
నేపాల్‌లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు భారత ప్రజానీకాన్ని ఉత్కంఠకు గురి చేశాయి. ఈ నేపథ్యంలో సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు, ఈ వ్యాస రచయిత (జోగేంద్ర శర్మ) నేపాల్ కమ్యూనిస్టు పార్టీ నాయకులతో చర్చించారు. ఆ చర్చల ఆధారంగా రాసిన వ్యాసమిది.
పార్లమెంటరీ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు... 2018లో... నేపాలీ కమ్యూనిస్టు ఉద్యమం లోని రెండు ప్రధాన స్రవంతులుగా ఉన్న సిపిఎన్ (యుఎంఎల్), సిపిఎన్ (మావోయిస్టు సెంటర్) విలీనమై (ఐక్య నేపాల్ కమ్యూనిస్టు పార్టీ) ఎన్నికల్లో పోటీ చేసి మూడింట రెండొంతుల మెజార్టీతో తిరుగులేని విజయం సాధించింది. ఏడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు గాను ఆరింటిని కైవసం చేసుకుంది. నేపాల్‌లో రాజకీయ అనిశ్చితి తొలగిపోయినట్టేనని నేపాలీ ప్రజలు, అలాగే ప్రపంచ వ్యాపితంగా ఉన్న ప్రజానీకం ఆశించారు.
ఎన్నికల్లో ప్రజలకిచ్చిన వాగ్దానాలను కమ్యూనిస్టు ప్రభుత్వం నెరవేరుస్తుందని, వారికి ఊరటనిస్తుందని, సంస్థలను నిర్మించి, వాటి పటిష్టతకు అవసరమైన చట్టాలు తెస్తుందని, సమాఖ్య వ్యవస్థ ఏర్పాటు, రాజ్యాంగ నిబంధనల ప్రకారం సమాఖ్య వ్యవస్థ సాఫీగా సాగేందుకు అవసరమైన నిబంధనలను రూపొందిస్తుందని ప్రజలు కమ్యూనిస్టు పార్టీకి పట్టం కట్టారు.
రెండు కమ్యూనిస్టు పార్టీలు విలీనమైనట్లు 2018, మే 17న ప్రకటించాయి. దీనిని రెండు పార్టీల విలీనంగా మాత్రమే చూడరాదు, నేపాల్ కమ్యూనిస్టు ఉద్యమంలో రెండు సైద్ధాంతిక పాయల కలయికగా కూడా ఉంటుందని అవి హామీ ఇచ్చాయి. కామ్రేడ్ కె.పి. శర్మ ఓలి, పుష్ప కుమార్ దహల్ ప్రచండ ...ఇద్దరూ పార్టీకి చైర్మన్లుగా ఉంటారని ప్రకటించారు. మాధవ్ కుమార్ నేపాల్‌ను పార్టీ సీనియర్ నాయకునిగా వ్యవహరిస్తారని చెప్పారు. పార్టీ నిర్ణయం ప్రకారం ఇద్దరు చైర్మన్ల మధ్య పని విభజనలో భాగంగా కె.పి. ఓలి పార్టీతో సంప్రదిస్తూ ప్రభుత్వానికి సారథ్యం వహిస్తారు. ప్రచండకు పార్టీ నిర్వహణ బాధ్యతను అప్పగించడంతోబాటు కార్యనిర్వాహక అధికారాన్ని దఖలుపరిచారు. పార్టీ విలీన ప్రక్రియ అట్టడుగు స్థాయివరకు తీసుకెళ్లి పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రచండకు అప్పగించారు.
