Dec 02,2022 00:19

నేవీ నిర్వాసితుల ఆందోళనలో మాట్లాడుతున్న లోకనాథం

ప్రజాశక్తి - రాంబిల్లి
నేవల్‌ బేస్‌ నిర్వాసితుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌ నిర్వాసిత పెద్దలతో మూడుసార్లు చర్చలు జరిపినా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా, కాలయాపన చేయడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మండిపడ్డారు. తమ సమస్యలపై నేవీ మెయిన్‌ గేట్‌ ముందు ఎనిమిది గ్రామాల నేవీ నిర్వాసితులు చేస్తున్న ఆందోళన గురువారం నాటికి 32వ రోజుకు చేరింది. ఈ ధర్నా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలియజేసిన లోకనాథం మాట్లాడుతూ నేవీ నిర్వాసితుల భూములు, శారద, వరాహ నదులు తీసుకొని వారికి జీవించడానికి మార్గం చూపించకపోవడం బాధాకరమన్నారు. 2013 భూ సేకరణ చట్ట ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలన్నారు. నేవీ నిర్వాసితుల సమస్యలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఒకపక్క నేవి గేట్లు బంధించి, డ్రెడ్జింగ్‌ పనులు చేపట్టి, మరో వైపు జెట్టీ కట్టే అవకాశం లేకపోతే నిర్వాసిత మత్స్యకారులు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. ఎన్‌ఎఒబి ప్రాజెక్టు వచ్చినప్పుడే నిర్వాసిత గ్రామాలను గుర్తించడంలో తీవ్ర లోపం జరిగిందని, గోవిందపాలెం, చిన్న కలవలపల్లి, వాడ రాంబిల్లి, కొత్తపేట గ్రామాల ప్రజలు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం సీరియస్‌గా జోక్యం చేసుకొని నిర్వాసితుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని, లేకుంటే ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి జి.దేవుడునాయుడు, 8 గ్రామాల ప్రజాప్రతినిధులు, వేలాదిమంది నిర్వాసితులు పాల్గొన్నారు.