Nov 29,2021 23:26

ఫొటో : కలెక్టర్‌ సమస్యను వివరిస్తున్న సర్పంచులు

ఫొటో : కలెక్టర్‌ సమస్యను వివరిస్తున్న సర్పంచులు
నిధుల మళ్లింపుపై సర్పంచ్‌ల ఆగ్రహం
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : పంచాయతీల నిధుల దారి మళ్లీంపుపై పలువురు సర్పంచ్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిధులు లేక తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి జిల్లా కలెక్టర్‌ చక్రధర్‌బాబుకు తోటపల్లిగూడూరు మండలం ముంగలదొరువు, నరుకూరు, చిన్నచెరుకూరు, విలుకానిపల్లి, ఇస్కపాలెం, కొత్తపాలెం పంచాయతీల సర్పంచ్‌లు ఇంగిలేల వెంకట చైతన్యకుమార్‌, కవిత, శారద, భాస్కర్‌, పావని, పద్మావతమ్మలు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ తాము 2021 ఫిబ్రవరిలో సర్పంచులుగా ఎన్నికయ్యామని తెలిపారు. నాటి నుంచి నేటి వరకు వడ్డీలకు డబ్బులు తెచ్చి పంచాయతీల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వారు పేర్కొన్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 14వ ఆర్థిక సంఘ నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయిలకు మళ్లించిందని తెలిపారు. కనీసం సర్పంచ్‌లకు ముందస్తుగా ఎటువంటి సమాచారం ఇవ్వకనే నిధులు మళ్లించడం ఎంతవరకు న్యాయమని బాధిత సర్పంచ్‌లు ప్రశ్నించారు. అంతేకాకుండా కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘ నిధులను కూడా మళ్లిండం జరిగిందని వారు వాపోయారు.
ప్రస్తుతం పంచాయతీల ఖాతాల్లో జీరో బ్యాలెన్స్‌ చూపుతోందని తెలిపారు. ప్రస్తుతం పంచాయతీలలో చేపట్టిన అభివృద్ధికి తాము తెచ్చి పెట్టిన పెట్టుబడులు, వడ్డీలు ఎలా కట్టాలో అర్థం కాని అయోమయంలో రాష్ట్ర ప్రభుత్వం తమను పడేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో పంచాయతీలను ప్రగతి పథంలోకి ఎలా నడిపించాలి తమను ఎన్నుకొన్న ప్రజలకు ఏమని సమాధానం చెప్పాలనేది అర్థం కాని దుస్థిలో తాము కొట్టుమిట్టాడుతున్నామని తెలిపారు. ''దేశానికి పట్టుకొమ్మలు పంచాయతీలు'' అనే విషయాన్ని విస్మరించి, తమ అనుమతి లేకుండా, తమకు తెలియకుండానే తమ నిధుల దారి మళ్లింపుపై యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుని అభివృద్ధి కుంటుపడకుండా చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. లేకపోతే తాము ఆందోళన బాట చేపట్టాల్సి వస్తుందని సర్పంచ్‌లు స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారికి కూడా సర్పంచ్‌లు వినతి పత్రం అందజేశారు.