పార్టీ చేసిన ఈ నిర్ణయాలన్నిటిని కె.పి. ఓలి ఉల్లంఘించి, వ్యక్తిగత పోకడలకు పోవడంతో సమిష్టి నిర్ణాయక ప్రక్రియ నిలిచిపోయింది. విలీన ప్రక్రియ దాదాపు ఆగిపోయింది. నిర్ణీత సమయంలో జరగాల్సిన పార్టీ విలీన మహాసభ సన్నాహాలు ఆగిపోయాయి. ఓలి సీనియర్ నాయకులను, పార్టీ అత్యున్నత నిర్ణాయక సంస్థలను తోసిరాజని తన ఇష్టానుసారం ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపణలున్నాయి. ఓలి తన రాజకీయ ఆకాంక్షలు, వ్యక్తిగత ఎజెండాను నెరవేర్చుకోవడం కోసం వ్యక్తిపూజను ప్రోత్సహించారు. ఈ క్రమంలో ప్రజల ఆకాంక్షలను వమ్ము చేశారు. పార్టీని పూర్తిగా ఆయన పక్కన పెట్టేశారు. ఫలితంగా అన్ని రంగాల్లోను ప్రభుత్వం విఫలమైంది. ప్రజల్లో క్రమంగా అసంతృప్తి పెరుగుతున్నది. ఓలిని సరిదిద్దడానికి పార్టీ చేసిన అన్ని యత్నాలు విఫలమయ్యాయి.
ఈ పరిస్థితుల్లో, 20 మంది సభ్యుల విజ్ఞప్తి మేరకు స్థాయీ సంఘం సమావేశమై కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు చేసింది. ప్రభుత్వ విధానాల్లో సోషలిస్టు దృక్పథం ప్రతిబింబించేలా చూడాలని ప్రధాని కె.పి.ఓలిని ఆదేశించింది. అవినీతిని అరికట్టాలని, ముఖ్యమైన విధాన నిర్ణయాలు, రాజకీయ నియామకాలు చేపట్టడానికి ముందు పార్టీని సంప్రదించాలని కోరింది. కేంద్ర మంత్రిమండలి , రాష్ట్రాల ప్రభుత్వాల పునర్వ్యవస్థీకరణ వంటివి పార్టీని సంప్రదించాకే చేపట్టాలని సూచించింది. 2021 ఏప్రిల్‌లో పార్టీ మహాసభ నిర్వహించాలని నిర్ణయించింది. పార్టీ స్టాండింగ్ కమిటీ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ముఖ్యమైన రాజకీయ నియామకాలను ఓలి చేపట్టారు. పార్టీకి తెలియజేయకుండా ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై పార్టీలో పెద్దయెత్తున విమర్శలొచ్చాయి. ప్రధానికి, పార్టీ ఇతర సీనియర్ నేతలకు మధ్య పత్రాల లేఖల యుద్ధానికి దారి తీసింది.
ఈ రగడ జరుగుతుండగానే ప్రధాని ఓలి రాజ్యాంగ సంస్థల్లో తనవారిని నియమించుకునేందుకు వీలుగా రాజ్యాంగ పరిషత్ చట్ట నిబంధనలను సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ జారీ చేశారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య సమతౌల్యం దెబ్బ తినకుండా చూసేందుకు ఉద్దేశించిన నిబంధనలను నీరుగార్చేలా ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. దీనిపై పార్టీ స్థాయీ సంఘం అత్యవసరంగా సమావేశాన్ని నిర్వహించింది. దీనికి ప్రధాని ఓలి కూడా హాజరయ్యారు. ఈ సమావేశం అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని, పార్టీ ఐక్యత పరిరక్షించబడుతుందని అందరూ ఆశించారు. రాజ్యాంగ మండళ్ళకు తానెవరినీ నియమించలేదని, తాను విడుదలజేసిన ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంటానని ఓలి ఈ సమావేశంలో చెప్పారు. కానీ అలా జరగలేదు. పైగా, రాజ్యాంగ సంస్థల్లో ఐదు ప్రధానమైన పదవుల్లో నాల్గింటికి అప్పటికే నియామకాలు జరిపేశారని స్పష్టమైంది. ఇది పార్టీ స్థాయీ సంఘాన్ని తప్పుదోవ పట్టించడమే. దీంతో పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది.
