Jun 02,2023 00:40
గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లు

ప్రజాశక్తి-రేపల్లె: రేపల్లె పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల కలగానే మిగులుతోంది. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఆధ్వర్యంలో చేపట్టిన బహుళ అంతస్తు భవన నిర్మాణాలు నేటికీ పూర్తి కాలేదు. పట్టణ ప్రాంత పేదప్రజల సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన టిడ్కో గృహ నిర్మాణాలు.. రేపల్లె పట్టణంలో లబ్ధిదారులకు తీరని వేదన కలిగిస్తున్నాయి. టిడ్కో గృహం మజూరైన కారణంగా 18వ వార్డులో నివేశన స్థలాలు దక్కలేదు. దీంతో చాలీచాలని గుడిసెల్లో, అద్దె ఇళ్లలో నానా అవస్థలు పడుతున్నారు. పట్టణంలోని మురికి వాడల్లో నివసించే పేదలకు సౌకర్యాలతో కూడిన బహుళ అంతస్తు భవనాలు నిర్మించి ఇవ్వాలని గత ప్రభుత్వం యోచించింది. 28 వార్డుల్లో ఇళ్లు లేని 1,344 మంది పేదలను పురపాలక సంఘ అధికారులు గుర్తించారు. ఇళ్ల నిర్మాణానికి పట్టణ శివారులో స్థలం కొన్నారు. లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలు కూడా అందజేసి పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. టీడీపీ హయాంలో పనులు శరవేగంగా సాగాయి. ఆ తర్వాత 2019లో వచ్చిన సార్వత్రిక ఎన్నికలు రావడం, వైసీపీ అధికారం చేపట్టడంతో టిడ్కో ఇళ్ల నిర్మాణం అటకెక్కింది. ఆ తరువాత బిల్లులు సక్రమంగా మంజూరు కాలేదు. దీంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. నాలుగేళ్లయినా భవన నిర్మాణాలు ప్రారంభానికి నోచుకోలేదు. ఎప్పుడు చేపడతారో తెలియక లబ్ధిదారుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది. నిర్మాణాల్లోని ఇనుప చువ్వలు తుప్పుపడుతున్నాయి.
అద్దె ఇళ్లలో అవస్థలు
టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి లబ్ధిదారులు ఏళ్లుగా ఎదురుచూస్తున్నారు. సొంతింటి కల నెరవేరుతుందన్న వారి ఆశలు రోజురోజుకూ నిరాశలవుతున్నాయి. ఓవైపు కూలి పనులు దొరకక, పిల్లలను చదివించుకోలేక నానా అవస్థలు పడుతుంటే.. మరోవైపు ఇంటి అద్దెను చెల్లించలేక అప్పుల మీద అప్పులు చేయాల్సి వస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం త్వరగా టిడ్కో ఇళ్లను నిర్మించి.. లబ్ధిదారులకు అందిస్తే.. వచ్చిన కూలి డబ్బులతో తమ కుటుంబాలను పోషించుకుంటామని చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి.. గత ప్రభుత్వ హయాంలో 80 శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను వెంటనే పూర్తి చేసి.. పేదవాడి సొంతింటి కలను సాకారం చేయాలని.. బాపట్ల జిల్లా రేపల్లె లబ్ధిదారులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.