Apr 15,2021 10:09

* సంక్షేమంపైనే వైసిపి గురి
* పనబాకకు వ్యక్తిగత పరిచయాలు
* క్షేత్రస్థాయిలో కనిపించని బిజెపి-జనసేన ప్రచారం
* యాదగిరికి మద్దతుగా వామపక్షాల ప్రచారం

నెల్లూరు నుండి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి : తిరుపతి పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికకు ప్రచారం గురువారం సాయంత్రంతో ముగియనున్న నేపథ్యంలో ఆయా పార్టీల ప్రచారం ఉధృతమైంది. ఈ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి, సూళ్లూరుపేట, గూడూరు, సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. నేతలంతా తిరుపతి అర్బన్‌ తర్వాత ఈ ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. పార్లమెంట్‌ నియోజకవర్గం మొత్తంగా 17,02,084 ఓట్లు ఉండగా, చిత్తూరు జిల్లాలో 7,35,059 ఓట్లు, నెల్లూరు జిల్లాలో 9,67,025 ఓట్లు ఉన్నాయి. చిత్తూరు సెగ్మెంట్ల కంటే దాదాపు 2.32 లక్షల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల ఓటర్లను ఆకర్షించేలా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గత వారంరోజుల్లో జిల్లాలో ఏడుచోట్ల రోడ్‌ షో గానీ, సభల్లోగానీ పాల్గొన్నారు. అలాగే బిజెపి జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా కూడా నాయుడుపేట వచ్చి సభలో పాల్గొన్నారు. వైసిపికి చెందిన మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆదిమూలం , గౌతంరెడ్డి, ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌ రెడ్డి విస్తృత ప్రచారం చేస్తున్నారు. వామపక్షాల అభ్యర్థి తరపున ప్రచారం మినహా మిగతా పార్టీల ప్రచారం విధానాలు కాకుండా వ్యక్తిగత దూషణలు, సిబిఐ కేసులు, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసు, రాళ్ల దాడులు, దేవాలయాలు చుట్టూ తిరుగుతోంది. ప్రచారంలో కొంత పుంతలు తొక్కుతూ... ఆయా ప్రాంతాల్లో ఉన్న సామాజిక తరగతుల వారీగా...అదే సామాజిక నేతల చేత వైసిపి., టిడిపి., బిజెపి ప్రచారం చేయిస్తున్నాయి. సంక్షేమ పథకాల లబ్ధిని గ్రామీణులు ఎక్కువ మంది అస్వాదిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లోనూ వివిధ రూపాల్లో లబ్ధి పొందుతున్నా...విధానాల పట్ల ఆయా పార్టీల వైఖరులను నిశితంగా గమనిస్తున్నారు.. ప్రధానంగా తిరుపతి కేంద్రంగా 2014 ఎన్నికల్లో ప్రత్యేక హోదా విషయం, విభజన హామీల అమలు గురించి మోడీ ఇచ్చిన హామీల విషయం, ఆ తరువాత టిడిపి., వైసిపి వాటికోసం చేసిన ఆందోళనలు, ఆ తరువాత గత రెండేళ్లలో ఈ పార్టీలూ హోదా తీసుకురావడం మాని . పరస్పరం విమర్శించుకుంటూ పబ్బం గడుపుకుంటున్న తీరు గురించి పట్టణ ప్రాంత ప్రజల్లో చర్చ నడుస్తోంది. సిపిఎస్‌ రద్దు., వేతన సవరణలు, కరువు భత్యం వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం తమ పట్ల నిర్లక్ష్యధోరణితో ఉందని ఉద్యోగులు భావిస్తున్నారు.