గతేడాది డిసెంబరు 20న, ప్రతినిధుల సభ తనను ప్రధాని పదవి నుండి తొలగిస్తుందన్న భయంతో ఓలి, మొత్తంగా ప్రతినిధుల సభను రద్దు చేసి తాజాగా ఎన్నికలు జరపాలని అధ్యక్షురాలికి లేఖ రాశారు. ఈ చర్య నేపాల్ రాజ్యాంగానికి విరుద్ధమని, రద్దు చేయవద్దని ఎన్‌సిపి, ఇతర ప్రతిపక్షాలు కోరినప్పటికీ...అధ్యక్షురాలు పార్లమెంట్ రద్దును ఆమోదించి, తాజా ఎన్నికలకు ఆదేశించారు.
ముదిరిన రాజకీయ సంక్షోభం
దీంతో నేపాల్‌లో రాజకీయ సంక్షోభం మరింత ముదిరింది. పార్లమెంట్‌ను రద్దు చేయాలన్న ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని ప్రధాని ఓలిని పార్టీ ఆదేశించింది. అందుకు ఆయన తిరస్కరించారు. ఈ నేపథ్యంలో పార్టీ కేంద్ర కమిటీ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించాల్సిందిగా ఓలిని ఆదేశించింది. ఆయన మళ్ళీ తిరస్కరించడంతో పార్టీ కో చైర్మన్‌గా ఓలిని తొలగించాలని మూడింట రెండొంతుల మెజారిటీతో కేంద్ర కమిటీ నిర్ణయించింది. మాధవ్ కుమార్ నేపాల్‌ను పార్టీ చైర్మన్‌గా ఎన్నుకుంది. ఇరువురు చైర్పర్సన్లు ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్‌కు సమాన అధికారాలు కల్పిస్తూ స్పష్టమైన నిబంధనలను రూపొందించింది. అధ్యక్షుడి నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని, అలాగే రాజ్యాంగం పైన, ప్రజాస్వామ్యం పైన జరిగిన ఈ దాడికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించాలని కేంద్ర కమిటీ నిర్ణయించింది. అధ్యక్షుడి రాజ్యాంగ విరుద్ధమైన చర్యపై వేసిన కేసు సుప్రీంకోర్టులో వుంది. పార్లమెంటు పునరుద్ధరణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది.
ఈ పరిణామాల మధ్య ఓలిని పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుండి తొలగించింది. పార్టీ, చిహ్నం తమకే కేటాయించాలంటే తమకు కేటాయించాలని ఇరు పక్షాలు ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించాయి. ఎన్నికల కమిషన్ తన తీర్పును ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఫిబ్రవరి 1న ఎన్‌సిపి కేంద్ర కమిటీ సమావేశమై పార్టీ నుంచి ఓలిని బహిష్కరించాలన్న సెంట్రల్ సెక్రటేరియట్ నిర్ణయాన్ని ధ్రువీకరించింది. ఆ మరుసటి రోజు ఎన్‌సిపి నేతలు ఎన్నికల కమిషన్‌ను కలిసి, పార్టీ, చిహ్నం తమకే చెందుతుందని చెప్పారు. ఇందుకు ఆధారంగా తమతో వున్న కేంద్ర కమిటీ సభ్యుల జాబితాను ఎన్నికల సంఘానికి అందచేశారు.
