Aug 06,2022 23:20

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పశ్చిమ ప్రాంతంలో లోటు వర్షపాతం రైతన్నను కుంగదీస్తోంది. ప్రధానంగా యర్రగొండపాలెం నియోజకవర్గంలో కరవు ఛాయలు వెంటాడుతున్నాయి. తీవ్రమైన లోటు వర్షపాతంతో అన్నదాతలు ఆకాశం వైపు చూస్తున్నారు. ఖరీఫ్‌ ప్రారంభమై నెలన్నర గడచినా పొలాల్లో విత్తు పడలేదు. యర్రగొండపాలెం, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్దదోర్నాల తీవ్రమైన కరవు వెంటాడుతోంది. పుల్లలచెరువు మండలంలోని కొంత ప్రాంతంలో వర్షపాతం మెరుగవడంతో బోర్ల కింద పత్తి సాగు చేశారు. యర్రగొండపాలెం, దోర్నాల, త్రిపురాంతకం, పెద్దారవీడు మండలాల్లో నామమాత్రంగానే సాగులోకి వచ్చినట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. గత వర్ష సంవత్సరంలోనూ లోటు నెలకొంది. దీంతో బోర్లన్నీ బట్టి పోయి వర్షాలపైనే ఆధారపడ్డారు. యర్రగొండపాలెం వ్యవసాయ సబ్‌ డివిజన్‌ పరిధిలోని నాలుగు మండలాల్లో పత్తి 8,266 హెక్టార్లకు గాను ఇప్పటి వరకు 3,943, హెక్టార్లలోనే సాగైంది.