Jan 13,2021 11:55

మహబూబ్‌నగర్‌ : అంతర్జాతీయ ఎయిర్‌ షో, పారా మోటార్‌ చాంపియన్‌షిప్‌ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మహమూబ్‌నగర్‌లో జరగుతున్న ఈ పోటీలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ప్రారంభించారు. రాష్ట్ర పర్యాటక శాఖ, వరల్డ్‌ అడ్వెంచర్స్‌, ఎయిర్‌ స్పోర్ట్స్‌ సంయుక్తంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎయిర్‌ షోలో భాగంగా హాట్‌ ఎయిర్‌ బెలూన్‌, స్కై డైవింగ్‌, పారా మోటార్‌ విన్యాసాలు నిర్వహిస్తున్నాయి. హర్యానా, పంజాబ్‌, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలకు చెందిన 11 మంది పారా మోటర్‌ పైలెట్లు పాల్గొంటున్నారు. ఆరు టాస్క్‌లలో పోటీల నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఐదు రోజులపాటు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ పోటీలు జరుగనున్నాయి. పోటీల ప్రారంభం అనంతరం మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో ఈ పోటీలను నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలి ఎయిరో స్పోర్ట్స్‌ శిక్షణ కేంద్రం పాలమూరుకు తరలిరానున్నట్లు చెప్పారు. కరివేన-ఉద్ధండాపూర్‌ రిజర్వాయర్ల మధ్య ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దడంలో ఈ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.