Jul 24,2021 06:45

ఇప్పుడు శత్రువెక్కడో లేడు
మనతోనే వున్నాడు
మనలోనే వున్నాడు
నీ మాటల్ని
మూటలు కట్టేసి మోసేస్తుంటాడు
పీల్చే ఊపిరి సడిని సైతం
ఇంకెవరో గమనిస్తున్నారు
నీవేళ్ల కదలికల్ని
చూపుల సొబగుల్ని
ఒడిసి పట్టి మరీ
ఊడ్చేస్తుంటాడు
నీవిప్పుడు
పెగాసస్‌ నిఘా చెరసాలలో
నిత్య బందీవి
గోప్యతా బతుకు పుస్తకాన్ని
చించేసి విశ్వవీధుల్లోకి
విసిరేసినోడివి
ప్రశ్నించే నోళ్లు నొక్కేయడానికి
ఎదురించే శక్తుల్ని తొక్కేయడానికి
కొత్త దారులు వెతుకుతుంటే...
అన్నం పెట్టే వేల గొంతులు
నిరవధిక నినాదాలు
వినిపించని వాళ్ళు
పరుల వ్యక్తిగతాల్లోకి దూరిపోయి
తొంగి తొంగి చూసే
కుటిల పన్నాగం
ముచ్చటకైనా
కొన్ని కబుర్లు పదిలపర్చుకోలేకపోతే
ఎదలోతుల్లో పుట్టుకొచ్చే
భావజాలం పంచుకొనే
స్వేచ్ఛ లేకపోతే
సొంత గడ్డ మీదే
హక్కులు కాలరాసుకున్న బానిసవు
ఇప్పుడు నీవు
పెగాసస్‌ నిఘా చెరసాలలో
నిత్య బందీవి
గోప్యతా బతుకు పుస్తకాన్ని
చించేసి విశ్వవీధుల్లోకి
విసిరేసినోడివి
గుట్టు బతుకులు
బట్టబయలు చేసే
సైబర్‌ ఆయుధాల
లోగుట్టు విప్పాల్సిందే !
 

- చిలుకూరి శ్రీనివాసరావు,
సెల్‌ : 8985945506