏం చేయాలో? ఎట్ల చేయాలో? చర్చించుకుంటున్నారు. 'బాకీలిచ్చినోళ్లు నోటికొచ్చినట్ల వాగినారని ఉరేసుకుని సస్తే బాకీలు తీరిపోతాయా?' హనుమక్క మనసులో అనుకోబోయి బయటికే అనేసింది. అంతలోనే ఏదో గుర్తొచ్చిన దానిలా 'ఇదుగో గౌరమ్మా, మీ నాయనకు చెప్పి ముందు పోలీసోల్లకు, ఆపీసరోల్లకు తెలియజెప్పమను. ఏమన్నా దుడ్లు వచ్చేదుంటే, సచ్చినోల్లు ఏదో ఒక సాకు జూపిచ్చి ఎగరనూకుతారు'. తన అనుభవం గుర్తుచేసుకొని, వెంటనే సమాచారం ఇవ్వకపోతే నష్టపరిహారం వస్తుందో రాదోనని ముందుజాగ్రత్త కోసం సలహా ఇచ్చింది. గౌరి వాళ్ల నాయనకేసి చూసింది.

                                                                          ***

'ఏందమ్మే, నెలయిపోయిండ్లా మీ అమ్మ సచ్చిపోయి, ఏమంటాండరు ఆపీసర్‌ సారోల్లు? ఏమన్నా దుడ్లిత్తారంటనా?' నడుం మీద నీళ్ల బిందె మోసుకొస్తున్న గౌరినడిగింది పొలం నుంచి ఇంటికొస్తున్న హనుమక్క. 'ఏందీ రాదంట సిన్నమ్మా. మాయమ్మ అసలు రైతే గాదంట! భూమి మీయమ్మ పేరు మింద లేదు గాబట్టి మీయమ్మ రైతు గాదు అన్నారు'. గౌరి మాటలతో తెల్లబోయింది హనుమక్క.
'ఏందే ఈ యిసిత్రం. పొద్దుగుంకులూ నాగలకట్ట మింద కూకోని బీడీ మింద బీడీ గాల్సుకుంట, పులీ మేకా ఆడతా, యవ్వారాలు జేస్తాండే మీనాయన రైతా? కోడి కూసేకి ముందులేసి నడుమొంగిపోయినట్ల పంజేసిన మీయమ్మ రైతు గాదా? థూ... ఎదవనాబట్లు. వచ్చే నాలుగు దుడ్లు ఎగనూకేకి ఏమేం సావు సస్తారో!' గట్టిగా క్యాకరించి ఉమ్మేసింది హనుమక్క.
'ఊనంటమా, పొలం ఎవరి పేరు మింద ఉంటే వాల్లు సచ్చిపోయింటేనే పరిహారం వచ్చేకి వీలయితాదంట. మనూర్లో ఆడోల్లెవరి పేరు మిందా పొలాలు లేవు గనక రైతులు కాదంటాండరు'. వెంకటేశు మాటలకు లచ్చుమమ్మ కళ్లల్లో కదిలింది హనుమక్కకు. నాలుగు సినుకులు రాలితే సాలు మొగుని కంటే ముందు గంప నెత్తినబెట్టుకొని, పార తీసుకొని చేనికి పోయేది లచ్చుమమ్మ. యిత్తనాలేసేకి, నాట్లేసేకి, కలుపుతీసేకి, కోతకోసేకి, గడ్డి వాము ఏసేకి ఎంతెంత పంజేసేది లచ్చుమమ్మ! అన్ని పనులు జేసినా కడాకు పంట అమ్మేతప్పుడు ఆయిమ మొగునిదే పైమాట, ఎంతకమ్మిండేదీ తెల్దు, ఎంత వచ్చిండేదీ తెల్దు. ఆ మాటకొస్తే లచ్చుమమ్మ మటుకే గాదు, సేద్యం జేసే అన్ని ఇండ్లల్లోనూ ఆడోల్లకే దండిగా పన్లు, ఎవరో పెద్దపెద్ద ఆసాముల ఇండ్లల్లో తప్పిస్తే. దున్నేతప్పుడు ఎడ్లకు బదులు కాడి మోసి, కూలోల్లతో పంజేపిచ్చి, వేరే పొలాల్లో బదులు పంజేసి, నూర్పిడి జేసి, యిత్తనాలు మల్లా పంటకు దాసిపెట్టి, లెక్కలేనన్ని పనులు జేసే ఆడోల్లు రైతమ్మలు గాదంట. వచ్చే సేద్యం సార్లు గుడక ఏం పంట పెట్టాల, ఎరువులేమెయ్యాల అని మొగోల్లతో మాట్లాడేదే గానీ ఏపొద్దూ ఆడోల్లతో మాట్లాడి ఎరగరు. పట్టాదారు పాసుబుక్కుంటేనే రైతా? ఏందీ అన్యాయం? మొగోని ఆస్తిలో బాగమైనట్టు, ఆ పొలాల్లో కూలి లేకుండా బతికినంతకాలం పారా, కొడవలి తిన్న పంజేస్తా ఉండాలా?' 'మా!' వెంకటేశు పిలుపుతో హనుమక్క ఆలోచనల్లోంచి బయటికొచ్చింది.
'మా... ఎమ్మార్వో ఆఫీసులో పట్టా పాసుబుక్కు నా పేరు మింద మార్చుకునేకి పోవల్లంట'. 'అట్లనేలేరా!' నిమిషమాగి, 'వొద్దులేరా!' అంటున్న తల్లిని ఆశ్చర్యంగా చూశాడు వెంకటేశ. 'నీపేరు మీదొద్దులేరా, నా పేరు మింద రాపిస్తాం'. వెంకటేశు ముఖంలో క్వశ్చన్‌ మార్కు మరింత పెద్దదయింది. 'అదేంది మా, నీపేరు ఎట్ల రాపిచ్చల్ల?'. 'ఏం ఏంటికి రాపీగూడదు? నేను సేద్యం పన్లు జేస్తాండ్లేదా? సేన్లో పంజేసేకి మేంగావాలగానీ, పాసుబుక్కులో పేరెక్కిచ్చేకి తరుంగామా? నేనూ రైతునేరా, నా పేరు మిందే ఉండనీ. నేను పొయినంక నువ్వూ, నీ సెల్లెలూ సగం సగం తీసుకుందురు'. హనుమక్క గొంతు స్థిరంగా పలికింది.

ఎమ్‌. ప్రగతి
94407 98008