Nov 30,2022 22:03

సచివాలయం వద్ద ధర్నా చేస్తున్న సిపిఎం నాయకులు, గిరిజనులు

ప్రజాశక్తి - కురుపాం : నీలకంఠాపురంలో బ్యాంకు ఏర్పాటు చేయాలని సిపిఎం ఆధ్వర్యాన గ్రామ సచివాలయం వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కొల్లి గంగునాయుడు, కోలక అవినాష్‌ మాట్లాడుతూ నీలకంఠాపురం గ్రామానికి 9 పంచాయతీలు సమీపంలో ఉన్నాయని తెలిపారు. గతంలో ఉన్న ఎస్‌బిఐ బ్రాంచిని ఎత్తేయడం వల్ల గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. సుమారు 10 వేల వరకు అకౌంట్లు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక్కడ బ్యాంకు లేకపోవడం వల్ల వేల మంది జనాభా అమ్మఒడి, రైతు భరోసా, తదితర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు, డ్వాక్రా మహిళలు కురుపాం, గుమ్మలక్ష్మీపురం వెళ్లాల్సి వస్తోందని చెప్పారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీలకంఠాపురంలో బ్యాంకును ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం సచివాలయంలో వినతినిచ్చారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, చెముడుగూడ ఎంపిటిసి ఎం.రమణ, మాజీ ఎంపిటిసి మహేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.