రాజకీయ మితవాదం
ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తుతున్న నేపథ్యంలో నేపాల్‌లో తిరోగామి, మితవాద శక్తులు ఉన్నట్టుండి ఒక్కసారిగా తిరుగుబాటు చేశాయి. నేపాల్‌లో గత పదేళ్ల నుంచి హిందూత్వ మతోన్మాద శక్తులు అత్యంత క్రియాశీలంగా పని చేస్తున్నాయి. సమాఖ్య, ప్రజాతంత్ర నేపాల్ రిపబ్లిక్‌ను హిందూత్వ రాష్ట్రంగా మార్చాలని అవి చూస్తున్నాయి. ఇదే అదనుగా భావించి నేపాల్ మాజీ నిరంకుశ ప్రభువు తన శక్తిని కూడదీసుకునేందుకు దేశవ్యాప్తంగా పర్యటిస్తూ, బహిరంగ సభలు నిర్వహిస్తున్నాడు. ఈ మితవాద శక్తులు నేపాల్ కమ్యూనిస్టు పార్టీపై దాడి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. నేపాల్ రాజకీయాలపైన ఇది తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అనేక కష్టనష్టాలకోర్చి, త్యాగాలకు సైతం వెనుకాడకుండా పోరాడి సాధించుకున్న రాజ్యాంగానికే ముప్పు ఏర్పడింది.
సుదీర్ఘ కాలం పాటు సాగిన రాజకీయ కల్లోలం నుంచి నేపాల్‌ను బయట పడేసేందుకు ప్రజలు అనేక త్యాగాలు చేశారు. రాజరిక వ్యవస్థ రద్దయిన తర్వాత, 2018లో సంపూర్ణ మెజారిటీతో ఓలి ప్రధాని కావడానికి ముందు, 12 ఏళ్ళ వ్యవధిలో ఏకంగా పది మంది ప్రధానులు మారారంటేనే రాజకీయ అస్థిరత ఏ స్థాయిలో ఉందో అర్థమవుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో నేపాల్ కమ్యూనిస్టు పార్టీకి స్పష్టమైన తీర్పునివ్వడంలో ప్రజల రాజకీయ పరిపక్వత, వారి ఆకాంక్షలు ప్రతిబింబించాయి. దురదృష్టవశాత్తూ, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైంది. ఓలి ప్రభుత్వ నిర్వాకానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీ దాదాపు అన్ని రాష్ట్రాల్లో నిరసన ప్రదర్శనలు, బహిరంగ సభలు నిర్వహిస్తోంది. ఈ సభలకు ప్రజల నుండి మంచి స్పందన లభిస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, పౌర సమాజం, వృత్తి నిపుణులు, నల్గురు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులతో సహా చాలా మంది ప్రతినిధుల సభ రద్దుకు వ్యతిరేకంగా తమ గళం విప్పారు. నేపాల్ సంక్షోభం గురించి మాధవ్ కుమార్ నేపాల్ మాట్లాడుతూ...'ఉవ్వెత్తున సాగిన ప్రజా ఉద్యమం ద్వారా సాధించుకున్న నేపాల్ ఫెడరల్ ప్రజాతంత్ర రిపబ్లిక్ సోషలిస్టు భావనలు, ప్రజాతంత్ర విలువలు, రాజకీయ భాగస్వామ్యం, ప్రజల చేతికి అధికారానికి హామీ ఇస్తున్న రాజ్యాంగంపై తిరోగామి శక్తులు జరిపిన దాడి'గా దీనిని అభివర్ణించారు. 'మన పార్టీకి చెందిన ఒక వ్యక్తి నేతృత్వం లోనే ఫెడరల్ రిపబ్లిక్‌పై ఈ దాడి జరగడం దురదృష్టం' అన్నారు. అన్ని రాష్ట్రాల్లోను పార్టీ శ్రేణులు చాలా వరకు కమ్యూనిస్టు పార్టీ వెంటే ఉన్నారని, వారంతా కె.పి.ఓలి నేతృత్వంలోని వర్గానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని మాధవ్ కుమార్ నేపాల్ పేర్కొన్నారు.
నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. ఇది ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చెప్పలేం. ఏడు దశాబ్దాల వర్గ, ప్రజా పోరాటాల అనుభవంతో నేపాల్ కమ్యూనిస్టు ఉద్యమం ఈ సంక్షోభాన్ని విజయవంతంగా అధిగమించగలదని మనందరం ఆశిద్దాం.
-జోగేంద్ర శర్మ