
ప్రజాశక్తి-డుంబ్రిగూడ
మండలంలో ప్రముఖ పర్యాటక కేంద్రమైన చాపరాయి జలపాతం వద్ద పర్యాటకుల సౌకర్యార్థం అభివృది పనులు చేపట్టేందుకు గాను అధికారులు ప్రతి ఏడాది టెండర్ పాట నిర్వహిస్తున్నారు. పాట ద్వారా వచ్చిన నిధులతో చాపరాయి జలపాతంలో పర్యాటకుల సౌకర్యార్థం మరుగుదొడ్లు, వాడుకనీరు, తాగునీరుతో పాటు గార్డెన్ తో పాటు ఇతర సౌకర్యాలను అధికారులు కల్పిస్తున్నారు. గత ఏడాది పాడిన చాపరాయి టెండర్ పాట జనవరి 31తో ముగిసింది. ఈ ఏడాదికి సంబంధించి కొత్తగా మళ్లీ టెండర్ పాట నిర్వహించాల్సి ఉంది. పాట గడువు ముగింపునకు కొన్ని రోజుల ముందుగానే సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులు టెండర్ పాట తేదీని ఖరారు చేస్తారు. ప్రస్తుతం టెండర్ గడువు ముగిసినప్పటికీ కొత్తగా అధికారులు పాట నిర్వహణకు చర్యలు తీసుకోకపోవడంతో ఏడాది టెండర్ పాట నిర్వహిస్తారా! లేక వదిలేస్తారా! అనే సందేహంలో స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. టెండర్ పాట ద్వారా ఏడాదికి ప్రభుత్వానికి ఒకేసారి రూ.30 నుంచి రు.32 లక్షల వరకు సమకూరుతుంది. టెండర్ పాడిన నిర్వాహకులు కొంతమంది స్థానికులు గ్రూప్‌గా ఏర్పడి పాట పాడిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. ఆ తర్వాత పర్యాటకుల నుంచి ప్రవేశ టికెట్లతో పాటు వాహనాల పార్కింగ్ టికెట్లను వసూలు చేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా చేయడంతో కొంతమంది నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కూడా కలుగుతుంది. కాగా ఈ ఏడాది గడువు పూర్తిగా ముగిసినప్పటికీ కూడా టెండర్ పాట నిర్వహణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో మండల వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఈ టెండర్ పాట నిర్వహణ ప్రారంభంలో స్థానికంగా చదువుకొని ఖాళీగా ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో గత సుమారు 10 యేళ్ళ క్రితం అధికారులు దీనిని ప్రారంభించారు. ఇప్పటికి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించ లేదు. టెండర్ పాట పాడుకున్న నిర్వాహకులే వారికి అనుకూలమైన వారితో పార్కింగ్‌తో పాటు ప్రవేశ రుసుములను వసూలు చేసుకుంటున్నారు. ఆర్థికంగా వెనుకబడిన నిరుద్యోగ యువత టెండర్ పాటకు ముందుకు వెళ్లలేక పోతున్నారు. ఈ ఏడాదినుంచైనా స్థానిక పంచాయతీకి, స్థానికంగా సొసైటీ రిజిస్ట్రేషన్ నమోదు చేసుకొని ఉన్న సొసైటీ సంఘాలకు, స్థానిక గిరిజనులైన వారికి చాపరాయి జలపాతం నిర్వహణను అప్పగించాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు.