
ఐక్యరాజ్య సమితి : ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ మిచెల్లి బాచ్లెట్ త్వరలో చైనాలో పర్యటించనున్నారు. జిన్ జియాంగ్ ప్రాంతంతో సహా పలుచోట్ల ఆమె పర్యటన జరపనున్నట్లు ఐరాస ప్రతినిధి తెలిపారు. చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతంలో పర్యటనకు అవకాశం కల్పించాలంటూ ఏళ్లళ తరబడి ఐక్యరాజ్య సమితి సంస్థ కోరుతునే వుంది. ఈ నెలాఖరులో ఆమె పర్యటన ప్రారంభం కానుందని ఆమె కార్యాలయం తెలిపింది. అనేక వారాల క్రితమే సంబంధిత బృందం చైనా చేరుకుంది, చైనాలో కోవిడ్ కేసులు పెచ్చరిల్లిన నేపథ్యంలో సుదీర్ఘమైన క్వారంటైన్ పూర్తి చేసుకుంది. తాజాగా మే చివరి నాటికి పర్యటన జరపనున్నట్లు ప్రతినిధి లిజ్ థ్రాసెల్ విలేకర్లకు తెలిపారు. గుయాంగ్జు, జిన్జియాంగ్ ప్రాంతాల్లో బాచ్లెట్ పర్యటించనున్నారు. కానీ కోవిడ్ ఆంక్షల కారణంగా బీజింగ్ వెళ్ళరని చెప్పారు. దాదాపు వారం రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. అక్కడ ప్రభుత్వ ఉన్నతాధికారులను కలుసుకుని మాట్లాడతారని చెప్పారు. దేశీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ మానవ హక్కుల అంశాలపై చైనా ప్రభుత్వంతో, అధికారులతో చర్చలు జరపాలన్నదే ఈ పర్యటన ఉద్దేశ్యమని చెప్పారు. చైనా, ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల కార్యాలయం మధ్య మరింత కార్యకలాపాలకు ఈ పర్యటన వెసులుబాటు కల్పించగలదని భావిస్తున్నట్లు చెప్పారు. దాదాపు 10లక్షల మంది ముస్లిం మైనారిటీలు జిన్ జియాంగ్ శిబిరాల్లో బందీలుగా వున్నారని మానవ హక్కుల గ్రూపులు పేర్కొంటున్నాయి.