May 05,2021 00:46

సొంతూరుకు వెళ్లిపోయేందుకు బస్సుల కోసం వేచి ఉన్న వలస జీవులు

ప్రజాశక్తి-విశాఖపట్నం ప్రతినిధి
జిల్లాలో కోవిడ్‌ నియంత్రణలో భాగంగా బుధవారం నుంచి కర్ఫ్యూ అమలుకానుంది. ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు దుకాణాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించింది. కోవిడ్‌ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా కర్ఫ్యూ అమలు చేయాలని మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. 12 నుంచి మరుసటి రోజు ఆరు గంటల్లోపు బయటకు తిరిగిన వారిపై పోలీసులు కేసు నమోదుచేయనున్నారు. అత్యవసర వైద్య అవసరాల కోసం ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కర్ఫ్యూ నిబంధనలను పటిష్టంగా అమలు చేయనున్నట్లు జిల్లా ఎస్‌పి బి.కృష్ణారావు తెలిపారు.
ఇవీ నిబంధనలు
నిర్దేశిత సమయంలో షాపులు వద్ద కొనుగోలుదారులు గుంపులుగా ఉండకూడదు. బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలి. మధ్యాహ్నం 12 నుంచి ఉదయం ఆరు గంటల్లోపు బయట తిరిగిన వారిపై డిసాస్టర్‌ మేనేజ్‌ మెంట్‌, ఎపిడిమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌, మోటారు వాహన చట్టాల ప్రకారం పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు. షాపుల వద్ద ఎక్కువ మందిని అనుమతించిన షాపు యజమానులు, ఒకేసారి కొనుగోలుదారులను అనుమతించిన షాపింగ్‌ మాల్స్‌ యజమానులు, కోవిడ్‌ నిబంధనలను పాటించని వారిపై కూడా కేసులు పెట్టనున్నారు.
కోవిడ్‌ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని రద్దీని నియంత్రించేందుకు నగరంలోని ప్రస్తుతమున్న 13 రైతు బజార్లకు అదనంగా మరో 33 మినీ రైతు బజార్లను బుధవారం నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. వినియోగదారులకు నాణ్యమైన కూరగాయలు సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. రైతు బజార్లలో షెడ్లు, టెంట్లు, తాగునీటి సదుపాయం వంటివి జివిఎంసి ఏర్పాటు చేయనుంది.
అదనపు మినీ రైతు బజార్లు
హెచ్‌బి కాలనీలోని అబ్దుల్‌కలాం పార్క్‌, బుల్లయ్య కాలేజీ మైదానం, డాక్టర్‌ విఎస్‌.కృష్ణా కాలేజీ, ఎఎస్‌.రాజా కాలేజీ మైదానం, ఆరిలోవ దుర్గా ఆలయ ప్రాంగణం, విశాలాక్షినగర్‌, ఆరిలోవ లాస్ట్‌ బస్టాండ్‌, తోటగరువు జిల్లా పరిషత్‌ పాఠశాల, డిఎల్‌బి స్కూల్‌ మైదానం, ఎన్‌జిజిఓస్‌ కాలనీలోని ప్రాథమిక పాఠశాల, మైదానం, ఆంధ్ర యూనివర్సిటీ మైదానం, 21వ వార్డులోని కొటక్‌ ప్రి ప్రైమరీ స్కూల్‌, రామ్‌నగర్‌ విశాఖ సేవా సదన్‌ స్కూల్‌, గోపాలపట్నం జిల్లా పరిషత్‌ పాఠశాల, స్టైల్లా మేరీస్‌ పాఠశాల, మురళీనగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల, జ్యోతినగర్‌ జిల్లా పరిషత్‌ పాఠశాల, ఆదర్శ్‌ స్కూల్‌, నవర ఉన్నత పాఠశాల, నాతయ్యపాలెం జిల్లా పరిషత్‌ పాఠశాల, గంగవరం, శివశివానీ, లిటిల్‌ ఏంజెల్స్‌ పాఠశాల, తిక్కవానిపాలెం, వాడపేట, ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ, పెందుర్తి జిల్లా పరిషత్‌ పాఠశాల, ఎన్‌ఆర్‌ఐ కాలేజీ, వేపగుంట జిల్లా పరిషత్‌ పాఠశాల, సాయిబాబా దేవాలయం, ఆర్‌జికె కళ్యాణ మండపం, జిల్లా పరిషత్‌ పాఠశాల, సాంకేతిక ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రాంతాల్లో మినీ రైతు బజార్లు నడవనున్నాయి.
రైతు బజార్ల సేవల విషయంలో వినియోగదారులకు అసౌకర్యం కలిగితే తెలియజేసేందుకు హెల్ప్‌లైన్‌ నెంబర్లు ఏర్పాటు చేశారు. 9859743999, 9182361395 నెంబర్లకు ఎవరైనా ఫోన్‌ చేయవచ్చు.