Oct 28,2021 18:42

జెండా ఊపి ప్రత్యేక వాహనాలను ప్రారంభిస్తున్న ఎస్‌పి ఎం.దీపిక

ప్రజాశక్తి - కంటోన్మెంట్‌ : జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఎస్‌పి ఎం.దీపిక తెలిపారు. నేరాలను నియంత్రించేంకు సాంకేతిక సౌలభ్యంతో ప్రత్యేకంగా రూపొందించిన రెండు హాక్‌ వాహనాలను గురువారం జిల్లా పోలీసు కార్యాలయం వద్ద ఎస్‌పి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేరాలను నియంత్రించేందుకు విజయనగరం మున్సిపాలిటీ, నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలో నిత్యం రద్దీగా ఉండేప్రాంతాలను గుర్తించి, కొన్ని ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ రద్దీ ప్రాంతాల్లో విజిబుల్‌ పోలీసింగును
పెంచడంతో పాటు, బ్లూకోల్ట్‌, హాక్‌ వాహనాలతో నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల భద్రతకు ఇకపై రాత్రి బీట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నేరాలు ఎక్కువగా జరుగు
తున్న ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో నేర పరిజ్ఞానం కలిగిన పోలీసులను నియమిస్తామని తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో నిఘా
ఏర్పాటు చేయడంలో హాక్‌ వాహనాలు చాలా ప్రత్యేకమైనవని, ఈ వాహనాల్లో రెండు హై రిజల్యూషన్‌ కెమెరాలను వాహనం ముందు, వెనుక ఏర్పాటు చేసి, లైవ్‌ వీడియోలను ఎప్పటికప్పుడు పరిశీలించే సౌలభ్యం ఉందని తెలిపారు. అపార్టుమెంట్లు, గ్రూపు హౌస్‌ లోను, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ ల వద్ద నేరాలు జరగకుండా వెల్ఫేర్‌ కమిటీలసహకారంతో సిసి కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎఎస్‌పి అనిల్‌పులిపాటి, సిఐలు రాంబాబు, ఎన్‌.శ్రీనివాసరావు, బి.వెంకటరావు, మురళి, లక్ష్మణరావు, మంగవేణి, తదితరులు పాల్గొన్నారు.