Aug 04,2022 07:54

నాగార్జున సాగర్‌ ప్రస్తుత తెలంగాణలోని నల్గొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సరిహద్దుల్లో కృష్ణా నదిపై నిర్మింపబడిన ఆనకట్ట వల్ల ఏర్పడిన జలాశయం. ఇది దేశంలోని జలాశయాల సామర్థ్యంలో రెండవ స్థానంలో ఉంది. ఆనకట్ట పొడవులో మొదటి స్థానంలో ఉంది. కృష్ణా నదిపై నిర్మించబడ్డ ఆనకట్టల్లో నాగార్జునసాగర్‌ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. నాగార్జునసాగర్‌ ప్రముఖ బౌద్ధ చారిత్రక స్థలం. శాతవాహనుల కాలంనాటి శ్రీ పర్వతమే నాగార్జున కొండ. ఆచార్య నాగార్జునుడు ఈ ప్రాంతంలో బోధనలు చేసినట్లుగా చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాజెక్టుకు ఆ పేరు పెట్టారు. ఈ జలాశయానికి 11,560 మిలియన్‌ ఘనపు మీటర్ల నీటిని నిలువ చేయగల సామర్థ్యం ఉంది. దీని ద్వారా నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందించ బడుతున్నది. ఇక్కడ జల విద్యుత్‌ కేంద్రాలున్నాయి.నందికొండ గ్రామం నల్గొండ జిల్లా పెద్దవూర మండలంలో డ్యామ్‌ ఉంది.
ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రభుత్వం కష్ణానది నీటిని తమిళ దేశానికి తీసుకుపోయేందుకు కృష్ణా పెన్నా నదులను సంధించుటకు 'కృష్ణా-పెన్నార్‌ ప్రాజెక్ట్‌'ను బృహత్తర ప్రణాళికగా తలపెట్టింది. ఇది తెలిసి ముక్త్యాల రాజా ఆంధ్ర ప్రాంతంలోని తొమ్మిది జిల్లాలలో ప్రతి ఊరూ తిరిగి (38 వేల మైళ్ళు) డ్యామ్‌ నిర్మాణానికి సంతకాలు సేకరించి ప్రభుత్వానికి పంపారు. కృష్ణా నదిపై పరిశోధన ప్రణాళికలు సాధించి, ఆ రిపోర్టును అందించారు. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు దాటుకుని 1954లో నాగార్జునసాగర్‌ నిర్మాణానికి ఆమోదముద్ర లభించింది. 1955 డిసెంబరులో అప్పటి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసారు. తరువాత ప్రధాని ఇందిరా గాంధీ చేతుల మీదుగా 1967, ఆగస్టు 4న కుడి, ఎడమ కాలవలోనికి నీటి విడుదల జరిగింది.పిల్లలూ, ఈ రోజు నాగార్జున సాగర్‌ డ్యామ్‌ ప్రారంభించిన రోజు. మరి ఆ డ్యామ్‌ నిర్మాణానికి కృషి ఎలా జరిగిందో తెలుసుకుందామా!