Jun 02,2023 21:18

నీటి పంపింగ్‌ మోటార్లను పరిశీలిస్తున్న మేయర్‌ మహమ్మద్‌ వసీం

         ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్‌   నగరానికి తాగునీరు అందించే పిఎబిఆర్‌ పంపింగ్‌ కేంద్రంలో మోటార్లు మరమ్మతుల రిపేరీలో నిర్లక్ష్యం చేయవద్దని మేయర్‌ మహమ్మద్‌ వసీం సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు స్థానిక పిఎబిఆర్‌ పంపింగ్‌ కేంద్రంలో రెండవ మోటార్‌ మరమ్మతులకు గురి కావడంతో చేపట్టిన మరమ్మతులను కమిషనర్‌ రమణారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రెండవ మోటార్‌ చెడిపోవడంతో నీటి సమస్య తలెత్తకుండా అదనపు మోటార్‌ ద్వారా నీటి పంపింగ్‌ చేపడుతున్నట్లు అధికారులు వివరించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ గతంలో కేవలం మూడు మోటార్లు మాత్రమే ఉండడంతో ఒక మోటార్‌ చెడిపోతే నగరానికి తాగునీరు సరఫరా చేయడానికి ఇబ్బంది ఏర్పడేదన్నారు. అయితే తమ పాలకవర్గం ఏర్పాటైన తర్వాత అదనంగా మరో అధిక సామర్థ్యం ఉన్న మోటారును రూ.80 లక్షలు వెచ్చించి ఏర్పాటు చేయించామన్నారు. ప్రస్తుతం వర్షాలు ప్రారంభం కావడంతో హైవోల్టేజ్‌ వచ్చినా మోటార్లు చెడిపోకుండా ఉండడానికి విద్యుత్‌ నియంత్రికలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సైఫుల్లాబేగ్‌, అనిల్‌కుమార్‌రెడ్డి, ఇఇ చంద్రశేఖర్‌, ఎఇ సాయి, తదితరులు పాల్గొన్నారు.
కొవ్వూరు నగర్‌లో రోడ్‌ సర్వే పరిశీలన
నగరంలోని 38వ డివిజన్‌ పరిధిలో ఉన్న కోవూర్‌నగర్‌లో చేపట్టిన రోడ్డు సర్వేను మేయర్‌ మహమ్మద్‌ వసీం పరిశీలించారు. ఈ ప్రాంతంలో 3 అడుగులు మేరకు రోడ్డులో బండలు నాటినట్లు సర్వేలో గుర్తించి తొలగించుకోవాలని స్థానికులకు సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నగర ప్రజల సౌకర్యం కోసం ఏర్పాటు చేస్తున్న రహదారుల అభివృద్ధి పనులకు అందరి సహకారం అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ అనిల్‌కుమార్‌రెడ్డి, డిఇ రాంప్రసాద్‌రెడ్డి, సర్వేయర్‌ ప్రభాకర్‌, బిల్డింగ్‌ ఇన్స్‌స్పెక్టర్‌ దుర్గాంజలి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.