వైసిపి విషయానికొస్తే .. గత రెండేళ్లలో ఇచ్చిన సంక్షేమ పథకాల లబ్దిని గుర్తు చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఎవరెవరికి ఏ ఏ లబ్ధి చేకూరిందో కూడా వివరిస్తున్నారు. ఇందుకు వాలంటీర్లను పెద్దఎత్తున వినియోగిస్తున్నట్లు ప్రత్యర్థి పార్టీలు బహిరంగంగానే విమర్శిస్తున్నాయి. సోషల్‌ మీడియాను వినియోగించుకోవడంలో వైసిపి ముందంజలో ఉంది. వారి అనుకూల ప్రచారం గావిస్తూ....తమ ప్రధానప్రత్యర్థిగా భావిస్తున్న టిడిపి వైఫల్యాలను, నేతల వ్యాఖ్యలను ప్రస్తావిస్తున్నారు. తాజాగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు లోకేష్‌నుద్ధేశించి, టిడిపి భవితవ్యం గురించి చేశారని చెపుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లోనే కాదు వైసిపి అనుకూల మీడియాల్లోనూ పెద్దఎత్తున హల్‌చల్‌ చేస్తోంది. వారి ప్రతికూల విషయాలు వస్తే.. ఆ పోస్టింగ్‌ పెట్టిన వారిని పిలిచి స్థానిక పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపిటిసి., జడ్‌పిటిసి.మున్సిపల్‌ ఎన్నికల్లో గెలిచిన వారిలో వైసిపి వారే ఎక్కువ ఉండడం ఆ పార్టీకి కలిసొచ్చిన ప్రధానాంశం. స్థానికంగా వారు పోలింగ్‌ను మేనేజ్‌ చేసుకునేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే గూడూరు పట్టణంలోనూ, నియోజకవర్గంలోనూ ఆ పార్టీ ఓట్లకు కొద్దిగా గండిపడే పరిస్థితి ఉంది. మూడు గ్రూపులు, ఆరుగురు నాయకులుగా ఇక్కడ వైసిపి నాయకత్వం ఉంది.


తెలుగుదేశం పార్టీ ఈ ఎన్నికల్లో చావో, రేవో అన్నట్లుగా పోరాడుతోంది. ప్రజల్లో అనుకూలత ఉంటే గెలవడం లేదా వైసిపి మెజార్టీని గణనీయంగా తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లుగా ఆ పార్టీ నాయకులే అంతర్గత సంభాషణల్లో చెపుతున్నారు. వైసిపి అభ్యర్థి రాజకీయాలకు కొత్తకావడం, టిడిపి అభ్యర్థి కేంద్ర మాజీ మంత్రిగా, నెల్లూరు ఎంపిగా జిల్లాకు సుపరిచితులు కావడం టిడిపికి కలిసొచ్చే అంశం. అయితే 2019 ఎన్నికలకు ముందు, ఆ తరువాత, అలాగే ఇటీవల స్థానిక ఎన్నికలు జరుగుతున్న క్రమంలో అనేకమంది టిడిపి నాయకులు వైసిపిలోకి వెళ్లడం, మరికొంతమంది విజిలెన్స్‌దాడులు, పోలీస్‌ కేసులు తదితర భయాల వల్ల రాజకీయాలకు దూరంగా ఉండడం ఆ పార్టీకి ప్రతికూల అంశం. . ఉన్న కొద్ది మంది నాయకులూ పోల్‌ మేనేజ్‌మెంట్‌కు ఉపయోగపడని వారేనని, జనంతో వారికి సంబంధాలు కూడా అంతంత మాత్రమేనని చెపుతున్నారు.


బిజెపి-జనసేన మధ్య సీటు విషయంలో ఏర్పడిన ప్రతిష్టంబన కొనసాగుతూనే ఉంది. బిజెపి అధ్యక్షుడు నడ్డా నాయుడుపేటకు వచ్చిన సందర్బంలో మినహా జనసేన నాయకత్వం పెద్దగా ప్రచారంలో పాల్గొనడం లేదు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కూడా బిజెపి-జనసేన ఉమ్మడి ప్రచారం చేసిందీ తక్కువే. తిరుపతి సీటు విషయంలో వచ్చిన పేచీ ప్రచారంపై పడిందని సమాచారం. వెంకటగిరి ప్రాంతంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలున్న చోట కాస్త ప్రచారం చేస్తున్నారు మినహా క్షేత్రస్థాయిలో ఉమ్మడి ప్రచారం లేదు. కాంగ్రెస్‌ ప్రభావం కూడా ఇక్కడ కనిపించడంలేదు. కాంగ్రెస్‌ అభ్యర్థి చింతా మోహన్‌ వ్యక్తిగత ఇమేజ్‌ తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్‌లోనే కాస్త కనిపించవచ్చని రాజకీయ వర్గాలు చెపుతున్నాయి.


ఈ పార్టీలకు, నేతలకు భిన్నంగా వామపక్షాలు బలపరిచిన సిపిఎం అభ్యర్థి యాదగిరి తరపున ప్రచారం జరుగుతోంది. సిపిఎం, సిపిఐ, ఇతర వామపక్షాల నేతలు ప్రచారంలో పాల్గొంటూ ..మోడీ, చంద్రబాబు, జగన్‌ పార్టీల వైఖరులను, విధానాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నారు. ప్రచార ఆర్బాటం.. సాదాసీదాగా ఉన్నా ....నేతల ప్రసంగాలను స్థానికులు ఆసక్తిగా వింటున్నారు.