Oct 14,2021 01:03

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
విశాఖ మహా నగరం... నీటి వ్యాపారంలోనూ ఇదే స్థానం.. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న నీటి వ్యాపార సంస్థలకు నగర పాలకులు ఇష్టారాజ్యంగా లైసెన్సులు మంజూరు చేస్తున్నారు. అదే సందర్భంలో నగరవాసులకు తాగునీటి సరఫరా విషయంలో లక్ష్యాలకు ఆమడ దూరంలో ఉన్నారు. 2021 నివేదిక ప్రకారం జివిఎంసిలో 98 వార్డుల్లో 17.27లక్షల ఓటర్లుండగా, జనాభా 26లక్షల మంది ఉన్నారు. 2030 నాటికి సుమారు 29 లక్షలకు చేరిపోయే అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీల కుటుంబాలు, చిన్న చిన్న పట్టణాల్లో పనులు దొరకని జనం విశాఖ ముఖద్వారానికి చేరడం 15ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. నగరంలో చిన్నా, చితకా పరిశ్రమలూ ఉన్నాయి. పెరిగే అవకాశాలూ ఉన్నాయి. ఏటా వేసవి వచ్చిందంటే చాలు తాగునీటికి జనం అల్లాడిపోతున్నారు. జనవరిలో సంక్రాంతి తర్వాత నీటి చుక్కల కోసం జనం రోడ్లపైకొచ్చే పరిస్థితులూ విశాఖ నగరంలో లేకపోలేదు. సుమారు 40 ప్రాంతాల్లో ఈ తాగునీటి కోసం ఎదురు చాసే పరిస్థితి నేటికీ ఉంది. జివిఎంసి నీరు లభ్యం అవుతున్న చోట ప్రజలు వినియోగిస్తున్నారు. కాని లభించని చోట నీటి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి. రోజుకు రూ.కోట్లలోనే వ్యాపారం చేస్తున్నాయి. నగర పాలకులు నీటి సమస్యను ఎదుర్కొనే ప్రణాళికలు వేయడంలో శ్రద్ధ చూపకపోవడం వెల్లడవుతోంది. భవిష్యత్‌లో నీటి కష్టాలకు వీరివద్ద సమాధానం దొరకని చిక్కు ప్రశ్నగానే ఉందన్నది తెలుస్తోంది.
విశాఖకు నీటి అవసరం ఎంత? వస్తున్నదెంత?
నగరానికి 108 ఎంజిడి (మిలియన్‌ గ్యాలన్‌ పర్‌ డే) నీరు అవసరం. ఇది కూడా 23లక్షల జనాభాకి సరిపోయే నీరు. కానీ పరిశ్రమలకు, గృహావసరాలకు కలిపి విశాఖకు 85 ఎంజిడి మాత్రమే వస్తోంది. తాటిపూడి, రైవాడ, మేఘాద్రిగెడ్డ, గోస్తనీ నుంచి 40 ఎంజిడి, మిగతా 85 ఎంజిడి ఏలేశ్వరం నుంచి వస్తోంది. ఏలేశ్వరం నుంచి పైప్‌లైన్‌ ద్వారా తీసుకునే ఆలోచన, ప్రణాళిక ప్రభుత్వం వేసింది. రూ.3500 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక రూపొందించినా అది డిపిఆర్‌ దశలోనే ఉంది. పరిపాలనా పరమైన ఆమోదం లభించలేదు. ఈ పైప్‌లైన్‌ ప్రణాళిక ఆగిపోతే విశాఖకు తీవ్రనష్టమే వాటిల్లగలదనడంలో ఎలాంటి సందేహం లేదు. రెండేళ్లుగా ఈ ప్రాతిపాదన పెండింగ్‌లోనే ఉంది. పోలవరం నుంచి పైప్‌లైన్‌ ద్వారా 195 ఎంజిడిలు తీసుకుని, విశాఖకు ఇప్పుడొస్తున్న 85 ఎంజిడి గాక ఎంత అవసరమో మిగతా 23 ఎంజిడిలను కూడా నెట్‌వర్క్‌ సిస్టం ద్వారా తీసుకునే ప్రణాళిక ఉన్నా ఆచరణలో ఈ ఫైలు కదలడం లేదు. ప్రస్తుతం ఏలేశ్వరం నుంచి తీసుకొస్తున్న 45 ఎంజిడిలను కూడా ఓపెన్‌ కెనాల్స్‌ ద్వారా మనం తీసుకుంటున్నాం. దీంట్లో కొన్ని ఇబ్బందులను జివిఎంసి ఎదుర్కొంటుంది. అనుకున్న నీరంతా రావడం లేదు. ఈ నేపథ్యంలో పోలవరం నుంచి ప్రత్యేక పైప్‌లైన్‌ ప్రణాళిక వేశారు.