
ప్రజాశక్తి - కాకినాడ : పోలవరం కాఫర్‌డ్యామ్ పనుల దష్ట్యా ఏప్రిల్ 1 నుంచి గోదావరి కాలువలకు నీటి విడుదల నిలుపుదల చేయనున్నందున నీటి వినియోగంలో పొదుపు చర్యలు తప్పనిసరిగా పాటించే విధంగా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ తన కార్యాలయంలో కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్పప్నిల్దినకరపుండ్కర్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, వ్యవసాయశాఖ అధికారులతో నీటి వినియోగంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీరు, సాగునీటికి ఎంత నీరు అవసరం, ఎలాంటి పొదుపు చర్యలు పాటించాలి, ప్రాంతాల వారిగా పూర్తి సమాచారం ఉండాలన్నారు. నీటి పొదుపు చర్యలపై స్థానిక ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అదే విధంగా జలవనరుల, గ్రామీణ నీటి సరఫరా, పబ్లిక్ హెల్త్ ఇంజినీర్లు, వ్యవసాయశాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. కాకినాడ నగరంలో తాగునీటి పొదుపు చర్యల్లో భాగంగా ఈ నెల 26వ తేదీ శుక్రవారం మద్యాహ్నం 5 గంటల నుంచి సాయంత్రం 6.30 వరకు పవర్ కట్ వుండే విధంగా నిర్ణయించామన్నారు. మోటారు వాడకం, పొదుపుగా నీటి వినియోగం, పవర్ కట్ లాంటి అంశాలను వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ వెళ్లి సమాచారం అందించే విధంగా స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. ముఖ్యంగా కాకినాడ నగరపాలక సంస్థకు సరఫరా చేసే సామర్లకోట, అరట్లకట్ట పంపింణీ కేంద్రాల్లో నిరంతరం నీటి నిల్వల స్థాయిని గమనిస్తుండాలన్నారు. ఈ కేంద్రాల్లో 20 నుండి 25 క్యూసెక్ల నీటిని జల వనరుల విభాగం సరఫరా చేస్తుందన్నారు. నీటి ఎద్దడి ఎదుర్కొనే ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు.