Jul 25,2021 06:49

- వీటి ఆధారంగానే భారత్‌లో 136మంది జాబితా విడుదల
-'ద వైర్‌' సహా 17 ప్రపంచ వార్తా సంస్థల సంయుక్త పరిశోధన

న్యూఢిల్లీ : దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న టాపిక్‌ 'పెగాసస్‌ ప్రాజెక్ట్‌'. ఇజ్రాయెల్‌కు చెందిన 'ఎన్‌ఎస్‌ఓ' గ్రూప్‌ తయారుచేసిన మిలటరీ గ్రేడ్‌ (అత్యంత అధునాతమైనది) స్పైవేర్‌ 'పెగాసస్‌'. దీనిని ఏ ఏ దేశాలు వాడుతున్నాయి? ఎవరెవరిపై (2018-19మధ్యకాలంలో) అక్రమ నిఘా ఉంది? అనేదాన్ని 17 వార్తా సంస్థలు (ఇందులో 'ద వైర్‌' ఒకటి) బయటపెట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ వార్తా సంస్థల జర్నలిస్టులు సంయుక్తంగా జరిపిన పరిశోధనే 'పెగాసస్‌ ప్రాజెక్ట్‌'. 80 మందికిపైగా జర్నలిస్టులు ఇందులో భాగస్వాములయ్యారు. వీరికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ వారి 'సెక్యూరిటీ ల్యాబ్‌' సాంకేతిక సహకారం అందించింది. 'పెగాసస్‌ ప్రాజెక్ట్‌'కి సంబంధించి తన పరిశోధనాత్మక వార్తా కథనాన్ని గత ఆదివారం రాత్రి 9.30 గంటలకు న్యూస్‌ వెబ్‌పోర్టల్‌ 'ద వైర్‌' విడుదల చేసింది. మోడీ సర్కార్‌ 'పెగాసస్‌' స్పైవేర్‌తో ఎవరెవరిపై అక్రమ నిఘాకు పాల్పడిందన్నది వార్తా కథనంలో పేర్కొన్నారు.
డేటా బేస్‌తో మొదలు
ఫ్రాన్స్‌కు చెందిన మీడియా సంస్థ 'ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌' (లాభాపేక్షలేని ఎన్‌జిఒ సంస్థ) అత్యంత కీలకమైన సమాచారాన్ని సంపాదించింది. ఎన్‌ఎస్‌ఓ టార్గెట్‌ చేసిన (స్పైవేర్‌ పెగాసస్‌తో..) 50వేలమంది వ్యక్తుల ఫోన్‌ నెంబర్లు ఆ సమాచారంలో ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో రక్షణ, రాజకీయ సంబంధాలున్న దేశాలకు, మిలటరీ ఏజెన్సీలకు మాత్రమే 'పెగాసస్‌'ను ఎన్‌ఎస్‌ఓ అమ్మింది. స్పైవేర్‌ను కొనుగోలు చేసిన దేశాల్లో భారత్‌ కూడా ఉంది. 'ఫర్‌బిడెన్‌ స్టోరీస్‌'కు అందిన సమాచారంలో వాస్తవాల్ని తేల్చేందుకు తొలుత 1500 ఫోన్‌ నెంబర్లపై పరిశీలన జరిగింది. 10 దేశాలకు చెందిన ఈ ఫోన్‌ నెంబర్లు ఎవరివి? వీరి ఫోన్లు స్పైవేర్‌బారిన పడ్డాయా? లేదా? అన్నది తెలుసుకున్నారు. ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ద్వారా పరీక్షలు జరిపి.. స్పైవేర్‌ చొరబడిందనే విషయం రూఢ చేసుకున్నారు. మోడీ సర్కార్‌ అక్రమ నిఘాకు గురైన 136మంది ప్రముఖల జాబితాను 'ద వైర్‌' విడుదల చేసింది.
జర్నలిస్టులు
భారత్‌లో కనీసం 40మంది జర్నలిస్టులపై అక్రమ నిఘా ఉందని తేలింది. ఇందులో ఏడుగురు జర్నలిస్టుల ఫోన్లపై ఫోరెన్సిక్‌ పరీక్షలు జరపగా, ఐదు ఫోన్లలో పెగాసస్‌ చొరబడిందని ల్యాబ్‌లో తేలింది. మిగతా రెండు ఫోన్లపై హ్యాకింగ్‌ ప్రక్రియ ముగిసిందని ల్యాబ్‌ నిర్ధారించింది. 'ద వైర్‌' వ్యవస్థాపక ఎడిటర్‌లో ఒకరైన ఎం.కె.వేణు స్మార్ట్‌ఫోన్‌లో పెగాసస్‌ చొరబడిందని ల్యాబ్‌లో తేలింది. సుశాంత్‌ సింగ్‌(ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ మాజీ జర్నలిస్టు), సిద్ధార్థ వరదరాజన్‌ ('ద వైర్‌' వ్యవస్థాపక ఎడిటర్లలో ఒకరు), ప్రంజో గుహా థాకుర్తా (ఇపిడబ్ల్యూ మాజీ ఎడిటర్‌), ఎస్‌.ఎన్‌.ఎం.ఆబ్డీ (ఔట్‌లుక్‌ మాజీ జర్నలిస్టు), విజేతా సింగ్‌ (ద హిందూ జర్నలిస్టు), స్మితా శర్మ (టీవీ18 మాజీ యాంకర్‌), సుశీర్‌ గుప్తా (హిందుస్తాన్‌ టైమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌), రోహిన్‌ సింగ్‌ (ఫ్రీలాన్స్‌ జర్నలిస్టు), దేవీరూపా మిత్రా (ద వైర్‌), ప్రశాంత్‌ ఝా (హిందుస్తాన్‌ టైమ్స్‌), ప్రేమ్‌ శంకర్‌ ఝా (హిందుస్తాన్‌ టైమ్స్‌ మాజీ జర్నలిస్టు), స్వాతీ చతుర్వేది (ద వైర్‌), రాహుల్‌సింగ్‌ (హిందుస్తాన్‌ టైమ్స్‌)...తదితరులు హ్యాకింగ్‌కు గురైన లక్షిత జాబితాలో ఉన్నారు.
రాజకీయ ప్రముఖులు
కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ, ఆయన సహాయకులు అలంకార్‌ సవారు, సచిన్‌ రారు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌, మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్‌ బెనర్జీ, కేంద్ర మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌, మరో కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌, ఆయన భార్య, సహాయకులు, వంటవాడు, తోటమాలి, విహెచ్‌పి మాజీ హెడ్‌ ప్రవీణ్‌ తొగాడియా, కర్నాటకలో కుమారస్వామి ప్రభుత్వాన్ని కూల్చిన జెడి(ఎస్‌) తిరుగుబాటు నేత జి.పరమేశ్వర, కర్నాటక సీఎంగా కుమారస్వామి ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి సతీశ్‌, కర్నాటక సీఎంగా సిద్ధరామయ్య ఉన్పప్పుడు ఆయన వ్యక్తిగత కార్యదర్శి వెంకటేశ్‌, మాజీ ప్రధాని దేవగౌడ వ్యక్తిగత భద్రతా అధికారి మంజూనాథ్‌ ముద్దేగౌడ... మొదలైనవారు ఉన్నారు.
మరికొంత మంది..
మాజీ ఎన్నికల కమిషనర్‌ అశోక్‌ లావాసా, హనీ బాబు (ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్‌), రోనా విల్సన్‌ (హక్కుల కార్యకర్త), ఆనంద్‌ తేల్‌తుంబ్డే (విద్యావేత్త, పౌరహక్కుల కార్యకర్త), గౌతం నవలాఖా, పౌర హక్కుల నేత వరవరరావు కుమార్తె పావన, ఉమర్‌ ఖలీద్‌ (జెేఎన్‌యు మాజీ విద్యార్థి), రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ జి.హరగోపాల్‌, సుప్రీంకోర్టు మాజీ సీజేఐ రంజన్‌ గొగోరుపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సుప్రీంకోర్టు మాజీ మహిళా ఉద్యోగి, సిబిఐ మాజీ చీఫ్‌ అలోక్‌ వర్మ, రాకేశ్‌ ఆస్తానా (సిబిఐ ఉన్నతాధికారిగా పనిచేశారు), ఎ.కె.శర్మ (సిబిఐ ఉన్నతాధికారి), అనిల్‌ అంబానీ (రిలయన్స్‌ అడాగ్‌ చైర్మెన్‌), బోయింగ్‌ ఇండియా హెడ్‌ ప్రత్యూశ్‌ కుమార్‌..మొదలైనవారు ఉన్నారు.